కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
రెడీ మిక్స్, 60 ఎంఎం కంకరతో సీసీల నిర్మాణం..ఒక కాలనీలో నిర్మించాల్సిన రోడ్లను మరో కాలనీలో.. కంకరపరచి వదిలేస్తున్న మెటల్ రోడ్లు.. వెరసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వం మంజూరు చేస్తున్న కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయి. తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న సీసీ, మెడల్, బీటీల నిర్మాణాలు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి
ఎస్ఎల్బీసీ ఆయకట్టు పరిధి గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, కాలువల వరకు రహదారి సౌకర్యార్థం మెటల్, బీటీ రోడ్ల నిర్మాణాలకు ఏడాది క్రితం ప్రభుత్వం *10 కోట్లను విడుదల చేసింది. దీంతో మండలంలోని ఇందుగు ల, సర్వారం, ఇండ్లూరు, గడ్డికొండారం, ఎర్రగడ్డలగూడెం, ఖాజీరామారం, తానేదార్పల్లి, కంకణాలపల్లి, పెద్దసూరారం, చిన్నసూరారం, పజ్జూరు గ్రామాల్లో అభి వృద్ధి పనులు చేపడుతున్నారు.
ఒక చోట వేయాల్సిన రోడ్డు మరోచోట..
మండలంలోని ఎర్రగడ్డలగూడెం, ఖాజీరామారం, గ్రామాల్లో ఎస్సీ కాలనీలో వేయాల్సిన సీసీరోడ్లు, మరో కాలనీలో వేస్తున్నారు. ఆ నిధులు కేవలం ఎస్సీ కాలనీల అభివృద్ధి కోసమే వినియోగించాల్సి ఉండగా అధికారులు, కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా ఆ రోడ్లను మరోచోట వేస్తున్నారు. ఎర్రగడ్డలగూడెంలో గ్రామం నుంచి కాల్వను కలుపుతూ వెళ్లే రోడ్లు ఎస్సీ కాలనీ నుంచి డి-40 కాల్వ వరకు వేయాలని రైతులంతా కోరుతున్నా అవేమి పట్టించుకో వడం లేదు. ఎర్రగడ్లగూడెం గ్రామం నుంచి లక్ష్మిపురం వెళ్లే రోడ్డునే నిర్మిస్తున్నారు. ఇలా పలు గ్రామాల్లో ఓ చోట చేపట్టాల్సిన పనులను మరో చోట చేస్తుండడంతో ఆయా గ్రామా ల ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
అసంపూర్తి పనులతో అవస్థలు...
పెద్ద సూరారం, ఎర్రగడ్డలగూడెం గ్రామా ల్లో అసంపూర్తిగా రోడ్డు పనులను వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నకిరేకల్ అడ్డరోడ్డు నుంచి గ్రామం వరకు మెటల్రోడ్డు వేసి వదిలేయగా కంకర తేలి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అలాగే ఎర్రగడ్డలగూడెం గ్రామం నుంచి లక్ష్మీపురం వెళ్లే దారికూడా వేసిన వారం రోజులకే కంకర తేలింది. దీంతో పెద్ద సూరారంలో సీసీరోడ్లు వేసి పక్కన మట్టివేయకుండా వదిలేశారు. అధికారులకు పలుమార్లు చెప్పినా రేపుమాపు అంటూ సమాధానం దాటవేస్తున్నారే తప్ప సమస్య పరిష్కరించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.