బిల్డింగ్ ఆర్కిటెక్చర్ సలహాదారుగా సుద్దాల సుధాకర్ తేజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వాస్తుకు అత్యంత ప్రాధాన్యమిస్తుండటంతో ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సలహాదారును నియమించింది. వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజను రోడ్లు భవనాల శాఖలో ప్రత్యేకంగా సలహాదారుగా నియమించింది. కొంతకాలంగా ఆయన వాస్తుపరమైన విషయాల్లో ముఖ్యమంత్రికి సూచనలు, సలహాలు అందజేస్తున్నారు.
వాస్తు సలహాదారుగా నియమించేందుకు సాంకేతిక అంశాలు అడ్డుగా ఉండటంతో ఆయనను ఆర్కిటెక్చర్, ఆర్ అండ్ బీ ప్రణాళిక విభాగం సలహాదారు పేరుతో పోస్టింగ్ ఇచ్చింది. కొద్దిరోజులుగా ఆయన నియామక ఫైలు ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉంది.
సాంకేతిక అంశాలను పరిశీలించిన ఆర్థికశాఖ అధికారులు పలు అభ్యంతరాలు చెప్పటంతో ప్రతిపాదనలో రకరకాల మార్పుచేర్పులు చేసి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఈ పోస్టులో ఏడాదిపాటు కొనసాగనున్నారు. ఆయనకు భత్యాతలతో కలుపుకొని నెలకు రూ.75 వేలు చెల్లిస్తారు. ప్రభుత్వ వాహనం, డ్రైవర్, ఫోన్ వసతి కూడా కల్పిస్తారు.