నల్లమందు కేసులో టీఎంసీ నేత అరెస్ట్
కోలకతా: ఒక పక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. ఆ పార్టీ నేత సుబోధ్ ప్రమాణిక్ ను నార్కోటిక్స్ విభాగం అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున మత్తు మందులు కలిగి వున్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అసలే స్టింగ్ ఆపరేషన్ ద్వారా అవినీతి ఆరోపణలతో అతలా కుతలమవుతున్న పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ వ్యవహారం మరింత ఇబ్బందుల్లో పడుతున్నట్టు కనిపిస్తోంది.
మాల్దా జిల్లాలో వైష్ణవ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సబ్దల్ పూర్ గ్రామంలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. సుమారు రూ .3 కోట్ల రూపాయల విలువైన నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా తుపాకీలు, బాంబులు సహా కొన్ని మారణాయుధాలను టిఎంసి నేత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.