Muslim marriages
-
అసోంలో ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ రద్దు..
న్యూఢిల్లీ: ముస్లింల పెళ్లిళ్లు, విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అసోం అసెంబ్లీ గురువారం బిల్లును ఆమోదించింది. ముస్లిం పెళ్లి, విడాకుల చట్టం–1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆప్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్సెస్ బిల్లు–2024ను తీసుకువచి్చంది. బాల్య వివాహాలకు, బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడానికి హిమంత బిశ్వ శర్మ సర్కారు ఈ కొత్త బిల్లును తెచ్చింది.గతంలో ఖాజీలు చేసిన పెళ్లిళ్లు చెల్లుబాటు అవుతాయని, ఇకపై జరిగే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరని సీఎం హిమంత వివరణ ఇచ్చారు. కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిల కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా పేర్కొన్నారు. వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని ప్రకటించాలి. అవివాహితులా, విడాకులు తీసుకున్నారా లేక వైధవ్యం సంప్రాప్తించిందా? అనే వివరాలను వెల్లడించాలి. ఇరువురి అంగీకారంతోనే వివాహం జరగాలి. ఏ ఒక్కరి సమ్మతి లేకుండా వివాహం జరిగినా అది చెల్లదు. వివాహిత మహిళల, భర్తలను కోల్పోయిన వారి హక్కులను ఈ బిల్లు కాపాడుతుందని అసోం ప్రభుత్వం చెబుతోంది. -
ముస్లిం వివాహాలు, విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: అసెంబ్లీలో బిల్లు
ముస్లిం వివాహాలు, విడాకుల విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ముస్లిం వివాహాలు, విడాకులను రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ రూపొందించిన కొత్త బిల్లును అస్సాం కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.‘అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్యేజ్ అండ్ డివర్స్ బిల్లు-2024’ను ప్రభుత్వం అసెంబ్లీ ప్రవేశపెట్టగా.. మెజార్టీ సభ్యుల అంగీకరంతో ఆమోదం పొందింది. దీని ద్వారా బ్యాల వివాహాలను నిషేధించడం వీలవుతుందని సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు ఖాజీలు లేదా మతపెద్దలు ముస్లింల వివాహాలను రిజిస్టర్ చేసేవారని, ఇకపై అలా కుదరదని తెలిపారు. కొత్త బిల్లు ప్రకారం ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా జరుగుతుందన్నారు.కాగా, వధువు 18 ఏళ్లు నిండకపోయినా.. వరుడికి 21 ఏళ్లు రాక ముందే.. ముస్లింల వివాహ నమోదును అనుమతించే నిబంధనలను ముస్లిం వివాహాల చట్టంలో కలిగి ఉంది. అయితే కొత్త చట్టం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ముస్లిం మైనర్ బాలికలు తమ వివాహాన్ని నమోదు చేసుకోలేరని సీఎం తెలిపారు.ఇంతకముందు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం 1935ను రద్దు చేసింది. అయితే ఖాజీ వ్యవస్థను పునరుద్ధరించాలని అస్సాంలోని పలు ముస్లిం సంస్థలు ముఖ్యమంత్రిని అభ్యర్థించాయి. -
మాజీ రాష్ట్రపతి మునిమనవడి నిఖా.. ట్రెండింగ్‌లో సైదా హమీద్
‘కుబూల్ హై... కుబూల్ హై.. కుబూల్ హై’ అని మూడుసార్లు వధువరులు ఖాజీ సాక్షిగా అంగీకరిస్తేనే ముస్లింలలో నిఖా పక్కా అవుతుంది. ఖాజీ లేని పెళ్లి చెల్లదు. దేశంలో ఎప్పటి నుంచో పురుషులే ఖాజీలుగా ఉన్నారు. గతంలో కేరళలో నమాజు చదివించే స్త్రీలు వచ్చారు. ఇప్పుడు నిఖా చేసే మహిళా ఖాజీగా సైదా హమీద్ ప్రశంసలు అందుకుంటున్నారు. విద్యాధికురాలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నత పదవులు నిర్వహించిన సైదా హమీద్ ముస్లిం స్త్రీలు ఖాజీలుగా గుర్తింపు, ఉపాధి పొందవచ్చంటున్నారు. తాజాగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుసేన్ మునిమనవడి నిఖాను జరిపించడంతో ఆమె ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. ‘ముస్లిం మహిళలు చదువుకు ఇచ్చిన విలువ గురించి చాలామందికి తెలియదు. నేడు అలిఘర్ ముస్లిం యూనివర్సిటీలో సంవత్సరానికి 8 వేల మంది చదువుకుంటున్నారన్నా, అక్కడి ఉమెన్స్ కాలేజ్‌లో 3 వేల మంది అమ్మాయిలు చదువుకుంటున్నారన్నా దానికి కారణం భోపాల్ స్టేట్‌కు పాలకురాలిగా ఉన్న నవాబ్ సుల్తాన్ జహాన్. 1920లలో ఆమె ఇచ్చిన 50 వేల రూపాయల విరాళంతో ఆ యూనివర్సిటీలో భవన నిర్మాణం జరిగింది. ఆమె ఆ తర్వాత ఆ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ చాన్సలర్ అయ్యింది. ఇక ఢిల్లీలో విఖ్యాతి గాంచిన జామియా మిలియా యూనివర్సిటీ ఎదుగుదల వెనుక ఎందరో ముస్లిం స్త్రీలు ఉన్నారు. వారి గురించి ‘జామియా కే ఆపాజాన్’ అనే పుస్తకమే ఉంది. వారిలో డాక్టర్ జాకిర్ హుసేన్ సతీమణి షాజహాన్ బేగం ఒకరు. ఆ రోజుల్లోనే ఆమె చీర ధరించి (ముస్లిం స్త్రీలు చీర ధరించరు అనే అపోహ ఉండేది) యూనివర్సిటీ పనులు పర్యవేక్షించారు. నేడు వారి ముని మనవడి నికాహ్ను నేను జరిపించడం సంతోషం’ అంటారు సైదా హమీద్. 79 ఏళ్ల సైదా హమీద్ మొన్నటి శుక్రవారం నుంచి వార్తల్లో ఉన్నారు. అందుకు కారణం నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుసేన్ మునిమనవడు కుర్బాన్ అలీ కుమార్తె ఉర్సిలా అలీ వివాహాన్ని ఢిల్లీలోని జామియా నగర్లో జాకిర్ హుసేన్ స్వగృహంలో నిర్వహించడమే. వరుడి పేరు గిబ్రన్ రెహమాన్. సాధారణంగా ముస్లింల పెళ్లిళ్లలో ఖాజీ (న్యాయ పెద్ద) మగవాడే ఉంటాడు. ముస్లింలలో వచ్చే మత పరమైన, కౌటుంబిక విభేదాలకు ముస్లింలు ఈ ఖాజీలనే సంప్రదించి ఖురాన్, షరియత్‌ల ప్రకారం పరిష్కారం కోరుతుంటారు. ఈ ఖాజీలే నిఖాలు జరిపిస్తారు. అయితే స్త్రీలు ఈ రంగంలో కనిపించడం చాలా అరుదు. సైదా హమీద్ గత పదేళ్లుగా తనకు అవకాశం కలిగినప్పుడు ఖాజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికి ఆమె 16 నిఖాలు తన ఆధ్వర్యంలో చేశారు. ఇది చిన్న విషయం కాదు. ‘పదేళ్ల క్రితం నైష్ హసన్ అనే నా స్నేహితురాలు, ముస్లిం మహిళా యాక్టివిస్టు నాకు ఫోన్ చేసింది. సైదా... మా ఇంట్లో ఒక పెళ్లి ఉంది నువ్వు రావాలి అంది. సరే అన్నాను. నిఖా కూడా నువ్వే జరిపించాలి అని కూడా అంది. నేను అవాక్కయ్యాను. కాని కాసేపటికి ఆమె కోరింది మెదడులోకి ఇంకి అవును మహిళలు ఈ పని ఎందుకు చేయకూడదు అని అనుకున్నాను. సంతోషంగా అలా ఖాజీగా మారి నిఖా జరిపించాను’ అంటుంది సైదా హమీద్. అయితే ఆ పని ఆమె ఏదో ఆషామాషీగా చేయలేదు. ఖాజీగా మారే ముందు మళ్లోసారి ఖురాన్‌ను క్షుణ్ణంగా చదివి మహిళలకు ఈ పని నిషిద్ధం చేయబడిందేమో పరిశీలించింది. అలాంటిదేమీ కనిపించలేదు. పైగా స్త్రీలకు నిఖా చట్టబద్ధంగా ఎన్ని విధాలుగా రక్షణ ఇవ్వాలో కూడా ఆమెకు అందులో ఆధారం దొరికింది. ‘నా దృష్టిలో ఖాజీ ఇచ్చే నికానామా (నిఖా ధృవపత్రం) ఒక తెల్లకాగితంగా ఉండకూడదు. అందులో పెళ్లి నిబంధనలు, తలాక్ నిబంధనలు కూడా ఉండాలి. అవి లేకుండా వధువు, వరుడు పేర్లు రాసి ఇవ్వడం అంత సరైనదిగా అనిపించలేదు. 2000 సంవత్సరం నుంచి నేను ముస్లిం మహిళల కోసం ‘ముస్లిం విమెన్ ఫోరమ్’ నడుపుతున్నాను. ఆ ఫోరమ్ తరఫున ఒక సరైన నిఖా నామాను స్త్రీలకు రక్షణ ఇచ్చే నిబంధనలతో రాయించి నిఖా జరిపించాను’ అంటుంది సైదా హమీద్. కశ్మీర్లో జన్మించిన సైదా హమీద్ ముందు నుంచి స్త్రీల విద్య, ఉపాధి, మత సంబంధ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆమె ఆ రోజుల్లోనే కెనెడాకు వెళ్లి ఉన్నత చదువులు చదివారు. కెనెడాలోని అల్బ్రెటా యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్ హమీద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీని తన కార్యరంగంగా చేసుకుని ప్రభుత్వ పరమైన అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పని చేశారు. హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా కూడా. ఆమె ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అలాగే మేరిటల్ రేప్‌ను కూడా సమర్థించాల్సిన పని లేదు అంటుందామె. అలాగే దేశంలో సహృద్భావ వాతావరణం కోసం కూడా ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ‘ముస్లిం స్త్రీల ఆధునిక దృష్టి సామాజిక రంగాలలో వారు చూపిన ప్రతిభ గురించి ముస్లింలకు ఇతర వర్గాలకు కూడా తెలియదు. ముస్లిం యువతులు విద్యారంగంలో రాణించాలని తపన పడుతున్నారు. వారిని ప్రోత్సహించడమే మనం చేయవలసిన పని’ అంటారు సైదా హమీద్. -
ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం
సాక్షి, కరీంనగర్/వేములవాడ: ఓవైపు కరోనా వైరస్ ఉధృతి, మరోవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరల వల్ల పుట్టిన రోజు వేడుక ఎంత చిన్నగా చేసినా ఎంత లేదన్నా రూ. 10 వేలు ఆవిరి అవుతున్నాయి. అలాంటిది ఇక పెళ్లితంతుకు అయ్యే ఖర్చు గురించి చెప్పనక్కర్లేదు. అందులోనూ తినుబండారాలు, కూరలు, వంటలు ఎక్కువగా చేసే ముస్లిం ఇళ్లల్లో పెళ్లిళ్లకు ఖర్చు మరీ ఎక్కువవుతుంది. రానురాను ఈ వివాహ విందు ఖర్చు పెరిగిపోతుండటంతో ఆడపిల్లల కుటుంబాలను ఖర్చు బాధల నుంచి బయటపడేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన మతపెద్దలంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ పెళ్లి అయినా సరే ఒకటే కూర, ఒకటే స్వీటు ఉండాలని తీర్మానించుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చదవండి: తెలంగాణ: ఓపీ చూసి.. మందులు రాసి! నిర్ణయం వెనక ఏం జరిగింది? సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో పెళ్లిలో అమ్మాయి తరఫువారు పసందైన రుచులతో తీరొక్క తీపి పదార్థాలు సిద్ధం చేస్తారు. చికెన్, మటన్‌తో అనేక రకాల వంటలు, బిర్యానీ, చపాతీ రోటీ, కుర్బానీ కా మీఠా, ఖద్దూ కా కీర్, ఐస్‌క్రీం, షేమియా, షీర్ కుర్మా.. ఇట్టా చెప్పుకుంటే పోతే.. అబ్బో ఐటం లిస్టు గోల్కొండ కోట అంత పెద్దగా ఉంటుంది. కానీ కరోనా కాలంలో చాలామంది వ్యాపారాలు మందగించాయి. ఎంతో మంది నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో ఆడపిల్ల పెళ్లిలో ఒకప్పటిలా రకరకాల ఆహార పదార్థాలతో విందులు ఏర్పాటు చేయడం భారమైంది. పెళ్లికూతురుకు పుట్టింటి వారు కట్నకానుకలు లేదా సారె కింద ఇచ్చే వాటి కంటే ఈ విందులో వడ్డించే వెరైటీల ఖర్చు అనేక రెట్లు అధికమైంది. ఎంత తక్కువలో వెరైటీలు ప్లాన్ చేసినా.. ఎంతలేదన్నా.. రూ. మూడున్నర నుంచి రూ.