మంత్రి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న ముస్లింలు
మంత్రి సోమిరెడ్డి తన ప్రచారం కోసం ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు. తన సభ నిర్వహణ కోసం పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న ముస్లింలను పోలీస్ బలగాలతో మెడపెట్టి బయటకు గెంటించారు. తన అనుచరులతో ముస్లింలపై దాష్టీకానికి పాల్పడ్డారు. పెళ్లి పనులకు అటంకం కల్పించడంపై ఆందోళనకు దిగినా మంత్రి పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై ముస్లింలు భగ్గుమంటున్నారు.
పొదలకూరు: పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన ముస్లింలు షాదీమంజిల్‌లో నిఖా చేసుకునేందుకు ముందుగానే నిబంధనల ప్రకారం తహసీల్దార్ నుంచి ఆది, సోమవారానికి అనుమతి పొందారు. ఇందుకు కమిటీలో ఇద్దరు నూతన సభ్యులు అనుమతికి సంతకాలు కూడా చేశారు. పెళ్లి బృందాలు షాదీ మంజిల్‌కు చేరుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి వారితో కళకళలాడుతున్న షాదీ మంజిల్‌లో ఆదివారం వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంత్రి సమావేశం నిర్వహించేందుకు నూతన కమిటీ సిద్ధం కావడంతో ఉద్రిక వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు షాదీమంజిల్ వద్దకు చేరుకుని పెళ్లి జరగాల్సిన చోట ఫ్లెక్సీలు కట్టి, సభా వేదికను ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు తరఫు బంధువులు, తల్లిదండ్రులు ఇదెక్కడి న్యాయమని తమను పెళ్లి పనులు చేసుకోనివ్వరా? అంటూ గొంతు చించుకున్నా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో గొడవలు జరుగుతాయని ముందుగా ఊహించిన అధికార పార్టీ నేతలు ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయరెడ్డి నేతృత్వంలో చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్ల నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెళ్లి బృందాన్ని షాదీ మంజిల్ భవనంలోకి ప్రవేశించకుండా రోప్ పార్టీతో అడ్డుకున్నారు. ఒక దశలో ముస్లిం మహిళలు భవనం వద్దకు వెళ్లి బైఠాయించి ఆందోళనకు దిగారు.
తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించి..
నూతన కమిటీ నాయకులు భవనం తాళాలు పగులగొట్టి షాదీ మంజిల్ భవనంలోకి ప్రవేశించి సభా వేదికను ఏర్పాటు చేశారు. షాదీమంజిలో మహబూబ్‌బాషా, మున్నీ కుమారుడి వివాహం జరిపించేందుకు ముందస్తుగా తహసీల్దార్ నిర్మలానందబాబా ద్వారా ఆదివారం ఉదయం 11 నుంచి సోమవారం మధ్యాహ్నం వరకుఅనుమతి పొంది తాళాలు తీసుకున్నారు. ఆకస్మికంగా అధికార పార్టీకి చెందిన మంజిల్ నూతన కమిటీ సభను ఏర్పాటు చేసుకోవాలని తాళాలు ఇవ్వాల్సిందిగా పోలీసుల ద్వారా అడిగించారు. పెళ్లి పనుల్లో ఉన్న వారు తాళాలు ఇవ్వలేమని, పెళ్లి జరుగుతున్న చోట సభలు ఎలా పెడతారని ప్రశ్నించారు. పక్కనే మూడు భవనాలు ఖాళీగా ఉన్నాయని వాటిలో మంత్రి సభను నిర్వహించుకోవాల్సిందిగా సూచించారు. అయితే అధికారం ఉందని తాళాలు పగుల గొట్టడంతో దీన్ని అడ్డుకునేందుకు పెళ్లి వారు, బంధువులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుపడి పెళ్లి బృందాన్ని బయటకు పంపించారు. పోలీసులు, పెళ్లి వారి బంధువుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో మంత్రి వచ్చి వెళ్లేంత వరకు పెళ్లి వారిని లోపలికి ప్రవేశించకుండా పోలీసులు మెయిన్ రోడ్డుపైనే రోప్‌పార్టీ ద్వారా అడ్డుకున్నారు.
మంత్రి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు
పెళ్లి వారిని బయటకు పంపి సమావేశం నిర్వహిస్తున్న మంత్రి సోమిరెడ్డి తీరును నిరసిస్తూ ముస్లింలు మెయిన్‌రోడ్డుపై డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ జరుగుతున్న దాష్టీకంపై తాము చెప్పేది మంత్రి వినాలని డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రాజకీయ పార్టీలతో పని లేదని పెళ్లి పనులు చేసుకోనివ్వకుండా ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులకు గురి చేయాలని టీడీపీకి చెందిన మైనార్టీ నేత ముసుగులో ఓ వ్యక్తి ఇదంతా చేస్తున్నట్టు ధ్వజమెత్తారు.
మా మనోభావాలను దెబ్బతీశారు
శుభమాని సొంత సోదరి కుమార్తెను తమ కుమారుడికిచ్చి వివాహం జరిపించేందుకు ఏర్పాటు చేస్తుండగా సభలు, సమావేశాలంటూ మా మనోభావాలను దెబ్బతీశారు. శుభాకార్యం చేసుకుంటున్న తమ ఇంట్లో సంతోషం లేకుండా చేశారు. మాకు రాజకీయ పార్టీలతో పనిలేదు, ఎలాంటి వివాదాల జోలికి వెళ్లేవాళ్లం కాదు. పెళ్లి జరిగే ప్రదేశంలో ఒక పార్టీకి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, కార్యకర్తలతో వచ్చి గందరగోళం సృష్టించారు. తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే ఆయన సర్దుకుని వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చారు. పోలీసు అధికారులు సైతం పక్షపాత వైఖరి ప్రదర్శించారు.
– ఎస్‌కే మాహబూబ్‌బాషా, మున్నీ,పెళ్లి కొడుకు తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment