Subrata Roy bail
-
సహారాకు సుప్రీం చివరి చాన్స్
- బెయిల్ నిధుల సమీకరణకు ఇదే ఆఖరి అవకాశమని స్పష్టీకరణ - ఆస్తుల విక్రయానికి ‘కోర్టు రిసీవర్’ను నియమిస్తామని హెచ్చరిక న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరణ యత్నాల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం చివరి అవకాశం ఇచ్చింది. విదేశాల్లోని గ్రూప్ ఆస్తుల విక్రయం, తద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదిత పార్టీలతో చర్చలకు ఇప్పటికి రెండు సార్లు అవకాశమిచ్చిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో ఇక చివరి వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలిపింది. నిజానికి గ్రూప్ ఆస్తుల అమ్మకానికి ‘కోర్టు రిసీవర్’ను నియమిస్తామని శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీం తొలుత హెచ్చరించింది. సహారా నుంచి కొత్తగా వకాల్తా పుచ్చుకున్న కపిల్ సిబల్ విన్నపం మేరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే ఆస్తుల అమ్మకం విషయంలో గ్రూప్‌కు చివరి అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రతిపాదిత డీల్ పురోగతి అంశాలను వారం లోపు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి, అలాగే ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానానికి సలహాలను అందిస్తున్న న్యాయవాదికి తెలియజేయాల్సి ఉంటుందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. డీల్ ప్రతిపాదన తుది రూపునకు 2-3 నెలలే తీసుకోవాలని కూడా సూచించింది. ప్రతిపాదిత డీల్‌పై చర్చలకు తీహార్ జైలు పరిధిలో రాయ్‌కు కొన్ని ప్రత్యేక సదుపాయాలను పొడిగించాలన్న విన్నపాన్ని ఆమోదించడానికి కోర్టు నిరాకరించింది. అయితే కేవలం చర్చలకు (మార్చి 23 వరకు) మాత్రం ఇంతకుముందు 2 గంటల సమయాన్ని మరో 3 గంటలు పొడిగించింది. -
సహారా కేసులో కొత్త ట్విస్ట్
రాయ్ బెయిల్ నిధుల విషయంలో సంబంధంలేదన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు సంబంధించి రూ.10,000 కోట్ల సమీకరణ అంశం కీలకమైన మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఎదుట సహారా గ్రూప్ స్వయంగా తన బ్యాంకరుగా పేర్కొన్న బ్యాంకింగ్ సంస్థే హఠాత్తుగా తనకు సహారా డీల్‌తో ఏ సంబంధంలేదంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే- సహారా గ్రూప్ సుప్రీంకోర్టుకు దాదాపు నెల రోజుల క్రితం ఒక నోట్ సమర్పిస్తూ, అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్ గ్రూప్ 2 బిలియన్ డాలర్ల ఫైనాన్షింగ్ ప్యాకేజ్ని ఆఫర్ చేసినట్లు తెలిపింది. దీనిని అమెరికా కంపెనీ కూడా ధ్రువీకరించింది. ఈ మేరకు మిరాచ్ తమకు కొన్ని డాక్యుమెంట్లను ఇప్పటికే అందించినట్లు సహారా గ్రూప్ కోర్టుకు తెలిపింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం డీల్‌కు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) బ్యాంకర్‌గా వ్యవహరిస్తున్నట్లు కూడా సహారా గ్రూప్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. తాజా విషయం ఏమిటంటే... ఈ డీల్‌లో తమకు ఎటువంటి పాత్రా లేదని బీఓఏ ప్రతినిధి ఒకరు ఖండిస్తూ ప్రకటన చేశారు. మిరాచ్ కేపిటల్‌కు భారత సంతతికి చెందిన సరాంచ్ శర్మ సీఈఓగా పనిచేస్తున్నారు. తాజా బీఓఏ ప్రకటనతో ఈ డీల్ మొత్తం వ్యవహారంపై నీలిమేఘాలు కమ్ముకున్నట్లయ్యింది. కోర్టు డాక్యుమెంట్లలో తమ పేరును పేర్కొన్నట్లు తెలుసుకున్న బీఓఏ, ఈ విషయంలో ఏవైనా ఫోర్జరీలు జరిగాయా అన్న కోణంలో తగిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన వార్తల ప్రకారం డీల్‌కు సంబంధించి ఫిబ్రవరి 20వ తేదీ లోపు సహారా, మిరాచ్ల మధ్య ఒప్పందం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజా పరిణామంతో ఈ వ్యవహారం మొత్తం సందేహాస్పదమైపోయింది. 2014 మార్చి నుంచీ సహారా చీఫ్ సుబ్రతారాయ్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రెండు గ్రూప్ సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.25,000 కోట్లు వసూలు చేశాయన్నది ఆరోపణ. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈ నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో సహారా వైఫల్యం... మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కారణ పిటిషన్ దీనికి నేపథ్యం. మోసపోయాం: సహారా మరోవైపు తాజాగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామంపై సహారా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయంలో నిధులు రెడీగా ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంటున్నట్లుగా సృష్టించిన ఒక ఫోర్జరీ లేఖను ఆ సంస్థ తమకు అందించిందని ఆరోపించింది. అననుకూల వాతావరణంలో తాను ఈ విషయంలో ఘోరంగా మోసపోయినట్లు పేర్కొంది. దేశంలోనూ, అమెరికాలోనూ మిరాచ్ కేపిటల్, ఆ సంస్థ అధికారులపై సివిల్, క్రిమినల్సహా, తగిన చట్టపరమైన చర్యలు అన్నీ తీసుకోనున్నట్లు ప్రకటించింది. మిరాచ్ కేపిటల్ గ్రూప్ ప్రవర్తనను ఘోరమైనదిగా తప్పుపడుతూ తీవ్ర పదజాలంతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ మోసపూరిత వ్యవహారంలో మిరాచ్ కేపిటల్ గ్రూప్‌కు చెందిన భారత, అమెరికా అధికారులు అందరూ భాగస్వాములేనని విమర్శించింది. ఈ డీల్‌కు సంబంధించి కలతచెందే సమాచారం ఫిబ్రవరి 1న తమకు తెలిసిందని కూడా పేర్కొంది. దీనితో బ్యాంక్ ఆఫ్ అమెరికా లేఖపై నిజనిర్థారణకు తాము స్వయంగా ప్రయత్నం చేయడం ప్రారంభించామని వివరించింది. చివరకు మిరాచ్ తమను మోసం చేసిందని గుర్తించామని తెలిపింది. దీనిని తాము తేలిగ్గా తీసుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సహారా చేసిన ఈ ఆరోపణలపై మిరాచ్ కేపిటల్‌పై స్పందన ఇంకా తెలియరాలేదు. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి నుంచి వచ్చిన ప్రకటన తరువాతే, సహారా దీనిపై స్పందించడం ఇక్కడ గమనార్హం. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకటన వెలువడిన వెంటనే మిరాచ్ కేపిటల్‌పై సీఈఓ శర్మను మీడియా సంప్రదించింది. బీఓఏ ప్రకటనపై ఆయన ప్రత్యక్షంగా ఏదీ వివరణ ఇవ్వలేదు. ఈ లావాదేవీని తెగతెంపులు చేసుకోవడంలేదన్నారు.. -
బెయిల్ @ రూ.10 వేల కోట్లు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, ఇరువురు డెరైక్టర్లకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే రూ.10,000 కోట్లు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు సహారా గ్రూప్‌ను ఆదేశించింది. కోర్టు తాజా షరతులను కంపెనీ పాటిస్తేనే- తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేయడం జరుగుతుందని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి రూ.25,000 కోట్ల సమీకరణ, సంబంధిత డబ్బు తిరిగి చెల్లింపులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశం, ఈ ప్రక్రియలో సహారా వైఫల్యం, సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణ వ్యవహారంలో మార్చి 4వ తేదీ నుంచీ రాయ్, ఇరువురు డెరైక్టర్లు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విధానమిది... చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో రూ.5,000 కోట్లను సుప్రీంకోర్టు వద్ద డిపాజిట్ చేయాలని, మిగిలిన రూ.5,000 కోట్లను ఒక జాతీయ బ్యాంక్ గ్యారంటీ ద్వారా (సెబీ పేరుతో) సమర్పించాలని కోర్టు నిర్దేశించింది. సెబీ వద్ద డిపాజిట్ చేయడానికి సంబంధించి మొత్తం నిధుల సమీకరణకు వెసులుబాటు కల్పించే ప్రక్రియలో భాగమే తాత్కాలిక బెయిల్ మంజూరన్న విషయాన్ని గ్రూప్ గమనంలో ఉంచుకోవాలని కోర్టు పేర్కొంది. సహారా గ్రూప్ వడ్డీతో సహా రూ. 34,000 కోట్లు చెల్లించాలని సెబీ వాదిస్తోంది. రాయ్ జైలులో ఉండగా ఈ మొత్తాలనుసైతం సమీకరించడం కష్టమని సహారా గ్రూప్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం అంతక్రితం అంగీకరించలేదు. రూ.2,500 కోట్లను సెబీ వద్ద డిపాజిట్ చేసి, రూ. 10,000 కోట్లలో మిగిలిన మొత్తాన్ని సమర్పించడానికి నెలరోజుల సమయం ఇవ్వాలని, ఈ ప్రతిపాదనపై రాయ్‌ని జైలు నుంచి విడుదల చేయాలని సహారా న్యాయవాది చేసిన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమ తాజా రూలింగ్‌పై స్పందనను తెలియజేయాలని సుప్రీం సహారాను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను నేటికి (గురువారానికి) వాయిదా వేసింది. కాగా బెయిల్‌కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో డబ్బును చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఒక సంచలనమేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంక్ అకౌంట్ల డీఫ్రీజ్కూ ఓకే... కోర్టు తాజా నిర్దేశాల ప్రకారం నిధుల సమీకరణకు వీలుగా ‘ఫ్రీజ్’(స్తంభింప) చేసిన సంస్థ బ్యాంక్ అకౌంట్లను ‘డీఫ్రీజ్’ చేసేందుకు సైతం కోర్టు అంగీకరించింది. డీఫ్రీజ్ చేయాల్సిఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్ల వివరాలను గురువారం అందజేయాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సహారాకు సూచించింది. తదుపరి ఇందుకు తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో సహారా గ్రూప్ షేర్లు డీలాపడ్డాయి. బీఎస్ఈలో సహారా వన్ మీడియా 5% పతనమై రూ. 60 వద్ద ముగియగా, సహారా హౌసింగ్ ఫైనాన్స్ 10% దిగజారి రూ. 42.50 వద్ద నిలిచింది.