సహారా కేసులో కొత్త ట్విస్ట్
రాయ్ బెయిల్ నిధుల విషయంలో సంబంధంలేదన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు సంబంధించి రూ.10,000 కోట్ల సమీకరణ అంశం కీలకమైన మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఎదుట సహారా గ్రూప్ స్వయంగా తన బ్యాంకరుగా పేర్కొన్న బ్యాంకింగ్ సంస్థే హఠాత్తుగా తనకు సహారా డీల్‌తో ఏ సంబంధంలేదంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే- సహారా గ్రూప్ సుప్రీంకోర్టుకు దాదాపు నెల రోజుల క్రితం ఒక నోట్ సమర్పిస్తూ, అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్ గ్రూప్ 2 బిలియన్ డాలర్ల ఫైనాన్షింగ్ ప్యాకేజ్‌ని ఆఫర్ చేసినట్లు తెలిపింది.
దీనిని అమెరికా కంపెనీ కూడా ధ్రువీకరించింది. ఈ మేరకు మిరాచ్ తమకు కొన్ని డాక్యుమెంట్లను ఇప్పటికే అందించినట్లు సహారా గ్రూప్ కోర్టుకు తెలిపింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం డీల్‌కు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) బ్యాంకర్‌గా వ్యవహరిస్తున్నట్లు కూడా సహారా గ్రూప్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. తాజా విషయం ఏమిటంటే... ఈ డీల్‌లో తమకు ఎటువంటి పాత్రా లేదని బీఓఏ ప్రతినిధి ఒకరు ఖండిస్తూ ప్రకటన చేశారు. మిరాచ్ కేపిటల్‌కు భారత సంతతికి చెందిన సరాంచ్ శర్మ సీఈఓగా పనిచేస్తున్నారు.
తాజా బీఓఏ ప్రకటనతో ఈ డీల్ మొత్తం వ్యవహారంపై నీలిమేఘాలు కమ్ముకున్నట్లయ్యింది. కోర్టు డాక్యుమెంట్లలో తమ పేరును పేర్కొన్నట్లు తెలుసుకున్న బీఓఏ, ఈ విషయంలో ఏవైనా ఫోర్జరీలు జరిగాయా అన్న కోణంలో తగిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన వార్తల ప్రకారం డీల్‌కు సంబంధించి ఫిబ్రవరి 20వ తేదీ లోపు సహారా, మిరాచ్‌ల మధ్య ఒప్పందం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజా పరిణామంతో ఈ వ్యవహారం మొత్తం సందేహాస్పదమైపోయింది.
2014 మార్చి నుంచీ సహారా చీఫ్ సుబ్రతారాయ్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రెండు గ్రూప్ సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.25,000 కోట్లు వసూలు చేశాయన్నది ఆరోపణ. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈ నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో సహారా వైఫల్యం... మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కారణ పిటిషన్ దీనికి నేపథ్యం.
మోసపోయాం: సహారా
మరోవైపు తాజాగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామంపై సహారా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయంలో నిధులు రెడీగా ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంటున్నట్లుగా సృష్టించిన ఒక ఫోర్జరీ లేఖను ఆ సంస్థ తమకు అందించిందని ఆరోపించింది. అననుకూల వాతావరణంలో తాను ఈ విషయంలో ఘోరంగా మోసపోయినట్లు పేర్కొంది. దేశంలోనూ, అమెరికాలోనూ మిరాచ్ కేపిటల్, ఆ సంస్థ అధికారులపై సివిల్, క్రిమినల్‌సహా, తగిన చట్టపరమైన చర్యలు అన్నీ తీసుకోనున్నట్లు ప్రకటించింది. మిరాచ్ కేపిటల్ గ్రూప్ ప్రవర్తనను ఘోరమైనదిగా తప్పుపడుతూ తీవ్ర పదజాలంతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఈ మోసపూరిత వ్యవహారంలో మిరాచ్ కేపిటల్ గ్రూప్‌కు చెందిన భారత, అమెరికా అధికారులు అందరూ భాగస్వాములేనని విమర్శించింది. ఈ డీల్‌కు సంబంధించి కలతచెందే సమాచారం ఫిబ్రవరి 1న తమకు తెలిసిందని కూడా పేర్కొంది. దీనితో బ్యాంక్ ఆఫ్ అమెరికా లేఖపై నిజనిర్థారణకు తాము స్వయంగా ప్రయత్నం చేయడం ప్రారంభించామని వివరించింది. చివరకు మిరాచ్ తమను మోసం చేసిందని గుర్తించామని తెలిపింది. దీనిని తాము తేలిగ్గా తీసుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా సహారా చేసిన ఈ ఆరోపణలపై మిరాచ్ కేపిటల్‌పై స్పందన ఇంకా తెలియరాలేదు. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి నుంచి వచ్చిన ప్రకటన తరువాతే, సహారా దీనిపై స్పందించడం ఇక్కడ గమనార్హం. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకటన వెలువడిన వెంటనే మిరాచ్ కేపిటల్‌పై సీఈఓ శర్మను మీడియా సంప్రదించింది. బీఓఏ ప్రకటనపై ఆయన ప్రత్యక్షంగా ఏదీ వివరణ ఇవ్వలేదు. ఈ లావాదేవీని తెగతెంపులు చేసుకోవడంలేదన్నారు..