ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో తెలుసా!
ఓ సూఫీ జ్ఞాని చెప్తున్నారు...మనిషి ఆత్మ భగవంతుడి నుంచి వచ్చింది. అది చివరకు భగవంతుడినే చేరుతుంది. అది అంతిమంగా భగవంతుడిని ఎప్పుడు చేరుతుందో అప్పుడే దాని ప్రయాణం ముగుస్తుంది. అప్పటి వరకూ అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అంటే అదొక వలయం. అనేక పుట్టుకలు, అనేక మార్గాలు ఇలా ఎలాగైనా అనుకోవచ్చు. చెప్పాలంటే జీవితంలో ఏదో ఒక అన్వేషణ అంటూ ఉంటూనే ఉంటుంది. మనసు ఏదో ఒకటి కోరుతూ ఆ దిశలో పయనిస్తుంది. కానీ అది ఏది కోరుకుంటుందోఎక్కడ తృప్తి చెందుతుందో స్పష్టత ఉండదు. దీనినే ఆ జ్ఞాని ఆత్మాన్వేషణ ప్రయాణం అని చెప్పారు. ఇదంతా వింటున్న ఓ శిష్యుడికి ఓ సందేహం కలిగింది.
‘‘గురువుగారూ, ఆత్మ అంతిమంగా భగవంతుడిని చేరుకోవడంతో దాని ప్రయాణం ముగుస్తుందన్నారు కదా... అంటే ప్రతి ఒక్కరూ భగవంతుడిని చేరుకోవడమే అవుతుందిగా’’ అని అడిగాడు. ‘‘అవును... అందులో సందేహమేముంది? కాస్తంత ముందు వెనుకలు అంతే..అంతకన్నా మరొకటి కాదు... అందరూ చివరికి భగవంతుడిని చేరుకోవలసిందే’’ అన్నారు జ్ఞాని. ‘‘మరి మత పెద్దలు కొందరు మాత్రమే భగవంతుడిని చేరుకుంటున్నారని చెప్పారుగా?’’ అన్నాడు శిష్యుడు.
అప్పుడు జ్ఞాని ‘‘నువ్వో పని చెయ్యి. ఊళ్ళోకి వెళ్ళి, వీలున్నంతమందిని కలిసి వారి కోరికేమిటో తెలుసుకుని రా’’ అని సూచించారు. సరేనని శిష్యుడు కొన్ని కాగితాలు, కలం తీసుకుని ఊళ్ళోకి బయలుదేరాడు.అనేకమందిని కలిశాడు. వారు ఏం కావాలనుకుంటున్నారో, వారి లక్ష్యమేమిటో అడిగాడు. వారి మనసు ఏది పొందితే తృప్తి పడుతుందో చెప్పమన్నాడు. వారు చెప్పినవన్నీ రాసుకున్నాడు. జ్ఞాని వద్దకు వచ్చాడు. ‘‘అయ్యా, ఊళ్ళో రాజు మొదలుకుని కూలీవరకూ ఎందరినో కలిసాను. వారు చెప్పినదంతా చదువుతాను వినండి’’ అంటూ మొదలుపెట్టాడు...
‘‘రాజేమో మరిన్ని దేశాలను గెలవాలనుకున్నాడు. యువరాజేమో తెలివైన యువరాణిని పెళ్ళాడాలనుకున్నాడు... ధనవంతుడేమో మరింత డబ్బు గడించాలనుకుంటున్నాడు... ఇలా ఒక్కొక్కరూ ఆశ పడుతున్నారు...’’ చెప్తుండగానే జ్ఞాని చదవడం ఆపమన్నారు. ‘‘అదంతా పోనివ్వు... వారిలో ఎంతమంది భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మొదట చదువు’’ అన్నారు జ్ఞాని. ఒక్కరు కూడా లేరన్నాడు శిష్యుడు. ‘‘అంటే నువ్వు కూడా లేవా ఆ జాబితాలో?’’ అని అతనివంక నవ్వుతూ చూశారు జ్ఞాని. శిష్యుడు తల దించుకున్నాడు.
– జగద్రేణు
(చదవండి: మంగళకరం)