Qazi Saida Hameed Now Trending For Muslims Nikha, Special Story In Telugu - Sakshi
Sakshi News home page

Qazi Saida Hameed: మాజీ రాష్ట్రపతి మునిమనవడి నిఖా.. ట్రెండింగ్‌లో సైదా హమీద్‌

Published Wed, Mar 16 2022 4:34 AM | Last Updated on Wed, Mar 16 2022 8:24 AM

Saida Hameed is in trending now for Muslims Nikha - Sakshi

సైదా హమీద్‌

‘కుబూల్‌ హై... కుబూల్‌ హై.. కుబూల్‌ హై’ అని మూడుసార్లు వధువరులు ఖాజీ సాక్షిగా అంగీకరిస్తేనే ముస్లింలలో నిఖా పక్కా అవుతుంది. ఖాజీ లేని పెళ్లి చెల్లదు. దేశంలో ఎప్పటి నుంచో పురుషులే ఖాజీలుగా ఉన్నారు. గతంలో కేరళలో నమాజు చదివించే స్త్రీలు వచ్చారు. ఇప్పుడు నిఖా చేసే మహిళా ఖాజీగా సైదా హమీద్‌ ప్రశంసలు అందుకుంటున్నారు. విద్యాధికురాలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నత పదవులు నిర్వహించిన సైదా హమీద్‌ ముస్లిం స్త్రీలు ఖాజీలుగా గుర్తింపు, ఉపాధి పొందవచ్చంటున్నారు. తాజాగా మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ జాకీర్‌ హుసేన్‌ మునిమనవడి నిఖాను జరిపించడంతో ఆమె ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు.

‘ముస్లిం మహిళలు చదువుకు ఇచ్చిన విలువ గురించి చాలామందికి తెలియదు. నేడు అలిఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో సంవత్సరానికి 8 వేల మంది చదువుకుంటున్నారన్నా, అక్కడి ఉమెన్స్‌ కాలేజ్‌లో 3 వేల మంది అమ్మాయిలు చదువుకుంటున్నారన్నా దానికి కారణం భోపాల్‌ స్టేట్‌కు పాలకురాలిగా ఉన్న నవాబ్‌ సుల్తాన్‌ జహాన్‌. 1920లలో ఆమె ఇచ్చిన 50 వేల రూపాయల విరాళంతో ఆ యూనివర్సిటీలో భవన నిర్మాణం జరిగింది. ఆమె ఆ తర్వాత ఆ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్‌ చాన్సలర్‌ అయ్యింది.

ఇక ఢిల్లీలో విఖ్యాతి గాంచిన జామియా మిలియా యూనివర్సిటీ ఎదుగుదల వెనుక ఎందరో ముస్లిం స్త్రీలు ఉన్నారు. వారి గురించి ‘జామియా కే ఆపాజాన్‌’ అనే పుస్తకమే ఉంది. వారిలో డాక్టర్‌ జాకిర్‌ హుసేన్‌ సతీమణి షాజహాన్‌ బేగం ఒకరు. ఆ రోజుల్లోనే ఆమె చీర ధరించి (ముస్లిం స్త్రీలు చీర ధరించరు అనే అపోహ ఉండేది) యూనివర్సిటీ పనులు పర్యవేక్షించారు. నేడు వారి ముని మనవడి నికాహ్‌ను నేను జరిపించడం సంతోషం’ అంటారు సైదా హమీద్‌.

79 ఏళ్ల సైదా హమీద్‌ మొన్నటి శుక్రవారం నుంచి వార్తల్లో ఉన్నారు. అందుకు కారణం నాటి భారత రాష్ట్రపతి డాక్టర్‌ జాకిర్‌ హుసేన్‌ మునిమనవడు కుర్బాన్‌ అలీ కుమార్తె ఉర్సిలా అలీ వివాహాన్ని ఢిల్లీలోని జామియా నగర్‌లో జాకిర్‌ హుసేన్‌ స్వగృహంలో నిర్వహించడమే. వరుడి పేరు గిబ్రన్‌ రెహమాన్‌. సాధారణంగా ముస్లింల పెళ్లిళ్లలో ఖాజీ (న్యాయ పెద్ద) మగవాడే ఉంటాడు. ముస్లింలలో వచ్చే మత పరమైన, కౌటుంబిక విభేదాలకు ముస్లింలు ఈ ఖాజీలనే సంప్రదించి ఖురాన్, షరియత్‌ల ప్రకారం పరిష్కారం కోరుతుంటారు. ఈ ఖాజీలే నిఖాలు జరిపిస్తారు. అయితే స్త్రీలు ఈ రంగంలో కనిపించడం చాలా అరుదు. సైదా హమీద్‌ గత పదేళ్లుగా తనకు అవకాశం కలిగినప్పుడు ఖాజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికి ఆమె 16 నిఖాలు తన ఆధ్వర్యంలో చేశారు. ఇది చిన్న విషయం కాదు.

