sugars
-
షుగర్ ఉందని స్వీట్స్‌కి దూరంగా ఉండాల్సిన పనిలేదు, ఎందుకంటే..
మనలో స్వీట్స్ అంటే ఇష్టం లేనివారు ఉండరేమో. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా దేశంలోనే కాదు ప్రపంచంలో మధుమేహ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. దీంతో కృత్రిమ స్వీటెనర్ వాడకం కూడా పెరిగింది. చక్కెరకి ప్రత్యామ్నాయంగా వీటి వినియోగం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అయితే షుగర్ బదులు షుగర్-ఫ్రీ స్వీటెనర్స్ వాడడం వల్ల కేలొరీలు తగ్గుతాయి. సహజ ఉత్పత్తుల నుంచి తయారుచేసిన స్వీటెనర్స్ వాడడం వల్ల ఆహారంలో కేలొరీలు తగ్గుతాయి. దీని వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఉదాహరణకి స్టెవియా ఆధారిత స్వీటెనర్లు ఒక మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. ఈ మధ్యకాలంలో అలాంటి అల్లులోజ్ వాడకం బాగా పెరిగింది. అల్లులోజ్ను D-psicose అని కూడా పిలుస్తారు.ఇది 70% తీపిగా ఉన్న ఫీలింగ్ కలిగినప్పటికీ ఇందులో కేవలం 10% మాత్రమే కేలరీలను కలిగి ఉంటుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని మెరుగుపరుస్తుంది. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నా నాణ్యత విషయంలో పేలవంగా ఉందని కెనడా సహా మరికొన్ని దేశాల్లో అల్లులోజ్ వాడకంపై బ్యాన్ విధించారు. అయితే ఇప్పుడు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ (UC డేవిస్) సైంటిస్టులు అల్లులోజ్ క్వాలిటీపై జరిపిన పరీక్షల్లో ముఖ్యమైన పరోగతిని సాధించారు. అల్లులోజ్ చక్కెరకు గొప్ప ప్రత్యామ్నాయమని సైంటిస్టులు తెలిపారు. ఎందుకంటే ఇది గోధుమలు,అత్తిపండ్లు, ఎండుద్రాక్ష వంటి కొన్ని మొక్కలతో తయారుచేశారు. ఇందులో ఒక గ్రాములో కేవలం 0.4 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది, సుక్రోజ్‌లో గ్రాముకు నాలుగు కేలరీలు ఉంటాయి. అల్లులోజ్ను తిన్న తర్వాత 70% జీర్ణం అవగా, మిగతాది కేవలం 24గంటల వ్యవధిలోనే యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి అల్లులోజ్ రక్తంలో గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయదని పేర్కొన్నారు. -
బజాజ్ హిందుస్తాన్‌పై ఎస్బీఐ దివాలా పిటీషన్
న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద చక్కెర, ఇథనాల్ తయారీ సంస్థ బజాజ్ హిందుస్తాన్ షుగర్‌పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పిటీషన్ వేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్‌లో ఈ మేరకు అభ్యర్ధన దాఖలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రుణ వాయిదా, కూపన్ రేటు వడ్డీ చెల్లింపుల్లో జాప్యం చేయడంతో రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కంపెనీ ఖాతాను మొండి పద్దు (ఎన్పీఏ) కింద వర్గీకరించినట్లు ఎస్బీఐ పేర్కొంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,607 కోట్ల టర్నోవరుపై రూ. 268 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. బజాజ్ హిందుస్తాన్ షుగర్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో పధ్నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. చదవండి👉 కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..! -
ప్రైవేటీకరణ దిశగా గోవాడ!
అధికార పార్టీ ఎంపీ కన్ను? చెరకు రైతుల్లో ఆందోళన సుగర్స మహాజనసభ నేడు సహకార రంగంలో దేశంలోనే అత్యుత్తమ చెరకు ఫ్యాక్టరీల్లో ఒకటైన గోవాడ సుగర్స్ ప్రైవేటీకరణ వైపు పయనిస్తోందా? టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందా? ప్రస్తుత పరిణామాలు ఈ ప్రశ్నలకు తావిస్తున్నాయి. రైతు, ప్రభుత్వ భాగస్వామ్యంతో చెరకు రైతులకు అండగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను తెగనమ్మే పనిలో ప్రభుత్వం పడినట్టు తెలుస్తోంది. చోడవరం: రాష్ట్రంలో 10 సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా వాటిలో రెండు ఇప్పటికే మూతబడ్డాయి. మిగతా ఎనిమిదింటిలో చో డవరం (గోవాడ) లాభాల్లో ఉండగా ఏటికొప్పాక ఫ్యాక్టరీ లాభనష్టాలు లేకుండా నడుస్తోంది. ఆరు ఫ్యాక్టరీలు ప్రభుత్వంపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఏటా కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ కన్నేసినట్టు తెలిసింది. గోవాడతోపాటు మిగతా ఫ్యాక్టరీలను కూడా కొనుగోలుకు ఆ పార్టీకి చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు, విశాఖ డెయిరీ చైర్మన్ కూడా కాచుకు కూర్చున్నట్టు సమాచారం. వీరి ఒత్తిళ్ల మేర కే ప్రభుత్వం చెరకు పరిశ్రమలపై వేసిన అధ్యయన కమిటీలో వ్యూహాత్మకంగా ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీల యజమానులను నియమించిందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి అధికారులు, మంత్రులు, పరిశ్రమ, వ్యవసాయ నిపుణులతో అధ్యయన కమిటీ వేయాలి. అధ్యయన కమిటీలో కీలక వ్యక్తిగా ఉన్న సుధాకరచౌదరి గతంలో గోవాడ సుగర్స్ ఎండీగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలను నిర్వహిస్తున్నారు. గోవాడ ఫ్యాక్టరీని ఎంపీ సుజనా చౌదరికి కట్టబెట్టేందుకే సుధాకరచౌదరిని కమిటీలో వేశారన్న ప్రచారం సాగుతోంది. సుధాకర చౌదరి గోవాడ ఫ్యాక్టరీ ముఖ్య సలహాదారునిగా నియమించేందుకు ఇటీవల ముమ్మర యత్నాలు చేశారని చెబుతున్నారు. ఫ్యాక్టరీల అధ్యయనం పేరుతో నష్టాలు చూపించి, ఆశిస్తున్న నాయకులకు లీజు పేరుతో దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోనే 24 వేల మంది సభ్య రైతులున్న అతిపెద్ద ఫ్యాక్టరీ అయిన గోవాడపై లక్షన్నర కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నాయి. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వారు లాభాలు పొంది మిల్లును మూసేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. తాజాగా విజయనగరం జిల్లాలో కోట్లాది రూపాయలు రైతులకు గిట్టుబాటు ధర బకాయిలు ఇవ్వకుండా ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ మూసేసి వెళ్లిపోవడంతో ఇప్పుడు అక్కడ రైతులు అప్పులు పాలైపోయి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు, సీఎం చంద్రబాబు తీరుపై ఇక్కడ టీడీపీ నాయకులు కూడా అయోమయంలో పడ్డారు. గోవాడ ఫ్యాక్టరీ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే రాజు, సభ్యుడుగా ఉన్న మంత్రి అయ్యన్నపాత్రుడు టీడీపీకి చెందిన వారే. ప్రైవేటీకరణ జరిగితే రైతులు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉన్నందున తమ రాజకీయ భవిష్యత్‌పై వారు ఆందోళన చెందుతున్నట్టు కొందరు టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం జరిగే ఈ ఫ్యాక్టరీ మహాజనసభలో సభ్యుల నిర్ణయం ఎలా ఉంటోదనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
తుమ్మపాల సుగర్స్ అభివృద్ధికి కమిటీ
రైతులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి/తుమ్మపాల/అనకాపల్లి రూరల్/చోడవరం:తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాన్ని అభివృద్ధి చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీని వేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముఖ్యమంత్రి శుక్రవారం జిల్లాలో జరిపిన పర్యటనలో భాగంగా తుమ్మపాల చక్కెర కర్మాగార ఆవరణలో రైతులతో మాట్లాడుతూ మూడు నెలల్లో కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కర్మాగారం ఆధునికీకరణ, విస్తరణ వంటి అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. డెరైక్టర్ ఆఫ్ సుగర్స్తో కూడిన బృందం ఇక్కడికి వచ్చి అధ్యయనం చేస్తుందన్నారు. నివేదిక ఆధారంగా రైతులకు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా తుమ్మపాల కర్మాగారాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కర్మాగారంలో చక్కెరను విక్రయించి చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీతాల బకాయిలు చెల్లిస్తామన్నారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కలెక్టర్ యువరాజ్, జేసీ ప్రవీణ్ కుమార్, ఆర్డీవో వసంతరాయుడు, కర్మాగారం ఎమ్డీ ప్రభుదాస్, ఎంపీపీ కొణతాల వెంకటసావిత్రి, టీడీపీ నేతలు కొణతాల శ్రీను, బుద్ధ నాగజగదీష్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నూకాంబిక సన్నిధిలో చంద్రబాబు శ్రీ నూకాంబిక అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన చంద్రబాబు ఆలయ ముఖ ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఈయనకు మేళతాళాలతో ఎమ్మెల్యే పీలా గోవింద, దేవాదాయ శాఖాధికారులు ఎన్.ఎస్.ఎం.మూర్తి, పుష్కనాథం, ఎన్.ఎల్.ఎన్.శాస్త్రి, ఆలయ ఈఓ సుజాత స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు అమ్మవారి భారీ చిత్రపటాన్ని బహుకరించారు. ఆస్పత్రి వైద్యులతో సమీక్ష అనకాపల్లి వంద పడకల ఆస్పత్రిని ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మించనున్న భవనాన్ని, మహిళా, ఆరోగ్య శ్రీ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో సమీక్షా సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీకి నగదు పెంపు... ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.2 లక్షల మొత్తాన్ని రూ.2.5 లక్షలకు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన వెంట మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలా గోవింద, పంచకర్ల రమేశ్‌బాబు, పెతకంశెట్టి గణబాబు, వానపల్లి గణేశ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ లాలం భవాని ఉన్నారు. గోవాడ సామర్థ్యం 8 లక్షల టన్నులకు పెంపు గోవాడ సహకార చక్కెర కర్మాగారం క్రషింగ్ సామర్థ్యాన్ని 8 లక్షల టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. చోడవరంలో శుక్రవారం జరిగిన ‘పొలం పిలుస్తోంది-ఆవిష్కరణ’ సభలో ఆయన మాట్లాడుతూ యాజమాన్యం చెరకు రైతుల పిల్లల కోసం ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తే అనుమతిస్తానని ప్రకటించారు. ఈ సందర్భగా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి చక్కెర కర్మాగారం తరపున రూ.30 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి చైర్మన్ మల్లునాయుడు, ఎమ్డీ రమణారావు, ఎమ్మెల్యే రాజు అందజేశారు. అనంతరం కర్మాగారం అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. -
కనువిందుగా కన్యాశుల్కం
=తొలి ప్రదర్శన మనోహరం =ఆకట్టుకున్న నటీనటులు =మూడు గంటలపాటు కట్టిపడేసిన నాటకం చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : మహాకవి గురజాడ కలం నుంచి జాలువారి, శతాబ్దం తర్వాత కూడా సజీవంగా ఉన్న అజరామర నాటకం కన్యాశుల్కం ప్రేక్షకులను కట్టిపడేసింది. చోడవరం మండలంలో తొలిసారిగా ప్రదర్శితమైన సంక్షిప్త నాటకం వీక్షకులను రసవాహినిలో ఓలలాడించింది. కడుపుబ్బా నవ్వించింది. రంగస్థల నటులకు సవాలనదగ్గ ఈ నాటకంలో రాణించడంతో స్థానిక కళాకారుల సంతోషానికి అవధి లేకుండా పోయింది. గోవాడకు చెందిన లిఖిత సాయి క్రియేషన్స్ సంస్థ మొట్ట మొదటిసారిగా కన్యాశుల్కం నాటకాన్ని శనివారం రాత్రి ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో పంచముఖాంజనేయ, వేణుగోపాల స్వామి ఆలయాల ద్వితీయ వార్షికోత్సవం సందర్బంగా ఈ ప్రదర్శన సాగింది. గోవాడకు చెందిన భాగవతులు ఉదయ్ కుమార్ దర్శకత్వంలో సాగిన ఈ నాటక ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వణికించే చలిలో సైతం శనివారం రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ నాటకాన్ని తిలకించడం విశేషం. మన జిల్లాకే చెందిన మహాకవి గురజాడ రచించిన కన్యా శుల్కం నాటకం ఆధారంగా మూడు గంటల నిడివిలో ఈ ప్రదర్శన సాగింది. నాటకానికి ఆయువుపట్టయిన గిరీశం పాత్రలో ఉదయ్ కుమార్ ఆకట్టుకున్నారు. అతని శిష్యుడు వెంకటేశంగా బాల నటుడు వినయ్ రసవత్తరంగా నటించి రంజింపజేశాడు. సహజసిద్ధమైన రంగస్థలాంకరణ నాటకానికి మరింత కళ తెచ్చింది. ఏళ్లు గడిచినా గురజాడ కన్యాశుల్కానికి గల ఆదరణ తరగలేదని శనివారం మరోసారి రుజువైంది. ప్రేక్షకాదరణతో నాటక ప్రదర్శనపై నమ్మకం పెరిగిందని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతామని లిఖిత సాయి క్రియేషన్స్ ప్రతినిధి జయంతి సతీష్ తెలిపారు. నాటకంలోని కళాకారులను కందర్ప గౌరీశంకర్ దంపతులు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు కె. భాస్కరరావు, సమైక్యాంధ్ర జేఏసీ గోవాడ కన్వీనర్ ఎం.ఏ దేముడు, తదితరులు జ్ఞాపికలతో ప్రత్యేకంగా అభినందించారు. చాలా బాగుంది. కన్యాశుల్కం నాటక ప్రదర్శన చాలా బాగుంది. మొదటి ప్రయత్నంలోనే ఇంతలా విజయవంతం అవుతుందని అనుకోలేదు. ఈ నాటకంలో సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉండడం సంతోషం. వారికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తాం. - కె.భాస్కరరావు, గోవాడ సుగర్స్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు. విజయవంతమయింది ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా కేవలం నాటికల పోటీలనే ఏర్పాటు చేశాం. అయితే మొదటి ప్రదర్శనగా చేసిన కన్యాశుల్కం నాటకంతో వార్షికోత్సవం విజయవంతం అయినట్లయ్యింది. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులే దీనికి నిదర్శనం. - వి. రామకృష్ణ, ఆలయ ధర్మకర్త. వెంకన్నపాలెం.