ఎంపీపీతో అరబిందో, హెటిరో ఒప్పందాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హెచ్ఐవీ, హెపటైటిస్ సీ ఔషధాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితిలో భాగమైన మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ)తో అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ తదితర ఆరు సంస్థలు సబ్లెసైన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అల్పాదాయ దేశాల ప్రజలకు అందుబాటు ధరలో మరిన్ని ఔషధాలను సరఫరా చేసేందుకు ఇవి ఉపయోగపడగలవని ఎంపీపీ ఈడీ గ్రెగ్ పెరీ తెలిపారు. ఇప్పటికే ఎంపీపీ భాగస్వామిగా ఉన్న అరబిందో కొత్తగా రెండు సబ్-లెసైన్సులు కుదుర్చుకుంది.
మొదటి దాని కింద ఆఫ్రికా కోసం లొపినావిర్, రిటోనావిర్ ఉత్పత్తి చేయనుండగా, రెండో దాని కింద ఇతర కంపెనీలతో కలిసి బీఎంఎస్కి చెందిన హెపటైటిస్ సీ ఔషధం అభివృద్ధిలో పాలుపంచుకోనుందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. అటాజాన్విర్, రాల్టెగ్రావిర్ చౌక వెర్షన్లు తయారు చేసేందుకు సబ్-లెసైన్స్లు తోడ్పడనున్నట్లు హెటిరో డ్రగ్స్ డెరైక్టర్ భవేష్ షా వివరించారు. మరికొన్ని ఔషధాల కోసం లారస్, లుపిన్, జైడస్ తదితర సంస్థలు సబ్-లెసైన్సులు దక్కించుకున్నాయి.