భారీగా సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు
భూకుంభకోణం నేపథ్యంలో సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన 29 సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వివిధ జిల్లాల సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. డీఐజీ, జిల్లా కార్యాలయాల్లో సూపరిం టెండెంట్లుగా పనిచేస్తున్న వారికి సబ్ రిజిస్ట్రార్లుగా పోస్టింగ్ ఇచ్చారు.
భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కూకట్పల్లి, బాలా నగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఇక చంపాపేట, గండిపేట, శంకర్పల్లి, రాజేంద్రనగర్, ఆజంపూర్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లను వారి స్థానాల నుంచి బదిలీ చేసినా.. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సీఎం, డిప్యూటీ సీఎంలతో రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నబీ, నోడల్ డీఐజీ శ్రీనివాసులు మంగళవారం రాత్రి వరకు కసరత్తు చేసిన అనంతరం ఈ బదిలీలు జరిగాయి.