38 ఏళ్ల తర్వాత భారత్‌కు పీలే
న్యూఢిల్లీ: 'గ్రేటెస్ట్ ఫుట్‌బాలర్ ఆఫ్ ఆల్ టైమ్' పీలే దాదాపు 38 ఏళ్ల తర్వాత భారత్‌కు రాబోతున్నాడు. స్కూళ్ల స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సుబ్రతో కప్ టోర్నీ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా ఆయన రానున్నాడని నిర్వాహకులు చెప్పారు. 56వ ఎడిషన్‌గా జరుగుతున్న ఈ సీజన్ ఫైనల్ అక్టోబర్ 16న ఢిల్లీలో జరుగనుంది. అక్టోబర్ 15న పీలే భారత్‌కు వస్తాడు. ఆయన 1977లో ఆమెరికా క్లబ్ న్యూయార్క్ కాస్మోస్ తరఫున భారత జట్టు మోహన్ బగాన్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తి ఎదురుచూస్తున్నానని వీడియో మెసెజ్‌ను పీలే పోస్ట్ చేశాడు.
'భారత్ నాకు ప్రత్యేకమైంది. అక్కడి వచ్చేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను. 1977లో అక్కడ ఆడిన మ్యాచ్ గుర్తుంది. నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు. అక్కడి యువకులను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఢిల్లీలో కలుద్దాం' అని వ్యాఖ్యానించాడు. సుబ్రతో కప్ ఈనెల 11 నుంచి వచ్చే నెల 16 వరకు జరుగనుంది. ఈసారి 100కు పైగా జట్లు మూడు విభాగాల్లో పోటీపడనున్నారు. అండర్-14 బాలుర, అండర్-17 బాలుర, అండర్-14 బాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. కేవలం భారత్ నుంచే కాకుండా స్వీడన్, కొరియా, బ్రెజిల్, ఉక్రెయిన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల జట్లు పాల్గొంటున్నాయి.