అధికారులకు చెమటలు పట్టించిన సబ్ కలెక్టర్
ధారూరు (రంగారెడ్డి) : వికారాబాద్ సబ్ కలెక్టర్ శృతి ఓజా ధారూరు మండల అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. మంగళవారం మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో మండల అధికారులతో వివిధ సమస్యలపై ఆమె సమీక్ష జరిపారు. మండుతున్న ఎండలతో ప్రజల నీటి కష్టాల గురించి తెలుసుకునేందుకు సబ్ కలెక్టర్.. ఆర్‌డబ్ల్యూస్ ఏఈఈగా ఇటీవల నియమితులైన శివ రవళిని వివరాలు చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇన్చార్జ్ ఏఈ అలీమొద్దీన్ తనకింకా బాధ్యతలు అప్పగించలేదని, సమాచారం తన వద్ద లేదని ఆమె బదులిచ్చారు. దీంతో సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వివరాలు లేకుండా సమావేశానికి ఎందుకు వచ్చినట్లు అని ప్రశ్నించారు.
గ్రామ సభలకు ఎంతమంది ప్రజలు హాజరవుతున్నారు? వారిలో మహిళలు ఎందరు? అని సబ్ కలెక్టర్ గ్రామ కార్యదర్శులను ప్రశ్నించారు. 30 నుంచి 60 మంది మాత్రమే హాజరవుతున్నారని, వారిలో మహిళలు చాలా తక్కువగా ఉంటున్నారని వారు ఆమె దృష్టికి తెచ్చారు. ధారూరు మండల కేంద్రం జనాభా ఎంత అని కార్యదర్శి రంజిత్‌కుమార్‌ను ప్రశ్నించగా 5653 మంది అని చెప్పడంతో ఇక్కడ కూడా 60 మందే వస్తే ఎలా అని అడిగారు.
గ్రామాల్లో జనన, మరణాలు నమోదు చేస్తున్నారా, ఎన్ని కేసులు మీ దృష్టికి వచ్చాయని తహసీల్దార్ శ్రీనివాస్‌ను ప్రశ్నించగా.. 150 కేసులు ఉన్నాయని చెప్పారు. అనుమానం వచ్చిన ఆమె అక్కడి వీఆర్వోలను ప్రశ్నించగా 80 కేసులే లెక్కకు వచ్చాయి. దీంతో లెక్క సరి చూసుకోవాలని తహశీల్దార్‌కు సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అవకాశాన్ని అందరు విద్యార్థులూ వినియోగించుకునేలా చూడాలని సబ్‌కలెక్టర్ శృతి ఓజా ఎంఈవో బాబూసింగ్‌కు సూచించారు.