గీతను తీసుకొచ్చేందుకు సన్నాహాలు: సుష్మ
న్యూఢిల్లీ: భారత్ నుంచి తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన మూగ చెవిటి అమ్మాయి గీతను భారత్‌కు రప్పించేందుకు చట్టపరమైన చర్యలు చేట్టామని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ట్విటర్ ద్వారా తెలిపారు. ‘గీతను వెనక్కి తీసుకుని రావటానికి అవసరమైన చర్యలను పూర్తిచేస్తున్నాం’ అని ఆమె అన్నారు. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాలుగు కుటుంబాలు గీత తమ కూతురేనని చెప్తున్నారని సుష్మ పేర్కొన్నారు.
‘‘భారత హైకమిషనర్‌కు గీత కొన్ని వివరాలు చెప్పింది. తనకు ఏడుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారని పేర్కొంది. తన తండ్రితో కలసి ఆలయానికి వెళ్లినట్లు రాసి చూపింది. ఆలయం పేరు ‘వైష్ణోదేవి’ అని రాసింది. గీత కుటుంబాన్ని వెతకటంలో సాయం చేయండి’’ అని సుష్మ ట్వీట్ చేశారు. 15ఏళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్‌లో కాలుపెట్టిన గీతను కరాచీలోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్ కలిసిన సంగతి తెలిసిందే.