అనువైన వాతావరణం కల్పించండి-నేపాల్
సార్క్ సమావేశాలు నిర్వహించేందుకు అనువైన వాతావరణం కల్పించమంటూ నేపాల్ కోరింది. భారత్ తో పాటు మరో మూడు సభ్య దేశాలు సార్క్ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో నేపాల్ ఈ ప్రకటన చేసింది.
సరైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగే సార్క్ సమావేశాల్లో తాము పాల్గొనలేమంటూ భారత్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు నేపాల్ కు సమాచారం అందించాయి. దీంతో స్పందించిన నేపాల్.. సార్క్ సదస్సు సవ్యంగా జరిగేందుకు అనువైన వాతావరణం సృష్టించాలంటూ పాకిస్థాన్ కు పరోక్షంగా సూచించింది. త్వరలోనే సదస్సు ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.
సార్క్ సదస్సుకు హాజరు కాలేమని భారత్ నిర్ణయం తీసుకోవడంతో నవంబర్ 9, 10, తేదీల్లో జరగాల్సిన సమావేశాలను వాయిదా వేయాలని, లేదంటే రద్దు చేయాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఇదే విషయాన్ని నేపాల్ కు కూడా తెలిపింది. దీనిపై స్పందించిన నేపాల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను వెలువరించింది. ముందుగా అనుకున్నట్లుగానే సార్క్ సదస్సును నిర్వహించాలని, అందుకు సభ్యదేశాలన్నీ పాల్గొనే అనుకూల వాతావరణాన్ని కల్పించాలని కోరింది. సమావేశాలను రద్దు చేసే ఆలోచనను తాము తీవ్రంగా భావిస్తున్నామంటూ నేపాల్ విదేశాంగ శాఖ తన వెబ్ సైట్ లో తెలిపింది. 19వ సార్క్ సమావేశాల్లో సభ్యదేశాలన్నీ పాల్గొనేందుకు తగ్గ వాతావరణం కల్పిస్తారని తాము భావిస్తున్నట్లు పేర్కొంది.
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్ (సార్క్) ను 1985 లో స్థాపించగా అందులో ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు సభ్యులుగా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దేశం సమావేశాలకు హాజరు కావడం లేదని తెలిపినా నిబంధనల ప్రకారం సార్క్ సదస్సు వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. అటువంటిది నాలుగు దేశాలు సదస్సునుంచి వైదొలగే వాతావరణాన్ని సృష్టించడంపై పాకిస్థాన్ ను నేపాల్ నిందించింది.
సెప్టెంబర్ 18న ఉరీలోని భారతీయ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడులు జరపగా 18 మంది సైనికులు మరణించిన అనంతరం పాకిస్థాన్ భారత్ మధ్య ఈ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి పాల్పడిన తీవ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన జైషే ఇ మొహమ్మద్ కు చెందిన వారుగా గుర్తించడంతో ఇరు దేశాలమధ్య అనుకూల వాతావరణం దెబ్బతింది. ఈ నేపథ్యంలో నేపాల్ పిలుపును పాక్ ఏ రకంగా స్వీకరిస్తుందో వేచిచూడాల్సిందే.