‘పదేళ్ల క్రితం నైష్‌ హసన్‌ అనే నా స్నేహితురాలు, ముస్లిం మహిళా యాక్టివిస్టు నాకు ఫోన్‌ చేసింది. సైదా... మా ఇంట్లో ఒక పెళ్లి ఉంది నువ్వు రావాలి అంది. సరే అన్నాను. నిఖా కూడా నువ్వే జరిపించాలి అని కూడా అంది. నేను అవాక్కయ్యాను. కాని కాసేపటికి ఆమె కోరింది మెదడులోకి ఇంకి అవును మహిళలు ఈ పని ఎందుకు చేయకూడదు అని అనుకున్నాను. సంతోషంగా అలా ఖాజీగా మారి నిఖా జరిపించాను’ అంటుంది సైదా హమీద్‌.

అయితే ఆ పని ఆమె ఏదో ఆషామాషీగా చేయలేదు. ఖాజీగా మారే ముందు మళ్లోసారి ఖురాన్‌ను క్షుణ్ణంగా చదివి మహిళలకు ఈ పని నిషిద్ధం చేయబడిందేమో పరిశీలించింది. అలాంటిదేమీ కనిపించలేదు. పైగా స్త్రీలకు నిఖా చట్టబద్ధంగా ఎన్ని విధాలుగా రక్షణ ఇవ్వాలో కూడా ఆమెకు అందులో ఆధారం దొరికింది.

‘నా దృష్టిలో ఖాజీ ఇచ్చే నికానామా (నిఖా ధృవపత్రం) ఒక తెల్లకాగితంగా ఉండకూడదు. అందులో పెళ్లి నిబంధనలు, తలాక్‌ నిబంధనలు కూడా ఉండాలి. అవి లేకుండా వధువు, వరుడు పేర్లు రాసి ఇవ్వడం అంత సరైనదిగా అనిపించలేదు. 2000 సంవత్సరం నుంచి నేను ముస్లిం మహిళల కోసం ‘ముస్లిం విమెన్‌ ఫోరమ్‌’ నడుపుతున్నాను. ఆ ఫోరమ్‌ తరఫున ఒక సరైన నిఖా నామాను స్త్రీలకు రక్షణ ఇచ్చే నిబంధనలతో రాయించి నిఖా జరిపించాను’ అంటుంది సైదా హమీద్‌.

కశ్మీర్‌లో జన్మించిన సైదా హమీద్‌ ముందు నుంచి స్త్రీల విద్య, ఉపాధి, మత సంబంధ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆమె ఆ రోజుల్లోనే కెనెడాకు వెళ్లి ఉన్నత చదువులు చదివారు. కెనెడాలోని అల్‌బ్రెటా యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్‌ హమీద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీని తన కార్యరంగంగా చేసుకుని ప్రభుత్వ పరమైన అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యురాలిగా పని చేశారు. హైదరాబాద్‌ ఉర్దూ యూనివర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా కూడా. ఆమె ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అలాగే మేరిటల్‌ రేప్‌ను కూడా సమర్థించాల్సిన పని లేదు అంటుందామె. అలాగే దేశంలో సహృద్భావ వాతావరణం కోసం కూడా ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

‘ముస్లిం స్త్రీల ఆధునిక దృష్టి సామాజిక రంగాలలో వారు చూపిన ప్రతిభ గురించి ముస్లింలకు ఇతర వర్గాలకు కూడా తెలియదు. ముస్లిం యువతులు విద్యారంగంలో రాణించాలని తపన పడుతున్నారు. వారిని ప్రోత్సహించడమే మనం చేయవలసిన పని’ అంటారు సైదా హమీద్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement