కొత్తగూడెం:దసరా నుంచి వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులు, వితంతువులకు రూ.1500 పెన్షన్ మంజూరు చేయనున్నట్లు డెప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు. ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మండలాల్లో ఆయన శనివారం విస్తృతంగా పర్యటించారు.
సుజాతనగర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో తెలంగాణ రైతులను సీమాంధ్ర ప్రభుత్వం మోసం చేసిందని, నీలం తుఫాన్‌తోపాటు అనేక తుఫాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. సీమాంధ్రులకు నష్టపరిహారం ఇచ్చిన నాటి సర్కారు తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిందన్నారు. రైతులను ఆదుకునే ఉద్దేశ్యంతో రూ.406 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసినట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఆదుకుంటే 85 శాతం తెలంగాణ అభివృద్ధి చెందినట్టేనని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసిందన్నారు. దీనికి తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారన్నారు. ప్రతి పీహెచ్‌సీని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తాను వైద్యుడిగా పనిచేసే సమయంలో రోజుకు 250 మంది రోగులను పరీక్షించేవాన్నని తెలిపారు. ఇప్పుడు ఏ పీహెచ్‌సీకి వెళ్లినా కేవలం 10 నుంచి 16 మంది ఔట్‌పేషెంట్ లిస్టును మాత్రమే చూపిస్తున్నారన్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఆస్పత్రిలో సేవలందించాలని, ఎవరైనా ఆ సమయంలో లేకపోతే వెంటనే ఆ పరిధిలోని తహశీల్దార్లు, కలెక్టర్లకు ఈ విషయంపై ఫిర్యాదు చేయాలన్నారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా తెలంగాణ ఇంక్రిమెంట్‌ను అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్షం తప్పుడు విమర్శలకు దిగుతుందన్నారు.
పోలవరం అర్డినెన్స్‌పై చంద్రబాబు ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ముంపు మండలాలను తెలంగాణలో ఉంచేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సభలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ డెరైక్టర్ డాక్టర్ సాంబశివరావు, పాల్వంచ ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ అశోకచక్రవర్తి పాల్గొన్నారు.
దసరా నుంచి రూ.వెయ్యి పింఛన్
Published Sun, Aug 24 2014 2:25 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement