మధ్య ప్రదేశ్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
మధ్యప్రదేశ్ః నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా కామాంధుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో మరో దారుణం వెలుగు చూసింది. పదమూడేళ్ళ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు రోజుల్లో రెండు గ్రూపులు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. తోడుకోసం రమ్మని ఒకరు, లిఫ్ట్ ఇస్తామని మరొకరు నమ్మించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మధ్యప్రదేశ్ ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసు వివరాలను పరిశీలిస్తే... నిందితులు బాధితురాలికి తెలిసున్నవారుగా తెలుస్తోందని, ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నామని... అతడి ఆధారంగా మిగిలినవారి ఆచూకీ తెలిసే అవకాశం ఉన్నట్లు ధార్ కోట్ పోలీసులు చెప్తున్నారు. మార్చి 7వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా దేవాలయానికి వెళ్ళిన బాలికను తమకు తోడుగా రమ్మంటూ నమ్మించి, ఒప్పించి ఇద్దరు యువకులు పారిశ్రామిక ప్రాంతంలోకి తీసుకెళ్ళారని, అనంతరం తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆకాష్ అలియాస్ గోలు, అతిని స్నేహితుడితో సహా ఆమెను మానభంగం చేయడంతోపాటు ఆరోజు అక్కడే బలవంతంగా ఉంచేసినట్లు కూడ బాధితురాలు తెలిపింది. అయితే మర్నాడు మార్చి 8వ తేదీన వారినుంచి తప్పించుకొని నగరంలోనే ఉన్న తన తాతగారింటికి వెళ్ళానని, అయితే వారికి జరిగిన విషయం చెప్పలేదని ఆమె తెలిపింది. అక్కడినుంచీ తిరిగి ఇంటికి బయల్దేరిన తనను తనకు తెలిసిన మరో ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి సంజయ్ కాలనీకి తీసుకువెళ్ళారని, అక్కడ ఆరుగురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది.
అయితే బాధితురాలి తల్లిదండ్రులు ఆమె మార్చి 7న ఇంటినుంచి వెళ్ళి తిరిగి రాలేదంటూ ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండురోజుల అనంతరం తనంతట తానుగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాలిక... తనపై జరిగిన ఆఘాయిత్యాలను పోలీసులకు వివరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, నిందితులు సంతోష్ (24), సుభాష్ సింగ్ (20) ఆకాష్ అలియాస్ గోలు (19), భరత్ (18) తోపాటు మరో ముగ్గురిపై వివిధ సెక్షల్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ అంజనా ధుర్వే తెలిపారు.