సబ్స్టేషన్ నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్తులు
కీసర (రంగారెడ్డి జిల్లా) : రాంపల్లి గ్రామంలోని ఆర్ఎల్ నగర్ సమీపంలోగల పాత చెరువు వద్ద కొత్తగా నిర్మించనున్న సబ్స్టేషన్ పనులను శనివారం ఆ గ్రామ దళితులు అడ్డుకున్నారు. సబ్స్టేషన్ నిర్మించేందుకు గ్రామంలోని సర్వే నెం.388లో గల ప్రభుత్వ స్థలంలో సుమారు అరఎకరం స్థలాన్ని కేటాయించిన సంగతి విధితమే.
ఈ మేరకు శనివారం ట్రాన్స్కో అధికారులు ఈ స్థలాన్ని జేసీబితో చదును చేయించేందుకు యత్నించగా విషయం తెలుసుకున్న గ్రామ దళితులు అక్కడకు చేరుకుని తాము ఈ స్థలంలో ఏళ్లతరబడి వ్యవసాయం చేసుకుంటున్నామని, ఈ స్థలంలో సబ్స్టేషన్ నిర్మిస్తే తమ పరిస్థితి ఏమిటని ట్రాన్స్కో అధికారులను ప్రశ్నించారు.
తమ తాతల కాలం నాటి నుండి ఈ స్థలంలో తాము వ్యవసాయం చేసుకుంటున్నామని.. ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్న దళితుల భూములను లాక్కోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో చేసేది ఏమీలేక అధికారులు అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయారు.