ప్రతీకాత్మక చిత్రం
సాకి, హైదరాబాద్: ముస్లింల పెళ్లిళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ కోసం కసరత్తు సాగుతోంది. నాజిరుల్ ఖజాత్ (ఖాజీ కేంద్ర ప్రతినిధి) కార్యాలయం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి పెళ్లి వివరాలు స్థానిక ఖాజీలతోపాటు రాష్ట్ర నాజిరుల్ ఖజాత్ కార్యాలయంలో నమోదవుతున్నాయి. మ్యారేజ్ సర్టిఫికెట్లనూ జారీ చేస్తున్నారు. ఇదంతా రాతపూర్వకంగా సాగుతోంది. పెళ్లిళ్ల వివరాలు రాష్ట్ర నాజి రుల్ ఖజాత్ కార్యాలయంలో నమోదు కావడం ఆలస్యమవుతోంది. ఆన్‌లైన్‌లోనైతే ఏరోజుకారోజు వివరాలు నమోదవుతాయని భావించిన అధికా రులు ఈ దిశగా కార్యాచరణ మొదలు పెట్టారు. పెళ్లి సమయంలో తప్పుడు దస్తావేజులు నమోదు చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఇక ఉండదు.
ఆన్‌లైన్‌లో మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ
పెళ్లి సమయంలో ఖాజీలకు సమర్పించే వధూవరుల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఇంటి అడ్రస్, ఇరువురు తరఫున సాక్షుల వివరాలతోపాటు పెళ్లి జరిగిన ప్రదేశం తదితర దస్తావేజులు మొత్తం ఆన్‌లైన్‌లో నమోదవుతాయి. ఇదివరకే పెళ్లి అయినా ఇంకా పెళ్లి కాలేదంటూ వధూవరులు తప్పుడు సమాచారమిస్తే వెంటనే తెలిసిపోతుంది. పెళ్లిళ్లలో మోసాలకు ఈ విధానంతో అడ్డుకట్ట పడుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయడానికి వక్ఫ్ బోర్డు యత్నాలు ప్రారంభించింది. సర్టిఫికెట్ కావాలంటే పెళ్లి పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అధికారులు తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు.
కార్యకలాపాలు సులభతరం
పెళ్లిళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ఖాజీలతోపాటు నాజిరుల్ ఖజాత్ కార్యాలయంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ప్రక్రియ సులభతరమవుతుంది. ఆన్‌లైన్ ప్రక్రియను వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ మేరకు ఒక ఐటీ కంపెనీని సంప్రదించాం. ఈ నెల 24వ తేదీ జరిగే బోర్డు కార్యవర్గ సమావేశంలో ఈ ప్రక్రియ గురించి కంపెనీ ప్రతినిధులు వివరిస్తారు. – రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం
Comments
Please login to add a commentAdd a comment