ఆ మౌని కల నిజమైన వేళ.. .. | getha coming india to day | Sakshi
Sakshi News home page

ఆ మౌని కల నిజమైన వేళ.. ..

Published Mon, Oct 26 2015 8:33 AM | Last Updated on Fri, Sep 28 2018 8:12 PM

ఆ మౌని కల నిజమైన వేళ.. .. - Sakshi

ఆ మౌని కల నిజమైన వేళ.. ..

న్యూఢిల్లీ: ఓ సుదీర్ఘ జీవన ప్రయాణం.. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్నాలుగేళ్లు.. శత్రువుకన్నా భయంకరంగా చూసే దేశంలో సురక్షితంగా నిలిచిన ప్రాణం. పెరిగి పెద్దయై నేడు మాతృదేశంలో అడుగుపెట్టింది. కొన్నేళ్ల తర్వాత తిరిగి ఆమె అడుగులు భారత గడ్డపై సందడి చేశాయి. ఇన్నాళ్ల ఆమె మౌనం హద్దులు చెరిగింది. ఏడేళ్ల వయసులో పొరపాటున భారత సరిహద్దులు దాటి దశాబ్దకాలంపైగా పాకిస్థాన్లో నివసిస్తున్న మూగ, చెవిటి బాలిక గీత నేడు యువతిగా పెద్దదై ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టింది. సోమవారం ఉదయం ఆమె ఉదయం 9గంటల ప్రాంతంలో ఢిల్లీ చేరుకుంది.

ఇస్లామాబాద్లోని భారత్ కార్యాలయం పంపిన ఫొటోల నుంచి తన తండ్రి, తల్లి, సోదరీమణులను గుర్తించిన గీత.. తన వారితో కలిసిపోనుంది. అయితే, ఆమె తమకూతురంటే తమ కూతురుని పలువురు అంటుండటంతో ముందుగా ఆమెకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాతే తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. పాక్ లో ఆమె బాగోగులు చూస్తున్న స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఆమెతో వస్తున్నారు.

కరాచీలో నిలిచిన ప్రాణం
పుట్టుకతోనే మూగ, చెవిటి బాలిక అయిన గీత ఏడేళ్ల వయసులోనే పొరపాటున పాక్లో అడుగుపెట్టింది. సంజౌతా ఎక్స్ ప్రెస్ ద్వారా పాక్ వెళ్లిన గీత.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయోమయానికి లోనై నాడు లాహోర్ రైల్వే స్టేషన్ లో బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఆమె వివరాలు తెలుసుకునేందుకు అక్కడి వారు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఆమెకు మాటలు రాకపోవడమే ఇందుకు కారణమైంది. కేవలం హావభావాలు పలికించగల గీత చిన్ని మనసు దాయాది పాకిస్థాన్ అధికారుల గుండెలను కూడా పిండేసింది. ఆమె గురించి తెలుసుకున్న ఫహద్ ఈదీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గీత ఆలనపాలనా చూసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆమె కరాచీలో రెండోసారి జీవనం మొదలైంది.  

మలుపుతిప్పిన బజరంగీ భాయ్ జాన్
ఎప్పటికైనా తన వాళ్లను కలుస్తానని అనుకున్న గీత నమ్మకమో.. లేక తమ కూతురు ఏనాటికైనా దొరుకుతుందని భారత్ లోని ఆమె తల్లిదండ్రుల ఆశనో.. గీత జీవితాన్ని మార్చేసింది. సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్ చిత్రం ఇందుకు వారధిగా నిలిచింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బజరంగీ భాయ్ జాన్ కథ గీత కథ దాదాపు రెండు ఒకేలా ఉన్నాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించగా.. గీత తీరని కోరికకు మాత్రం చిగుళ్లు పూయించింది. ఈ చిత్ర విడుదల తర్వాత తన వాళ్ల వద్దకు వెళ్లాలని గీత అనుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. దీంతో మొత్తం భారత విదేశీ యంత్రాంగం రంగంలోకి దిగి ఆమెను తిరిగి భారత్ రప్పించే ఏర్పాట్లు ప్రారంభించింది.
ఎన్నో మలుపులు
మౌనమే వరంగా కలిగిన గీత జీవితంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా చిన్నవయసులోనే తల్లిదండ్రులకు దూరమైన ఆమెకు తల్లిదండ్రులు ఎవరనే విషయంలో ఓ అవగాహన ఉన్నప్పటికీ.. గీత తమ కూతురంటే తమ కూతురని పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్ రాష్ట్రాలకు చెందిన కొందరు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దీంతో అధికారులకు తలనొప్పిగా మారింది. మరోపక్క, 14 ఏళ్లుగా అజ్ఞాత వాసంలో ఉన్న గీత కథ ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో.. కొత్త మలుపు తిరిగింది. గీతకు మైనర్‌గా ఉన్నప్పుడే ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి ఓ బాబు కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. తనకు అసలు పెళ్లి కాలేదని గీత చెప్పింది. దీనికి తోడు తప్పిపోకముందు దిగిన ఓ బాలిక ఫొటోను చూపించినా ఇది తనది కాదని తెలిపింది. వీటన్నింటికి డీఎన్ఏ పరీక్ష తొలి సమాధానం కానుంది.  
సల్మాన్ ఇంటికి ఎప్పుడు వెళ్తుందో..!
భారత్కు వచ్చిన తర్వాత తన జీవితం మలుపు తిరిగేందుకు కారణమైన సల్మాన్ ఖాన్ను కలుసుకోవాలనుకుంటున్నట్లు గీత మనోభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సల్మాన్ కూడా తాను గీతను కలుస్తానని చెప్పాడు. ఇండియాకు వచ్చిన మరుక్షణమే కుటుంబ సభ్యులతో సహా వెళ్లి సల్మాన్ ఖాన్ ను కలుస్తానని చెప్పిన నేపథ్యంలో ఆ సందర్భం వచ్చినప్పుడు భావోద్వేగాలు ఎలా ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భావోద్వేగాల నడుమ..
ఇంతకాలంపాటు తనను కంటికి రెప్పల చూసుకున్న కరాచీ ఫౌండేషన్ ఫహద్ ఈదీ ఫౌండేషన్ గీత తిరిగి భారత్ కు వస్తున్న వేళ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తమ కూతురు తమను వదిలి వెళ్లిపోతున్నట్లుగా ఉందని కళ్లు చెమర్చింది. ఏదేమైనా ఎప్పటికైనా తల్లిదండ్రులను చేరాల్సిందేగా అంటూ పేర్కొంది. గీతను చక్కగా అలంకరించి హారతి ఇచ్చి సాగనంపే కార్యక్రమం పూర్తి చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement