గీత మహతో కూతురు కాదట!
న్యూఢిల్లీ: 15 ఏళ్లపాటు పాకిస్తాన్‌లో ఉండి భారత విదేశాంగ శాఖ కృషితో గత నెలలో ఢిల్లీకి చేరుకున్న భారత పుత్రిక గీత (చెవుడు, మూగ) డీఎన్‌ఏతో ఆమె తండ్రిగా చెప్పుకుంటున్న జనార్దన్ మహతో డీఎన్‌ఏ సరిపోలలేదని విశ్వసనీయ వైద్య వర్గాలు మంగళవారం మీడియాకు తెలిపాయి. అక్టోబర్ 27వ తేదీన ఇక్కడి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకున్న గీతకు కేంద్ర ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలికిన విషయం తెల్సిందే. ఆ విమానాశ్రయానికి తండ్రిగా చెప్పుకుంటున్న బీహార్‌కు చెందిన మహతో కూడా వెళ్లారు.
అట్టహాసంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గీతను, ఆమెను ఇంతకాలం పోషించిన పాకిస్తాన్ ట్రస్టు ప్రతినిధులు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మీడియాకు పరిచయం చేశారు. పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు మహతో దంపతుల ఫొటోను చూపి తన తల్లిదండ్రులుగా అంగీకరించిన గీత హఠాత్తుగా విలేకరుల సమక్షంలోనే వారు తనవారు కాదన్నారు.
కంగుతిన్న సుష్మా స్వరాజ్, డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మహతో దంపతులు గీత తల్లిదండ్రులు అవునా, కాదా అన్న విషయాన్ని తేలుస్తామని చెప్పారు. కాకపోతే ఇండోర్‌లోని కేర్ సెంటర్‌లో చేర్పిస్తామని చెప్పారు. బిహార్ బిడ్డగా గీతను భావించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీహార ఎన్నికల్లో లబ్ది పొందాలని భావించినట్టు అప్పట్లో మీడియాలో వచ్చిన వార్తలు ప్రస్తుత పరిణామం నేపథ్యంలో గమనార్హం.