సారూ..ఆస్పత్రిలో అంతా అధ్వానం
డబ్బులు లేక ధర్మాసుపత్రికి వస్తే అన్నిచోట్లా డబ్బులు అడుగుతున్నారు. పరీక్షలన్నీ బయటికి రాస్తున్నారు. కనీసం మంచినీళ్లు దొరకడం లేదు. నల్లాలు పనిచేయడం లేదు. మరుగుదొడ్లు శుభ్రం చేయడం లేదు. ఆస్పత్రి అంతా అధ్వానంగా తయారైంది.
- భువనగిరి ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యకు రోగుల ఫిర్యాదు
భువనగిరి :‘‘చిన్న చిన్న సమస్యలకు కూడా వైద్యం అందించడం లేదు. వెంటనే నీలపురి దవాఖానాకు పంపుతున్నారు. మంచినీళ్లుకూడా లేవు. డబ్బులు లేనిదే వైద్యం చేయడం లేదు.. సారూ ఆస్పత్రి అంతా అధ్వానంగా తయారైంది’’ అంటూ భువనగిరి ఏరియా ఆస్పత్రిలోని రోగులు, వారి బంధువులు డిప్యూటీ సీఎం రాజయ్యకు మొరపెట్టుకున్నారు. శుక్రవారం భువనగిరి ఏరియా ఆస్పత్రిని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి రాష్ర్ట ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖమంత్రి తాటికొండ రాజయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రి ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఎమర్జెన్సీ, సాధారణ రోగులు, చిన్నపిల్లలు, మహిళల వార్డులను తనిఖీ చేశారు. ఆపరేషన్ థియేటర్, డయాగ్నస్టిక్ సెంటర్, రక్తనిధి కేంద్రం, రోగులకు ఇచ్చే భోజనాన్ని పరిశీలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వడాయిగూడానికి చెందిన హేమలత అనే రోగిని వైద్యం అం దుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. కేస్‌షీట్‌ను తెప్పించి రోగనిర్ధారణతో పాటు ఇస్తున్న మందుల వివరాలను పరిశీలించి మరిన్ని సూచనలను వైద్యులకు చేశారు. అనంతరం రోగుల కోసం తీసుకువస్తున్న ఆహారపదార్థాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్ గురించి వాకబుచేశారు.
ఆయన ఆందుబాటులో లేడని వైద్యులు చెప్పా రు. ల్యాబ్‌ను పరిశీలించి ఏయే పరీక్షలు చేస్తున్నారని టెక్నీషియన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్న పిల్లలవార్డును తనిఖీ చేశారు. రాత్రివేళ కరెంటు ఉండడం లేదని, జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో రాత్రిళ్లు దోమల బెడద, దొంగల భయం అధికంగా ఉందన్నారు. ఇలా ఎక్కడికి వెళ్లినా మంత్రికి సమస్యలు స్వా గతం పలికాయి. ప్రధానంగా డబ్బులు లేనిదే వైద్యం చేయడం లేదని, కొన్ని మాత్రలు ఇచ్చి మరికొన్ని బయట తెచ్చుకోమంటున్నారని చెప్పారు.
అన్నిరకాల పరీక్షలు చేయకుండా బయటకు రాస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మె ల్యే శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ, ఆస్పత్రి సూపరింటెండెంట్, అర్‌ఎంతో కలిసి ఉపు ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్షసమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతను వివరించారు. ఆస్పత్రిలో ప్రజల నుం చి వచ్చిన ఫిర్యాదులపై మంత్రి సూపరింటెంండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆస్పత్రి పనితీరు మెరుగు పడాలని ఆదేశించారు. కాగా ఉప ముఖ్యమంత్రి రాక సందర్భంగా భువనగిరి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్, రూరల్ సీఐ జె.నరేందర్‌గౌడ్, ఎస్‌ఐ మోతీలాల్ ఆధ్వర్యంలో పోలీస్‌లు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తాం
భువనగిరి : భువనగిరి ఏరియా ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన భువనగిరి ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం భువనగిరి ఆస్పత్రిలో ఆర్‌ఎంఓ, రెండు సివిల్ సర్జన్, ఒక ఫిజిషియన్, ఆర్థోపెడిక్ డాక్టర్ల కొరత ఉందని, దీనిని త్వరలో తీరుస్తామన్నారు. డాక్టర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విధుల్లో కచ్చితంగా ఉండాలన్నారు.
ఎవరైనా డ్యూటీ సమయంలో ప్రైవేట్ వైద్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘మన ఆస్పత్రి-మన ప్రణాళిక’తో వైద్యులు వచ్చే ఐదేళ్ల కాలానికి ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. ఆస్పత్రిలో కుక్కకాటు, పాముకాటుకు మందులివ్వాలన్నారు. పేషంట్లకు 5 నుంచి 7 రోజుల వరకు అన్ని మందులు ఇవ్వాలన్నారు. మందులు తక్కువ ఉంటే ఆస్పత్రికి చెందిన 10 శాతం నిధులతో వాటిని కొనుగోలు చేసి ఇవ్వాలే కానీ బయటకు చీటీలు రాయవద్దన్నారు. మంచినీరు, మురికి కాలువల సమస్య, బెడ్‌లు, వాటర్ లీకేజీలు, పిల్లోలు, బెడ్ షీట్‌ల వంటి మౌలిక సదుపాయాల కోసం 48 గంటల్లో నివేదిక తయారు చేసి తనకు పంపించాలన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అవసరమైన నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు.