‘మాస్టర్ ప్లాన్’పై కలకలం
పాఠశాల స్థలం ధారాదత్తంపై నివేదిక కోరిన డిప్యూటీ సీఎం
విచారణ జరిపిన డీఈవో రాజీవ్
స్థలం ఇచ్చినప్పుడు డీఈఓగా చంద్రమోహనే..
వరంగల్ : హన్మకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 887 చదరపు మీటర్ల భూమిని ప్రైవేటు అవసరాల కోసం అప్పగించిన అంశం విద్యా శాఖలో కలకలం రేపింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సూచన మేరకు రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసిన విషయంపై శుక్రవారం సాక్షిలో ‘మాస్టర్ ప్లాన్ మతలబేంది?’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో విద్యా శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. దీనిపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా విద్యా శాఖ అధికారి పి.రాజీవ్‌ను ఆదేశించారు. డీఈఓ శుక్రవారం విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ డెరైక్టర్ యాదయ్యతో కలిసి సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు అప్పగించిన స్థలం ఫొటోలు, వివరాలు సేకరించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి నివేదిక పంపించారు.
ఇచ్చింది చంద్రమోహనే...
సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 887 చదరపు మీటర్ల భూమిని వరంగల్ నగరపాలక సంస్థకు ఇచ్చిన సమయంలో జిల్లా విద్యా శాఖ అధికారిగా వై.చంద్రమోహన్ ఉన్నట్టు ఉత్తరప్రత్యుత్తరాలు స్పష్టం చేస్తున్నాయి. పాఠశాల వెనుక విద్యా శాఖ పరిధిలో ఉన్న 887 చదరపు మీటర్ల భూమిని రోడ్డుకు వినియోగించనున్నట్లు పేర్కొంటూ వరంగల్ మహా నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్ 29న విద్యా శాఖకు లేఖ రాసింది. దీనికి సమ్మతిస్తూ 2015 మే 22న డీఈవో కార్యాలయం నగరపాలక సంస్థకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. మహా నగరపాలక సంస్థ ప్రతిపాదన వచ్చిన సమయంలో, దీనిపై నిర్ణయం తీసుకున్న సమయంలోనూ డీఈఓగా వై.చంద్రమోహన్ ఉన్నారు.
ఆయన హయాంలోనే దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన విద్యా శాఖ భూమి పరాధీనమైనట్లు స్పష్టమవుతోంది. భూమిని ఇతర శాఖలకు అప్పగించే విషయంలో డీఈఓకు ఎలాంటి అధికారమూ లేదని నిబంధనలు చెబుతునాయి. వరంగల్ మహానగరపాలక సంస్థ నుంచి భూమి కావాలనే ప్రతిపాదన లేఖ వచ్చినప్పుడు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికిగానీ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దృష్టికిగానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి మేరకే భూమి కేటాయింపుపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అరుుతే, ఇవేమీ పట్టించుకోకుండా వై.చంద్రమోహన్ డీఈవోగా ఉన్నప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భూమిని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు.