ముస్లిం వివాహాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
అహ్మదాబాద్: ముస్లింలు ప్రస్తుతం అవలంభిస్తున్న వివాహ విధానంపై గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ముస్లిం వ్యక్తి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది మహిళలను నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చనే చట్టాలు ఆదిమకాలం నాటివని, నేటి సామాజిక పరిస్థితుల్లో అలాంటి చట్టాలను మనుషులను మరింత వెనుకబాటులోకి నెట్టేస్తాయని కోర్టు అభిప్రాయపడింది.
అహ్మదాబాద్కు చెందిన ఓ ముస్లిం వివాహిత, తన భర్త రెండో పెళ్లి చేసుకోవడాన్ని సవాలుచేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జె.బి.పార్దివాలా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం ముస్లింలు అనుసరిస్తున్న పాతకాలం నాటి చట్టాలు మహిళల అణిచివేతను ప్రోత్సహించేవిగా ఉన్నాయని, ఈ కారణంగా ఎందరో ముస్లిం వివాహితలు ఇబ్బందులకు గురవుతున్నారని జస్టిస్ పార్దీవాలా అన్నారు.
'హిందూ వివాహచట్టాల ప్రకారం ఒక వ్యక్తి ..ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ భావన హిందువులు కాలంతోపాటుగా మారారనడానికి సంకేతంగా నిలుస్తుంది. అదే ముస్లింల పరిస్థితి మాత్రం ఇంకా పురాతన యుగంలోనే ఉన్నట్లనిపిస్తుంది. దీనిపై మౌల్వీలు, ముస్లిం నాయకులు కూర్చుని చర్చించాల్సిన అవసరం తప్పక ఉంది' అని సూచించారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలైతే ఇలాంటి ఆటవిక చట్టాల్లో మార్పులు సాధ్యమని జస్టిస్ పార్థీవాలా అభిప్రాయపడ్డారు. కాగా, ముస్లిం పర్సనల్ లా బోర్డు చట్టాల ప్రకారం సదరు నిందితుడు తప్పు చేసినట్ లుకాదని తేల్చిన కోర్టు.. ఆమె భార్య దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది.