
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో ఇద్దరు హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేయడంతో పాటు మత మార్పిడి చేయించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. పాక్‌లోని ఘోట్కి జిల్లాలో హోలీ సందర్భంగా రవీనా (13), రీనా (15) అనే హిందు బాలికలను ఇంటి నుంచి అపహరించిన కొందరు.. తర్వాత వారికి ఓ ముస్లిం మత గురువు చేతుల మీదుగా మత మార్పిడి చేసి నిఖా నిర్వహించిన వీడియో ఆ దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో అక్కడ ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆదేశించారు. పూర్తి వివరాలను బయటపెట్టాల్సిందిగా సింధ్, పంజాబ్ ప్రభుత్వాలను ఆదేశించారు.
భారత రాయబారిని నివేదిక కోరిన సుష్మ
పాక్‌లో చోటుచేసుకున్న ఘటనపై భారత్ స్పందించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ మంత్రి ఫవాద్ చౌద్రీల మధ్య ఈ వ్యవహారంపై ఆదివారం ట్విట్టర్‌లో వాగ్యుద్ధమే జరిగింది. ఫవాద్ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్ పాలనలోని కొత్త పాక్. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్‌లో బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment