nikha
-
మాజీ రాష్ట్రపతి మునిమనవడి నిఖా.. ట్రెండింగ్‌లో సైదా హమీద్
‘కుబూల్ హై... కుబూల్ హై.. కుబూల్ హై’ అని మూడుసార్లు వధువరులు ఖాజీ సాక్షిగా అంగీకరిస్తేనే ముస్లింలలో నిఖా పక్కా అవుతుంది. ఖాజీ లేని పెళ్లి చెల్లదు. దేశంలో ఎప్పటి నుంచో పురుషులే ఖాజీలుగా ఉన్నారు. గతంలో కేరళలో నమాజు చదివించే స్త్రీలు వచ్చారు. ఇప్పుడు నిఖా చేసే మహిళా ఖాజీగా సైదా హమీద్ ప్రశంసలు అందుకుంటున్నారు. విద్యాధికురాలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నత పదవులు నిర్వహించిన సైదా హమీద్ ముస్లిం స్త్రీలు ఖాజీలుగా గుర్తింపు, ఉపాధి పొందవచ్చంటున్నారు. తాజాగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుసేన్ మునిమనవడి నిఖాను జరిపించడంతో ఆమె ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. ‘ముస్లిం మహిళలు చదువుకు ఇచ్చిన విలువ గురించి చాలామందికి తెలియదు. నేడు అలిఘర్ ముస్లిం యూనివర్సిటీలో సంవత్సరానికి 8 వేల మంది చదువుకుంటున్నారన్నా, అక్కడి ఉమెన్స్ కాలేజ్‌లో 3 వేల మంది అమ్మాయిలు చదువుకుంటున్నారన్నా దానికి కారణం భోపాల్ స్టేట్‌కు పాలకురాలిగా ఉన్న నవాబ్ సుల్తాన్ జహాన్. 1920లలో ఆమె ఇచ్చిన 50 వేల రూపాయల విరాళంతో ఆ యూనివర్సిటీలో భవన నిర్మాణం జరిగింది. ఆమె ఆ తర్వాత ఆ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ చాన్సలర్ అయ్యింది. ఇక ఢిల్లీలో విఖ్యాతి గాంచిన జామియా మిలియా యూనివర్సిటీ ఎదుగుదల వెనుక ఎందరో ముస్లిం స్త్రీలు ఉన్నారు. వారి గురించి ‘జామియా కే ఆపాజాన్’ అనే పుస్తకమే ఉంది. వారిలో డాక్టర్ జాకిర్ హుసేన్ సతీమణి షాజహాన్ బేగం ఒకరు. ఆ రోజుల్లోనే ఆమె చీర ధరించి (ముస్లిం స్త్రీలు చీర ధరించరు అనే అపోహ ఉండేది) యూనివర్సిటీ పనులు పర్యవేక్షించారు. నేడు వారి ముని మనవడి నికాహ్ను నేను జరిపించడం సంతోషం’ అంటారు సైదా హమీద్. 79 ఏళ్ల సైదా హమీద్ మొన్నటి శుక్రవారం నుంచి వార్తల్లో ఉన్నారు. అందుకు కారణం నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుసేన్ మునిమనవడు కుర్బాన్ అలీ కుమార్తె ఉర్సిలా అలీ వివాహాన్ని ఢిల్లీలోని జామియా నగర్లో జాకిర్ హుసేన్ స్వగృహంలో నిర్వహించడమే. వరుడి పేరు గిబ్రన్ రెహమాన్. సాధారణంగా ముస్లింల పెళ్లిళ్లలో ఖాజీ (న్యాయ పెద్ద) మగవాడే ఉంటాడు. ముస్లింలలో వచ్చే మత పరమైన, కౌటుంబిక విభేదాలకు ముస్లింలు ఈ ఖాజీలనే సంప్రదించి ఖురాన్, షరియత్‌ల ప్రకారం పరిష్కారం కోరుతుంటారు. ఈ ఖాజీలే నిఖాలు జరిపిస్తారు. అయితే స్త్రీలు ఈ రంగంలో కనిపించడం చాలా అరుదు. సైదా హమీద్ గత పదేళ్లుగా తనకు అవకాశం కలిగినప్పుడు ఖాజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికి ఆమె 16 నిఖాలు తన ఆధ్వర్యంలో చేశారు. ఇది చిన్న విషయం కాదు. ‘పదేళ్ల క్రితం నైష్ హసన్ అనే నా స్నేహితురాలు, ముస్లిం మహిళా యాక్టివిస్టు నాకు ఫోన్ చేసింది. సైదా... మా ఇంట్లో ఒక పెళ్లి ఉంది నువ్వు రావాలి అంది. సరే అన్నాను. నిఖా కూడా నువ్వే జరిపించాలి అని కూడా అంది. నేను అవాక్కయ్యాను. కాని కాసేపటికి ఆమె కోరింది మెదడులోకి ఇంకి అవును మహిళలు ఈ పని ఎందుకు చేయకూడదు అని అనుకున్నాను. సంతోషంగా అలా ఖాజీగా మారి నిఖా జరిపించాను’ అంటుంది సైదా హమీద్. అయితే ఆ పని ఆమె ఏదో ఆషామాషీగా చేయలేదు. ఖాజీగా