sujatha nagar
-
మోదీ, కేసీఆర్ డ్రామాలను తిప్పికొట్టాలి : బృందాకారత్
సాక్షి, సుజాతనగర్: మోదీ, కేసీఆర్‌ల తెరవెనుక డ్రామాలను చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇద్దరు తిట్టుకోవడం, ఢిల్లీలో ఇద్దరు కలిసుండే విషయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. సీపీఎం బలపరిచిన బీఎల్ఎఫ్ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ మండల కేంద్రం సుజాతనగర్లో ఆదివారం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ మాటల గారడీ చేసే వాళ్లేనని అన్నారు. వారిద్దరినీ గద్దెదించాలని చెప్పారు. అధికారం, సొంత ప్రయోజనాల కోసమే ప్రజాకూటమి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్‌షాల కళ్లజోళ్లకు పేదప్రజలు కనబడటం లేదా అని ఆమె ప్రశ్నించారు. మోదీకి చిన్న తమ్ముడిలా ఉన్న కేసీఆర్ ఢిల్లీలో తన స్నేహితులను ప్రసన్నం చేసేందుకే ఎనిమిది నెలలు ముందుగానే ఎన్నికలకు పోయారన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను గుప్పించిన కేసీఆర్ వాటిని తుంగలో తొక్కారని, మళ్లీ అధికారదాహంతో ముందుకు వస్తున్నారన్నారు. బీజేపి, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టి, రైతు నాగలి గుర్తుకు వేసి ఎడవల్లి కృష్ణను గెలిపించాలని కోరారు. బీఎల్ఎఫ్ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే బీఎల్ఎఫ్ ప్రకటించిన మేనిఫోస్టోను నూరు శాతం అమలు చేస్తామని అన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యుడు కున్సోత్ ధర్మా, అన్నవరపు సత్యనారాయణ, మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత, కొత్తగూడెం, చండ్రుగొండ, సుజాతనగర్ మండలాల కార్యదర్శులు భూక్యా రమేష్, యాసా నరేష్, ఎంపీటీసీలు శ్రీలక్ష్మి, కుమారి మండల కార్యదర్శి వీర్ల రమేష్, బీఎల్ఎఫ్ నాయకులు తాళ్ళూరి శ్రీనివాసరావు, పెద్దమళ్ల నాగేశ్వరరావు, గురజాల సీతయ్య, లావుడ్యా సత్యనారాయణ, నర్రా శివరామకృష్ణ, అలవాల కార్తీక్, , కాట్రాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ధన రాజకీయాలను నిరోధించాలి చుంచుపల్లి(కొత్తగూడెం): దేశంలో డబ్బుతో కూడిన రాజకీయాలు ఇటీవల బాగా పెరిగిపోయాయని, వాటిని నిరోధించడంలో ఎన్నికల సంఘం ముందుకు రావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు.ఆదివారం ఆమె కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాsడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేల ఎకరాల భూములను సేకరిస్తూ రైతులకు అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి కుర్చీ కోసం పోరాటం చేస్తోందని విమర్శించారు. మరిన్ని వార్తాలు... -
కందకంలో పడి బాలుని మృతి
సుజాతనగర్ : అటవీ ప్రాంతంలోని కందకంలో ప్రమాదవశాత్తు పడిపోయిన బాలుడు ప్రాణాలొదిలాడు. సుజాతనగర్ మండలం గరీబ్‌పేట పంచాయతీ లక్ష్మీపురంతండాకు చెందిన లక్ష్మణ్, శాంత దంపతుల పెద్ద కుమారుడు భానుప్రసాద్(12), రుద్రంపూర్ జిల్లాపరిషత్ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. కటింగ్ సరిగ్గా చేయంచుకోకపోవడంతో ఈ నెల 30న అతడిని హెచ్ఎం హెచ్చరించారు. మరుసటి రోజున తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పారు. ఆ బాలుడు, మంగళవారం తన తల్లిని తీసుకుని పాఠశాలకు వెళ్లాడు. కటింగ్ బాగా లేదని, సరిచేసి పంపించాలని బాలుడి తల్లితో ఉపాధ్యాయులు చెప్పారు. కుమారుడిని ఆ తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అతడిని ఇంటి వద్దనే ఉంచి పొలం పనులకు వెళ్లింది. తన స్నేహితులతో కలిసి అటవీ ప్రాంతం మీదుగా పొలానికి బయల్దేరిన భానుప్రసాద్, మార్గమధ్యలోగల కందకంలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్నేహితులు పరుగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చి చెప్పారు. గ్రామస్తులు వెళ్లేసరికి భానుప్రసాద్ మృతిచెందాడు. తల్లిదండ్రులు, కుటుంబీకులు భోరున విలపించారు. -
దసరా నుంచి రూ.వెయ్యి పింఛన్
కొత్తగూడెం:దసరా నుంచి వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులు, వితంతువులకు రూ.1500 పెన్షన్ మంజూరు చేయనున్నట్లు డెప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు. ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మండలాల్లో ఆయన శనివారం విస్తృతంగా పర్యటించారు. సుజాతనగర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో తెలంగాణ రైతులను సీమాంధ్ర ప్రభుత్వం మోసం చేసిందని, నీలం తుఫాన్‌తోపాటు అనేక తుఫాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. సీమాంధ్రులకు నష్టపరిహారం ఇచ్చిన నాటి సర్కారు తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిందన్నారు. రైతులను ఆదుకునే ఉద్దేశ్యంతో రూ.406 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఆదుకుంటే 85 శాతం తెలంగాణ అభివృద్ధి చెందినట్టేనని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసిందన్నారు. దీనికి తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారన్నారు. ప్రతి పీహెచ్‌సీని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తాను వైద్యుడిగా పనిచేసే సమయంలో రోజుకు 250 మంది రోగులను పరీక్షించేవాన్నని తెలిపారు. ఇప్పుడు ఏ పీహెచ్‌సీకి వెళ్లినా కేవలం 10 నుంచి 16 మంది ఔట్‌పేషెంట్ లిస్టును మాత్రమే చూపిస్తున్నారన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఆస్పత్రిలో సేవలందించాలని, ఎవరైనా ఆ సమయంలో లేకపోతే వెంటనే ఆ పరిధిలోని తహశీల్దార్లు, కలెక్టర్లకు ఈ విషయంపై ఫిర్యాదు చేయాలన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా తెలంగాణ ఇంక్రిమెంట్‌ను అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్షం తప్పుడు విమర్శలకు దిగుతుందన్నారు. పోలవరం అర్డినెన్స్‌పై చంద్రబాబు ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ముంపు మండలాలను తెలంగాణలో ఉంచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సభలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డెరైక్టర్ డాక్టర్ సాంబశివరావు, పాల్వంచ ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ అశోకచక్రవర్తి పాల్గొన్నారు.