నా చావుకు కారణం హౌస్ ఓనర్స్
అద్దె ఇంటి యజమానుల వేధింపులతోవివాహిత ఆత్మహత్య
- పిల్లలు అల్లరి చేస్తున్నారని ఐదు నెలల నుంచి గొడవలు, బెదిరింపులు
- మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఇల్లాలు
- తన చావుకు ఇంటి యజమానులే కారణమని గోడపై సూసైడ్‌నోట్
- పరారీలో యజమాని.. పోలీసుల అదుపులో యజమాని భార్య
- కూకట్పల్లి శ్రీనివాసకాలనీలో ఘటన
హైదరాబాద్: అద్దెకున్న ఇంట్లో తన పిల్లలు అల్లరి చేయడమే ఆమె పాలిట శాపంగా మారింది. పిల్లలు ఆడుకున్నా.. చివరికి ఇంట్లో కుర్చి కదిపినా ఇంటి యజమానులు బెదిరింపులు, వేధింపులకు పాల్పడటంతో ఆమె ఉక్కిరిబిక్కిరైంది. ఐదు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇల్లాలు చివరికి బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు ఇంటి యజమానులు ప్రసన్నకుమార్‌రెడ్డి, స్నేహలతలే కారణమని ఇంటి గోడలు, తలుపులపై రాసి వివాహిత సుజాత (28) ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కూకట్‌పల్లిలో ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గోనుగొంట్ల రామకృష్ణ, సుజాత దంపతులు రెండున్నరేళ్లుగా కూకట్పల్లి శ్రీనివాస కాలనీ మెడికల్ సొసైటీలోని ప్లాట్ నం28/బీలో నివాసం ఉంటున్నారు. మాదాపూర్‌లోని ఐవీవైటు కంపాక్ట్లో రామకృష్ణ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, సుజాత ఇంటి వద్దనే ఉంటోంది. వీరికి కుమారుడు రిషి(3), కూతురు అమిత్యసారుు(ఏడాదిన్నర) పిల్లలు ఉన్నారు. అరుుతే పిల్లలిద్దరు అల్లరి చేస్తుండటంతో శబ్ధం వస్తోందని, ఇంటిపైన ఆరబెట్టిన బట్టల నీరు కిందకు వస్తోందని తరచూ ఇంటి యజమానులు వీరితో గొడవపడేవారు. ఐదు నెలల నుంచి ఇల్లు ఖాళీ చేయమని వేధింపులకు దిగారు. అరుుతే సుజాత భర్త రామకృష్ణ బంధువుల పెళ్లి ఉండటంతో శుక్రవారం సాయంత్రం పాలకొల్లు వెళ్లాడు.
కుర్చీలు జరిపారని గొడవకు దిగారు..
కాగా, ఆదివారం సాయంత్రం ఇంట్లో పిల్లలు కుర్చీలు జరపడంతో శబ్ధం వచ్చిందంటూ ఇంటి యజమానులు స్నేహలత, ప్రసన్నకుమార్ సుజాతతో గొడవకు దిగి.. ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రామకృష్ణ తమ్ముడు నరేష్ వారిని వారించాడు. దీంతో రామకృష్ణకు ప్రసన్నకుమార్ ఫోన్ చేసి తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలని చెప్పాడు. తాను ఊరు వెళ్లానని వచ్చాక ఇల్లు ఖాళీ చేస్తానని, ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలి తప్ప ఇంట్లో ఉన్న తన భార్యతో గొడవ పడవద్దని కోరాడు. గొడవ సద్దుమణిగాక నరేష్వెళ్లిపోవటంతో సుజాత పిల్లలతో ఇంట్లోనే నిద్రించింది.
ఇంటి యజమానుల వేధింపులతో మనస్తాపం చెందిన సుజాత ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి వెళ్లిన భర్త గొడవ విషయం తెలిసి.. ఆదివారం రాత్రే పాలకొల్లులో బయలుదేరి.. సోమవారం తెల్లవారుజామున నాలుగున్నరకు కూకట్పల్లి చేరుకున్నాడు. ఆ సమయంలో భార్యకు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోకపోవటంతో సమీపంలోని సోదరుని ఇంటికి వెళ్లాడు. తిరిగి ఉదయం 6.30 గంటలకు వచ్చి మళ్లీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి యజమానిని నిలదీశాడు. ఆ తర్వాత కార్పెంటర్ సహాయంతో వంట గది గడియ తీరుుంచి ఇంట్లోకి వెళ్లాడు. బెడ్రూం తలుపు కొట్టగా కుమారుడు గడియ తీసి నాన్నా.. అమ్మ నిద్రపోరుుంది. లేవడం లేదంటూ ఏడుస్తూ చెప్పాడు.
గదిలోకి వెళ్లి చూడగా సుజాత ఆత్మహత్య చేసుకుని కనిపించింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంటి యజమానురాలు స్నేహలతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె భర్త ప్రసన్న కుమార్ పరారీలో ఉన్నాడు. సుజాత మృతికి కారకులైన వారిని శిక్షించాలని ఆమె భర్త రామకృష్ణతో పాటు బంధువులు డిమాండ్ చేశారు. చీటికిమాటికి ఇంటి యజమానులు మాటలతో వేధించటంతో తీవ్ర మనస్తాపానికి గురై సుజాత ఆత్మహత్యకు చేసుకుందని ఆరోపించారు.