మారే ముందు మళ్లోసారి ఖురాన్‌ను క్షుణ్ణంగా చదివి మహిళలకు ఈ పని నిషిద్ధం చేయబడిందేమో పరిశీలించింది. అలాంటిదేమీ కనిపించలేదు. పైగా స్త్రీలకు నిఖా చట్టబద్ధంగా ఎన్ని విధాలుగా రక్షణ ఇవ్వాలో కూడా ఆమెకు అందులో ఆధారం దొరికింది. ‘నా దృష్టిలో ఖాజీ ఇచ్చే నికానామా (నిఖా ధృవపత్రం) ఒక తెల్లకాగితంగా ఉండకూడదు. అందులో పెళ్లి నిబంధనలు, తలాక్ నిబంధనలు కూడా ఉండాలి. అవి లేకుండా వధువు, వరుడు పేర్లు రాసి ఇవ్వడం అంత సరైనదిగా అనిపించలేదు. 2000 సంవత్సరం నుంచి నేను ముస్లిం మహిళల కోసం ‘ముస్లిం విమెన్ ఫోరమ్’ నడుపుతున్నాను. ఆ ఫోరమ్ తరఫున ఒక సరైన నిఖా నామాను స్త్రీలకు రక్షణ ఇచ్చే నిబంధనలతో రాయించి నిఖా జరిపించాను’ అంటుంది సైదా హమీద్. కశ్మీర్లో జన్మించిన సైదా హమీద్ ముందు నుంచి స్త్రీల విద్య, ఉపాధి, మత సంబంధ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆమె ఆ రోజుల్లోనే కెనెడాకు వెళ్లి ఉన్నత చదువులు చదివారు. కెనెడాలోని అల్బ్రెటా యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్ హమీద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీని తన కార్యరంగంగా చేసుకుని ప్రభుత్వ పరమైన అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పని చేశారు. హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా కూడా. ఆమె ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అలాగే మేరిటల్ రేప్‌ను కూడా సమర్థించాల్సిన పని లేదు అంటుందామె. అలాగే దేశంలో సహృద్భావ వాతావరణం కోసం కూడా ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ‘ముస్లిం స్త్రీల ఆధునిక దృష్టి సామాజిక రంగాలలో వారు చూపిన ప్రతిభ గురించి ముస్లింలకు ఇతర వర్గాలకు కూడా తెలియదు. ముస్లిం యువతులు విద్యారంగంలో రాణించాలని తపన పడుతున్నారు. వారిని ప్రోత్సహించడమే మనం చేయవలసిన పని’ అంటారు సైదా హమీద్. -
బహుభార్యత్వం పిటిషన్లపై ఇంప్లీడ్
న్యూఢిల్లీ: ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా ఆచారాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కక్షిదారుగా చేర్చుకోవాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ంది. ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా ఆచారాలపై దాఖలైన పిటిషన్లను 1997లోనే సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఏఐఎంపీఎల్బీ తన ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొంది. బహుభార్యత్వ సంప్రదాయం ప్రకారం...ఒక ముస్లిం వ్యక్తికి నలుగురు భార్యలుండవచ్చు. అదేవిధంగా నిఖా హలాలా..భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళ మళ్లీ అతడిని వివాహం చేసుకోవాలంటే.. మొదటగా ఆమె మరో వ్యక్తి పెళ్లి చేసుకుని, అతడి కి విడాకులివ్వడం తప్పనిసరి. ఈ రెండు ఆచారాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన నఫీసా ఖాన్ అనే మహిళ 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. -
