ప్రైవేటీకరణ దిశగా గోవాడ!
- అధికార పార్టీ ఎంపీ కన్ను?
- చెరకు రైతుల్లో ఆందోళన
- సుగర్‌స మహాజనసభ నేడు
సహకార రంగంలో దేశంలోనే అత్యుత్తమ చెరకు ఫ్యాక్టరీల్లో ఒకటైన గోవాడ సుగర్స్ ప్రైవేటీకరణ వైపు పయనిస్తోందా? టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందా? ప్రస్తుత పరిణామాలు ఈ ప్రశ్నలకు తావిస్తున్నాయి. రైతు, ప్రభుత్వ భాగస్వామ్యంతో చెరకు రైతులకు అండగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను తెగనమ్మే పనిలో ప్రభుత్వం పడినట్టు తెలుస్తోంది.
చోడవరం: రాష్ట్రంలో 10 సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా వాటిలో రెండు ఇప్పటికే మూతబడ్డాయి. మిగతా ఎనిమిదింటిలో చో డవరం (గోవాడ) లాభాల్లో ఉండగా ఏటికొప్పాక ఫ్యాక్టరీ లాభనష్టాలు లేకుండా నడుస్తోంది. ఆరు ఫ్యాక్టరీలు ప్రభుత్వంపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఏటా కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ కన్నేసినట్టు తెలిసింది.
గోవాడతోపాటు మిగతా ఫ్యాక్టరీలను కూడా కొనుగోలుకు ఆ పార్టీకి చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు, విశాఖ డెయిరీ చైర్మన్ కూడా కాచుకు కూర్చున్నట్టు సమాచారం. వీరి ఒత్తిళ్ల మేర కే ప్రభుత్వం చెరకు పరిశ్రమలపై వేసిన అధ్యయన కమిటీలో వ్యూహాత్మకంగా ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీల యజమానులను నియమించిందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి అధికారులు, మంత్రులు, పరిశ్రమ, వ్యవసాయ నిపుణులతో అధ్యయన కమిటీ వేయాలి.
అధ్యయన కమిటీలో కీలక వ్యక్తిగా ఉన్న సుధాకరచౌదరి గతంలో గోవాడ సుగర్స్ ఎండీగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలను నిర్వహిస్తున్నారు. గోవాడ ఫ్యాక్టరీని ఎంపీ సుజనా చౌదరికి కట్టబెట్టేందుకే సుధాకరచౌదరిని కమిటీలో వేశారన్న ప్రచారం సాగుతోంది. సుధాకర చౌదరి గోవాడ ఫ్యాక్టరీ ముఖ్య సలహాదారునిగా నియమించేందుకు ఇటీవల ముమ్మర యత్నాలు చేశారని చెబుతున్నారు. ఫ్యాక్టరీల అధ్యయనం పేరుతో నష్టాలు చూపించి, ఆశిస్తున్న నాయకులకు లీజు పేరుతో దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలోనే 24 వేల మంది సభ్య రైతులున్న అతిపెద్ద ఫ్యాక్టరీ అయిన గోవాడపై లక్షన్నర కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నాయి. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వారు లాభాలు పొంది మిల్లును మూసేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. తాజాగా విజయనగరం జిల్లాలో కోట్లాది రూపాయలు రైతులకు గిట్టుబాటు ధర బకాయిలు ఇవ్వకుండా ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ మూసేసి వెళ్లిపోవడంతో ఇప్పుడు అక్కడ రైతులు అప్పులు పాలైపోయి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు, సీఎం చంద్రబాబు తీరుపై ఇక్కడ టీడీపీ నాయకులు కూడా అయోమయంలో పడ్డారు.
గోవాడ ఫ్యాక్టరీ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే రాజు, సభ్యుడుగా ఉన్న మంత్రి అయ్యన్నపాత్రుడు టీడీపీకి చెందిన వారే. ప్రైవేటీకరణ జరిగితే రైతులు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉన్నందున తమ రాజకీయ భవిష్యత్‌పై వారు ఆందోళన చెందుతున్నట్టు కొందరు టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం జరిగే ఈ ఫ్యాక్టరీ మహాజనసభలో సభ్యుల నిర్ణయం ఎలా ఉంటోదనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.