నాలుగున్నర లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఈ ఖర్చుపై పేద, సామాన్య ముస్లిం కుటుంబాల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చదవండి: కృష్ణుడు రాకున్నా.. ఏకంగా 1,37,000 కిలోల బరువున్న గిరిని ‘ఎత్తేయొచ్చు’! భగారా, చికెన్ లేదా మటన్, ఒక స్వీట్ వివాహంలో పెరుగుతున్న విందు ఖర్చును నియంత్రించేందుకు ఇటీవల వేములవాడలోని షాదీఖానాలో 8 మజీద్ కమిటీల పెద్దలు సమావేశమయ్యారు. స్థానికంగా జరిగే విందుల్లో భగారాతో పాటు ఒకటే కూర చికెన్ లేదా మటన్ మాత్రమే వడ్డించాలని తీర్మానించారు. గతంలో మాదిరి గంపెడు స్వీట్లు చేయకుండా ఏదైనా ఒకే స్వీటు పెట్టాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానం ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. -
మంత్రి అండతో టీడీపీ నేతల దాష్టీకం
మంత్రి సోమిరెడ్డి తన ప్రచారం కోసం ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు. తన సభ నిర్వహణ కోసం పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న ముస్లింలను పోలీస్ బలగాలతో మెడపెట్టి బయటకు గెంటించారు. తన అనుచరులతో ముస్లింలపై దాష్టీకానికి పాల్పడ్డారు. పెళ్లి పనులకు అటంకం కల్పించడంపై ఆందోళనకు దిగినా మంత్రి పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై ముస్లింలు భగ్గుమంటున్నారు. పొదలకూరు: పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన ముస్లింలు షాదీమంజిల్‌లో నిఖా చేసుకునేందుకు ముందుగానే నిబంధనల ప్రకారం తహసీల్దార్ నుంచి ఆది, సోమవారానికి అనుమతి పొందారు. ఇందుకు కమిటీలో ఇద్దరు నూతన సభ్యులు అనుమతికి సంతకాలు కూడా చేశారు. పెళ్లి బృందాలు షాదీ మంజిల్‌కు చేరుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి వారితో కళకళలాడుతున్న షాదీ మంజిల్‌లో ఆదివారం వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంత్రి సమావేశం నిర్వహించేందుకు నూతన కమిటీ సిద్ధం కావడంతో ఉద్రిక వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు షాదీమంజిల్ వద్దకు చేరుకుని పెళ్లి జరగాల్సిన చోట ఫ్లెక్సీలు కట్టి, సభా వేదికను ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు తరఫు బంధువులు, తల్లిదండ్రులు ఇదెక్కడి న్యాయమని తమను పెళ్లి పనులు చేసుకోనివ్వరా? అంటూ గొంతు చించుకున్నా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో గొడవలు జరుగుతాయని ముందుగా ఊహించిన అధికార పార్టీ నేతలు ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయరెడ్డి నేతృత్వంలో చుట్టుపక్కల పోలీస్స్టేషన్ల నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెళ్లి బృందాన్ని షాదీ మంజిల్ భవనంలోకి ప్రవేశించకుండా రోప్ పార్టీతో అడ్డుకున్నారు. ఒక దశలో ముస్లిం మహిళలు భవనం వద్దకు వెళ్లి బైఠాయించి ఆందోళనకు దిగారు. తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించి.. నూతన కమిటీ నాయకులు భవనం తాళాలు పగులగొట్టి షాదీ మంజిల్ భవనంలోకి ప్రవేశించి సభా వేదికను ఏర్పాటు చేశారు. షాదీమంజిలో మహబూబ్‌బాషా, మున్నీ కుమారుడి వివాహం జరిపించేందుకు ముందస్తుగా తహసీల్దార్ నిర్మలానందబాబా ద్వారా ఆదివారం ఉదయం 11 నుంచి సోమవారం మధ్యాహ్నం వరకుఅనుమతి పొంది తాళాలు తీసుకున్నారు. ఆకస్మికంగా అధికార పార్టీకి చెందిన మంజిల్ నూతన కమిటీ సభను ఏర్పాటు చేసుకోవాలని తాళాలు ఇవ్వాల్సిందిగా పోలీసుల ద్వారా అడిగించారు. పెళ్లి పనుల్లో ఉన్న వారు తాళాలు ఇవ్వలేమని, పెళ్లి జరుగుతున్న చోట సభలు ఎలా పెడతారని ప్రశ్నించారు. పక్కనే మూడు భవనాలు ఖాళీగా ఉన్నాయని వాటిలో మంత్రి సభను నిర్వహించుకోవాల్సిందిగా సూచించారు. అయితే అధికారం ఉందని తాళాలు పగుల గొట్టడంతో దీన్ని అడ్డుకునేందుకు పెళ్లి వారు, బంధువులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుపడి పెళ్లి బృందాన్ని బయటకు పంపించారు. పోలీసులు, పెళ్లి వారి బంధువుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో మంత్రి వచ్చి వెళ్లేంత వరకు పెళ్లి వారిని లోపలికి ప్రవేశించకుండా పోలీసులు మెయిన్ రోడ్డుపైనే రోప్‌పార్టీ ద్వారా అడ్డుకున్నారు. మంత్రి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు పెళ్లి వారిని బయటకు పంపి సమావేశం నిర్వహిస్తున్న మంత్రి సోమిరెడ్డి తీరును నిరసిస్తూ ముస్లింలు మెయిన్‌రోడ్డుపై డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ జరుగుతున్న దాష్టీకంపై తాము చెప్పేది మంత్రి వినాలని డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రాజకీయ పార్టీలతో పని లేదని పెళ్లి పనులు చేసుకోనివ్వకుండా ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులకు గురి చేయాలని టీడీపీకి చెందిన మైనార్టీ నేత ముసుగులో ఓ వ్యక్తి ఇదంతా చేస్తున్నట్టు ధ్వజమెత్తారు. మా మనోభావాలను దెబ్బతీశారు శుభమాని సొంత సోదరి కుమార్తెను తమ కుమారుడికిచ్చి వివాహం జరిపించేందుకు ఏర్పాటు చేస్తుండగా సభలు, సమావేశాలంటూ మా మనోభావాలను దెబ్బతీశారు. శుభాకార్యం చేసుకుంటున్న తమ ఇంట్లో సంతోషం లేకుండా చేశారు. మాకు రాజకీయ పార్టీలతో పనిలేదు, ఎలాంటి వివాదాల జోలికి వెళ్లేవాళ్లం కాదు. పెళ్లి జరిగే ప్రదేశంలో ఒక పార్టీకి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, కార్యకర్తలతో వచ్చి గందరగోళం సృష్టించారు. తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే ఆయన సర్దుకుని వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చారు. పోలీసు అధికారులు సైతం పక్షపాత వైఖరి ప్రదర్శించారు. – ఎస్కే మాహబూబ్‌బాషా, మున్నీ,పెళ్లి కొడుకు తల్లిదండ్రులు -
ముస్లిం పెళ్లిళ్లు ఆన్లైన్లో నమోదు
సాకి, హైదరాబాద్: ముస్లింల పెళ్లిళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కోసం కసరత్తు సాగుతోంది. నాజిరుల్ ఖజాత్ (ఖాజీ కేంద్ర ప్రతినిధి) కార్యాలయం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి పెళ్లి వివరాలు స్థానిక ఖాజీలతోపాటు రాష్ట్ర నాజిరుల్ ఖజాత్ కార్యాలయంలో నమోదవుతున్నాయి. మ్యారేజ్ సర్టిఫికెట్లనూ జారీ చేస్తున్నారు. ఇదంతా రాతపూర్వకంగా సాగుతోంది. పెళ్లిళ్ల వివరాలు రాష్ట్ర నాజి రుల్ ఖజాత్ కార్యాలయంలో నమోదు కావడం ఆలస్యమవుతోంది. ఆన్‌లైన్‌లోనైతే ఏరోజుకారోజు వివరాలు నమోదవుతాయని భావించిన అధికా రులు ఈ దిశగా కార్యాచరణ మొదలు పెట్టారు. పెళ్లి సమయంలో తప్పుడు దస్తావేజులు నమోదు చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఇక ఉండదు. ఆన్లైన్లో మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ పెళ్లి సమయంలో ఖాజీలకు సమర్పించే వధూవరుల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఇంటి అడ్రస్, ఇరువురు తరఫున సాక్షుల వివరాలతోపాటు పెళ్లి జరిగిన ప్రదేశం తదితర దస్తావేజులు మొత్తం ఆన్లైన్లో నమోదవుతాయి. ఇదివరకే పెళ్లి అయినా ఇంకా పెళ్లి కాలేదంటూ వధూవరులు తప్పుడు సమాచారమిస్తే వెంటనే తెలిసిపోతుంది. పెళ్లిళ్లలో మోసాలకు ఈ విధానంతో అడ్డుకట్ట పడుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో జారీ చేయడానికి వక్ఫ్ బోర్డు యత్నాలు ప్రారంభించింది. సర్టిఫికెట్ కావాలంటే పెళ్లి పుస్తకాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అధికారులు తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి సర్టిఫికెట్‌ను ఆన్లైన్లో జారీ చేస్తారు. కార్యకలాపాలు సులభతరం పెళ్లిళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే ఖాజీలతోపాటు నాజిరుల్ ఖజాత్ కార్యాలయంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ప్రక్రియ సులభతరమవుతుంది. ఆన్లైన్ ప్రక్రియను వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ మేరకు ఒక ఐటీ కంపెనీని సంప్రదించాం. ఈ నెల 24వ తేదీ జరిగే బోర్డు కార్యవర్గ సమావేశంలో ఈ ప్రక్రియ గురించి కంపెనీ ప్రతినిధులు వివరిస్తారు. – రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం -
ముస్లిం వివాహాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
అహ్మదాబాద్: ముస్లింలు ప్రస్తుతం అవలంభిస్తున్న వివాహ విధానంపై గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ముస్లిం వ్యక్తి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది మహిళలను నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చనే చట్టాలు ఆదిమకాలం నాటివని, నేటి సామాజిక పరిస్థితుల్లో అలాంటి చట్టాలను మనుషులను మరింత వెనుకబాటులోకి నెట్టేస్తాయని కోర్టు అభిప్రాయపడింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ ముస్లిం వివాహిత, తన భర్త రెండో పెళ్లి చేసుకోవడాన్ని సవాలుచేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జె.బి.పార్దివాలా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం ముస్లింలు అనుసరిస్తున్న పాతకాలం నాటి చట్టాలు మహిళల అణిచివేతను ప్రోత్సహించేవిగా ఉన్నాయని, ఈ కారణంగా ఎందరో ముస్లిం వివాహితలు ఇబ్బందులకు గురవుతున్నారని జస్టిస్ పార్దీవాలా అన్నారు. 'హిందూ వివాహచట్టాల ప్రకారం ఒక వ్యక్తి ..ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ భావన హిందువులు కాలంతోపాటుగా మారారనడానికి సంకేతంగా నిలుస్తుంది. అదే ముస్లింల పరిస్థితి మాత్రం ఇంకా పురాతన యుగంలోనే ఉన్నట్లనిపిస్తుంది. దీనిపై మౌల్వీలు, ముస్లిం నాయకులు కూర్చుని చర్చించాల్సిన అవసరం తప్పక ఉంది' అని సూచించారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలైతే ఇలాంటి ఆటవిక చట్టాల్లో మార్పులు సాధ్యమని జస్టిస్ పార్థీవాలా అభిప్రాయపడ్డారు. కాగా, ముస్లిం పర్సనల్ లా బోర్డు చట్టాల ప్రకారం సదరు నిందితుడు తప్పు చేసినట్ లుకాదని తేల్చిన కోర్టు.. ఆమె భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.