పాక్‌లో ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఇద్దరు హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేయడంతో పాటు మత మార్పిడి చేయించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. పాక్‌లోని ఘోట్కి జిల్లాలో హోలీ సందర్భంగా రవీనా (13), రీనా (15) అనే హిందు బాలికలను ఇంటి నుంచి అపహరించిన కొందరు.. తర్వాత వారికి ఓ ముస్లిం మత గురువు చేతుల మీదుగా మత మార్పిడి చేసి నిఖా నిర్వహించిన వీడియో ఆ దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో అక్కడ ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆదేశించారు. పూర్తి వివరాలను బయటపెట్టాల్సిందిగా సింధ్, పంజాబ్ ప్రభుత్వాలను ఆదేశించారు. భారత రాయబారిని నివేదిక కోరిన సుష్మ పాక్‌లో చోటుచేసుకున్న ఘటనపై భారత్ స్పందించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ మంత్రి ఫవాద్ చౌద్రీల మధ్య ఈ వ్యవహారంపై ఆదివారం ట్విట్టర్లో వాగ్యుద్ధమే జరిగింది. ఫవాద్ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్ పాలనలోని కొత్త పాక్. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్లో బదులిచ్చారు. -
మూడు గంటల్లో విడాకులు, మళ్లీ పెళ్లి
రాంచీ: జార్ఖండ్‌లోని ఛాంద్వా గ్రామంలో రుబీనా పర్వీన్ అనే 18 ఏళ్ల యువతి బుధవారం నాడు తాను పెళ్లి చేసుకున్న భర్త ముంతాజ్ అన్సారీ అనే యువకుడికి మూడు గంటల్లో విడాకులిచ్చి అదే రోజు మొహమ్మద్ ఇలియాస్ అనే యువకుడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మూడు గంటల్లోనే మొదటి భర్తను వదిలేయడానికి కారణం కట్నం కింద మోటార్ సైకిల్‌ను డిమాండ్ చేయడమే. పెళ్లి కట్నం కింద మోటార్ బైక్ మాట్లాడుకోనప్పటికీ పెళ్లయిన వెంటనే మొదటి భర్త ముంతాజ్ మోటార్ సైకిల్ కావాలంటూ అత్తింటి వారిని డిమాండ్ చేశారు. తన డిమాండ్‌ను నెరవేర్చకపోతే పెళ్లి కూతరును ఇంటికి తీసుకెళ్లేలేదని మొండికేశారు. అదే గ్రామంలో ఓ మోస్తరు హోటల్‌ను నడుపుతున్న పెళ్లి కూతురు తండ్రి బషీర్ ఉద్దీన్ అన్సారీ ఆగమేఘాల మీద మార్కెట్‌కు వెళ్లి హీరో హోండా ఫ్యాషన్ బైక్‌ను కొనుగోలుచేసి అల్లుడి కోసం తెచ్చారు. ఆ బైక్ తనకొద్దని, అంతకంటే ఖరీదైన బైక్ కావాలని అల్లుడు మళ్లీ గొడవ చేశారు. పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్దలు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. దీంతో తనకు ఈ భర్త వద్దని, ఇప్పుడే ఇంతగా వేధిస్తే మున్ముందు ఎంతగా వేధిస్తాడోనని పెళ్లి కూతురు రుబానా పర్వీన్ కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. దాంతో పెళ్లి తెగతెంపులు చేసుకొనేందుకు సిద్ధపడ్డ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు ముస్లిం పెళ్లి పెద్ద ‘కాజా’కు కబురు పెట్టారు. పెళ్లి కొడుకు ముంతాజ్ మెడలో చెప్పుల దండ, కట్నం కోసం కక్కుర్తిపడ్డాను అన్న బోర్డును తగిలింగి పెళ్లి పందిట్లో తిప్పి, గుండు గీయించి ఇంటికి పంపారు. పెళ్లి కొడుకును సమర్థించినందుకు అతని తమ్ముడికి కూడా సగం గుండు గీయించి పంపారు. ఈలోగా కాజా వచ్చి రుబానా మొదటి పెళ్లిని రద్దు చేశారు. ఆమె తండ్రి బషీరుద్దీన్ అదే ఊరికి చెందిన మొహమ్మద్ ఇలియాస్ అనే యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడి అదే పందిట్లో అదే రోజు రాత్రి తన కూతురికి రెండో పెళ్లి చేశారు. జరిగిన సంఘటనల పట్ల తనకు ఎలాంటి విచారం లేదని, జీవితాంతం ఎదురయ్యే వేధింపుల నుంచి తన కూతురుని రక్షించుకున్నానన్న ఆనందం తనకుందని బషీరుద్దీన్ వ్యాఖ్యానించారు. -
‘తలాక్’ రాజ్యాంగ ధర్మాసనానికి..
-
రాత్రికి పెళ్లి.. పెళ్లికొడుకు అదృశ్యం
హైదరాబాద్ : రాత్రి పెళ్లి...ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బంధువులంతా వచ్చేశారు. ఉదయం నుంచి పెళ్లికొడుకు కనిపించుకుండా పోయాడు. దీంతో వరుడు, వధువు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాష తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ మహ్మదీ లైన్స్ శాతంగనగర్కు చెందిన రహీం అహ్మద్ ఖాన్ స్టోన్ పాలిష్ వర్కర్. ఈ నెల 10వ తేదీ సాయంత్రం టోలీచౌకికి చెందిన యువతితో ఇతనికి నిఖా జరగాల్సి ఉంది. కాగా గురువారం ఉదయం రహీం అహ్మద్ ఖాన్ తాను పని చేసే సైట్‌కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లాడు. మధ్యాహ్నం వరకూ అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విఛ్ఛాప్ వచ్చింది. సాయంత్రం అయినా రహీం తిరిగి రాకపోవటంతో ఇరు కుటుంబాల వారు రహీం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ దొరకక పోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
నిఖా పేరుతో దగా
వారంలో ఇద్దరుబాలికలతో అరబ్‌షేక్ పెళ్లి షేక్ సహా 12 మంది నిందితుల అరెస్టు హైదరాబాద్, న్యూస్‌లైన్: పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వారం వ్యవధిలో ఇద్దరు బాలికలను పెళ్లి చేసుకున్నాడో అరబ్‌షేక్. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్‌తో పాటు ఇతనికి సహకరించిన 11మందిని భవానీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠీ కథనం ప్రకారం.. ఒమన్‌కి చెందిన అల్ మదసరీ రాషేద్ మసూద్ రషీద్ (61) టూరిస్ట్ వీసాపై ఈ నెల 5వ తేదీన నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్ రోడ్డు నెం.11లోని పటేల్ అవెన్యూలో గది అద్దెకు తీసుకున్నాడు. పాతబస్తీకి చెందిన బ్రోకర్ల ద్వారా తలాబ్‌కట్టకు చెందిన బాలిక (14)ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాడు. బ్రోకర్లు మహ్మద్ జాఫర్ అలీ, కరీమున్నీసా బేగం, అమీనా బేగం, మహ్మద్ ఉస్మాన్‌లు బాలిక తల్లి రబియా బేగం, పెంపుడు తండ్రి ఖాజా పాషాలను ఒప్పించి వారికి రూ.60వేలు అందించారు. ఈ నెల 9వ తేదీన ఖాజీ మహ్మద్ గౌస్ మోయియుద్దీన్ సమక్షంలో బాలికకు అరబ్ షేక్‌తో వివాహం జరిపించారు. అయితే, సదరు బాలిక అదేరోజు తప్పించుకొని తన మామకు సమాచారం ఇచ్చింది. ఆయన భవానీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. షేక్ అద్దెకుంటున్న గదిపై దాడి చేశారు. సదరు షేక్ చెరలో మరో బాలిక ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. శివరాంపల్లికి చెందిన బాలిక (15)ను ఈనెల 15న పెళ్లి చేసుకున్నానని వెల్లడించాడు. హసీనాబేగం, షాకీరా బేగంలు బ్రోకర్లుగా వ్యవహరించారని చెప్పాడు. ఖాజీ జాహెద్ అలీ హైదర్ సమక్షంలో పెళ్లి చేసుకొని బాలిక తల్లి షైనాజ్ బేగంకు రూ. 80వేలు చెల్లించానని తెలిపాడు. పోలీసులు రెండో బాధితురాలైన బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అరబ్ షేక్ నుంచి పాసుపోర్టుతో పాటు రూ.5వేల నగదు, 2,725 డాలర్లు, 120 రియాల్స్, మూడు సెల్ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు.