పత్థర్ కా గో్‌ష్
సిటీ స్పెషల్: పత్థర్ కా గోష్.. రాతిపైన వండటమే దీని ప్రత్యేకత. అందుకే దీనికాపేరు వచ్చింది. ఒక్కసారి రుచి చూస్తే చాలు... మళ్లీమళ్లీ కావాలంటారు. మటన్‌తో చేసిన వెరైటీల్లో అత్యంత రుచిగా ఉంటుందని ఈ వంటకాన్ని తిన్నవారెవరైనా చెబుతారు. అరుదైన ఈ హైదరాబాదీ కబాబ్ ఇప్పుడు అంతర్థానమవుతోంది.
లేత మాంసాన్ని మాత్రమే ఈ వంటకానికి వినియోగిస్తారు. సన్నగా, వెడల్పుగా కోసిన మాంసం ముక్కలను మసాలా మిశ్రమంలో ఆరు గంటల పాటు నానబెట్టాలి. మిశ్రమం తయారీలో దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, మిరపపొడి, నిమ్మకాయ వాడతారు. రాతిని శుభ్రం చేసేందుకు దానిపైన ఉప్పువేస్తారు. నిప్పు వేడికి ఉప్పు నలుపు రంగు కాగానే శుభ్రమైన బట్టతో తుడుస్తారు. నేరుగా రాతిపైన ముక్కలు వేస్తారు. 15-20 నిమిషాల్లో చక్కగా ఫ్రై అవుతాయి. నూనె వాడే అవసరమే లేదు. కానీ కొన్ని హోటళ్లలో రుచి కోసం ఆలివ్ నూనె, నెయ్యి కూడా వినియోగిస్తున్నారు. ఫ్రై అయినప్పటికీ ముక్కలు మృదువుగా ఉంటాయి.
కొత్తదనం కోసం పత్థర్ కా గోష్ రోల్స్ కూడా చేస్తుంటామని టోలిచౌకిలో ఉన్న 4 సీజన్స రెస్టారెంట్ సీనియర్ చెఫ్ సుబల్ పాల్ చెబుతున్నారు. వంటకాన్ని రుచి చూసినవారెవరైనా మళ్లీ కావాలంటారని చెప్పారు. మిక్స్డ్ గ్రిల్ ప్లాటర్‌లో పత్థర్ కా గోష్‌ను చేర్చాలని ఎక్కువ మంది కస్టమర్లు డిమాండ్ చేస్తారని మేనేజర్ రవీందర్ సింగ్ అంటారు. హైదరాబాద్‌తోపాటు లక్నో, పంజాబ్‌లో సైతం ఈ వంటకం దొరుకుతోందని చెప్పారాయన. మాంసం మృదువుగా ఉంటుంది కాబట్టి పెద్ద వయస్కులు ఇష్టంగా తింటారని చెప్పారు. తమ రెస్టారెంట్లో రోజుకు ఎంతకాదన్నా 40 దాకా ప్లాటర్లు, పత్థర్ కా గోష్ 50 ప్లేట్లు అమ్ముడవుతాయని వివరించారు. దివంగత వైఎస్ఆర్కు కూడా తమ రెస్టారెంట్ నుంచి ఈ వంటకాన్ని సరఫరా చేశామన్నారు. రాజకీయ నాయకులు, సినీ తారలు ఎందరో పత్థర్ కా గోష్‌ను అమితంగా ఇష్టపడతారని వివరించారు. మలేసియా, దుబాయ్, ఒమన్, పాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతిథులు ఈ అరుదైన వంటకాన్ని ఆస్వాదిస్తున్నారు.
- మహేందర్