పీఎఫ్ ఇవ్వాలంటే లంచం కొట్టాలి
విజయవాడ:
రిటైర్డ్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటున్న సబ్ ట్రెజరీ అధికారి ఏసిబి వలలో చిక్కారు. విజయవాడ గవర్నర్‌పేటలో ఎన్.టి.ఆర్ కాంప్లెక్స్‌లో ఉన్న డివిజినల్ సబ్–ట్రెజరీ కార్యాలయంలో ఎస్టిఓ అయిన బి. మోహన్‌రావు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ఎస్.గోపాలకృష్ణ తెలిపిన మేరకు ముత్యాలంపాడు గవర్నమెంటు ప్రిటింగ్ ప్రెస్‌లో పని చేసి రిటైర్ అయిన సూర్యదేవర జగన్నాధరావు ఇ.పి.ఎఫ్. నిధులు రూ. 8.94 లక్షలు మంజూరు చేసేందుకు సబ్–ట్రెజరీ అదికారి మోహన్‌రావు రూ. 3,500 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసిబి అధికారులను ఆశ్రయించారు. మోహన్‌రావు శనివారం కార్యాలయంలోనే జగన్నాథరావు నుంచి లంచం తీసుకున్న వెంటనే కాపుకాసిన ఏసిబి అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లంచం డబ్బుకు రసాయన పరీక్ష జరిపి నిర్దారించారు. అధికారిపై కేసు నమోదు చేశారు.
మూడు నెలల నుంచి తిప్పుకుంటున్నారు
కాగా తాను ఏప్రిల్ నెలలో రిటైర్ అయ్యాయని జగన్నాధరావు మీడియాకు చెప్పారు. తనకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ మొత్తం రూ. 8.94 లక్షలు బిల్లు పాస్ చేయకుండా సబ్–ట్రెజరీ అధికారి మోహనరావు తొక్కిపెట్టారని తెలిపారు. తాను అనేక సార్లు తిరిగినా కనికరించలేదన్నారు. దీనిపై సబ్–ట్రెజరీలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. మధ్యవర్తి ద్వారా ఎస్.టి.ఓ.ను సంప్రదించగా రు. 3,500లు లంచం ఇస్తేనే పనిచేస్తానని స్పష్టంచేయడంతో దిక్కుతోచక ఏసీబీ ఆశ్రయించినట్లు వివరించారు.
అవినీతి నిలయం ఆ ట్రెజరీ కేంద్రం
కాగా అవినీతి నిలయంగా ఆ ట్రెజరీ కేంద్రానికి పేరుంది. గత రేండేళ్ళలో నాలుగు సార్లు ఏసిబి దాడులు నిర్వహించి నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. గతంలో పోలీసు అధికారుల బిల్లులు మంజూరు చేయటానికి లంచం అడిగి ఇద్దరు ఉద్యోగులు కటకటాలపాలయ్యారు. మరో ఉద్యోగి కాంట్రాక్టర్ నుంచి, మరో మహిళా ఉద్యోగి పంచాయతీ ఉద్యోగినుంచి లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. కాగా ఈ కార్యాలయంపై ఎన్ని సార్లు ఏసిబి దాడులు చేసినా అక్కడ పని చేసే ఉద్యోగులు మాత్రం లంచాలకోసం పీడించడం మానడం లేదు. ఇక్కడి ట్రెజరీ కార్యాలయంలో ప్రతి సెక్షన్లో అడుగడుగునా లంచాలు ఇవ్వాల్సిందేనని ప్రజలు పిర్యాదు చేస్తున్నారు. మరి కొందరైతే జలగల్లా పట్టి పీడిస్తున్నారని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో సబ్–ట్రెజరీలపై ఫిర్యాదులు బాగా వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవటం నేరమన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే వెంటనే ఏసీబీకి (డీఎస్పీ నెంబరు 94404 46164) ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
–డీఎస్పీ గోపాలకృష్ణ