ఉ‘భయ’ గోదావరి
♦ తెలంగాణ ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున వరదనీరు
♦ ఉప్పొంగుతున్న ఉపనదులు
సాక్షి, హైదరాబాద్: ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, సింగూరు, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో సోమవారం ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. ఛత్తీస్గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తోండటంతో ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉప్పొంగుతున్నాయి. ఆదివారం ధవళేశ్వరం బ్యారేజీకి 2,42,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ఆదివారం మరో 20.83 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి.
మరో ఉపరితల ఆవర్తనం నేడు, రేపు విస్తారంగా వానలు
రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు ఇంకా పొం చి ఉంది. రాబోయే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, 28, 29 తేదీల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం రాత్రి పేర్కొంది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే ఇందుకు కారణం. ఇది అండమాన్ - ఆంధ్రప్రదేశ్ తీరం మధ్య కోస్తాంధ్రకు కొంత సమీపంలోనే ఉంది. దీంతో ఈ నెల 28, 29 తేదీల్లో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.