అ‘ధన’పు మోతను తగ్గించండి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్‌ను సమకూర్చే బాధ్యతను తీసుకున్న ట్రాన్స్‌కో, ఓవర్ హెడ్ చార్జీల(అదనపు చార్జీ) తగ్గింపు విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కపెడుతోంది. విద్యుత్‌ను సరఫరా చేసే సబ్స్టేషన్ల టెండర్ ప్రక్రియ మొదలు, నిర్మాణ బాధ్యతలను పూర్తిగా చూస్తున్నందున ఏకంగా 20 శాతం ఓవర్‌హెడ్ చార్జీల భారాన్ని తమపై మోపడం సరికాదని, దాన్ని పూర్తిగా గాని.. లేకుంటే 10 శాతానికి గాని తగ్గించాలని నీటిపారుదల శాఖ విన్నవిస్తున్నా ట్రాన్స్‌కో ఏటూ తేల్చడం లేదు. దీంతో నీటిపారుదల శాఖ మరోమారు ట్రాన్స్‌కోకు ఈ విషయమై లేఖ రాసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు 4,627 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉంటాయని ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే తేల్చారు. ఈ మేరకు విద్యుత్‌ను సరఫరా చేసే సబ్స్టేషన్ల నిర్మాణానికి సుమారు రూ.3వేల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా. ప్రాజెక్టు కోసం మేడిగడ్డ వద్ద 3, ఎల్లంపల్లి వద్ద 2, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు 3 సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గతంలో నిర్మించిన ప్రాజెక్టులకు ఈ స్థాయిలో విద్యుత్ అవసరాలు లేక 133 కేవీ నుంచి 220 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణాలను సంబంధిత ప్రాజెక్టుల అథారిటీలే చేపట్టి, నిర్వహణ బాధ్యతలను మాత్రమే ట్రాన్స్‌కోకు అప్పగించాయి.
ప్రస్తుతం 400 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం అవసరం ఉండటం, ఆ స్థాయి నిర్మాణాలు చేపట్టే సామర్థ్యం తమ వద్ద లేకపోవడంతో వాటి బాధ్యతను పూర్తిగా ట్రాన్స్‌కో తీసుకోవాలని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పిన ట్రాన్స్‌కో, సబ్స్టేషన్ల టెండర్ల ప్రక్రియ, అంచనాల తయారీ, టెండర్ల ఖరారు తదితర సేవలకోసం తమ అధికారులను వినియోగించుకున్నందుకుగానూ మొత్తం పని విలువలో 20 శాతం ఓవర్‌హెడ్ చార్జీల కింద చెల్లించాలని షరతు పెట్టింది. రూ.3 వేల కోట్ల పని విలువకు ఓవర్‌హెడ్ చార్జీల భారమే ఏకంగా రూ.600 కోట్ల వరకు ఉంటోంది.
దీంతో ఓవర్‌హెడ్ చార్జీలను తొలగించాలని నీటి పారుదల శాఖ కోరుతోంది. దానికి ట్రాన్స్‌కో అంగీకరించకపోవడంతో కనీసం 10 శాతం చేసుకోవాలని కోరింది. ఈ లెక్కన చూసినా ఓవర్‌హెడ్ చార్జీల మొత్తం రూ.300 కోట్ల వరకు ఉంటుంది. అయితే దీనిపై ట్రాన్స్‌కో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట నీటి పారుదల శాఖ ట్రాన్స్‌కో మరో లేఖ రాసింది.