పాక్ నుంచి తిరిగొచ్చిన సూఫీ గురువులు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి అదృశ్యమైన ఇద్దరు సూఫీ గురువులు సోమవారం ఢిల్లీకి క్షేమంగా తిరిగొచ్చారు. హజ్రత్ నిజాముద్దీన్ దర్గా ప్రధాన గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామీ, ఆయన మేనల్లుడు నాజిమ్ అలీ నిజామీ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చి ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అయితే వారు పాక్‌లో ఎలా అదృశ్యమైంది పూర్తిగా వివరించలేదు. భారత నిఘా సంస్థ ‘రా’తో సంబంధాలు ఉన్నందువల్లే పాక్‌లో నిర్బంధించారనే వార్తలను వారు ఖండించారు.
అయితే తమను పాక్ సిబ్బంది నిర్బంధించడం నిజమేనని అం గీకరించారు. తమ నిర్బంధంలో ఐఎస్‌ఐ పాత్రపై కూడా వారు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ సందర్భంగా వారు మంత్రి సుష్మా స్వరాజ్‌కు, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతిని, ప్రేమను ప్రబోధించడానికే పాక్‌కు వెళ్లామని, అక్కడ కొందరికి తమ బోధనలు రుచించలేదని చెప్పారు. తాము మళ్లీ వెళ్తామని ప్రకటించారు. తమను వెనక్కి పంపిన పాక్ ప్రభుత్వానికి కూడా వారు ధన్యవాదాలు తెలిపారు. నిజాముద్దీన్ దర్గాలో వీరికి ఘనస్వాగతం పలికారు. వీరి ద్దరూ 90ఏళ్ల వయసుండే ఆసిఫ్ సోదరిని చూడటానికి ఈనెల 8న లాహోర్‌కు వెళ్లిన తర్వాత వారి సమాచారం తెలియకుండా పోయిన సంగతి తెలిసిందే.