ఆ లక్షణం కనిపించగానే..
డాక్టర్స్ కాలమ్
గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకనేది నానుడి. చాలారకాల జబ్బుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. బిజీలైఫ్‌లో కొట్టుమిట్టాడుతున్న నగరవాసులు ప్రాణం మీదికి వచ్చే వరకూ చాలా జబ్బులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగంలో అలసట, పర్సనల్ లైఫ్‌లో చికాకులు ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా చేస్తున్నాయి. కానీ కొన్ని జబ్బుల లక్షణాలు సాదాసీదాగా ఉండొచ్చు. కానీ అవి ముదిరితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
కణితులు ( ట్యూమర్స్) ఈ కోవలోకే వస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందే. చాలామంది తలనొప్పే కదా అని ఓ మాత్ర వేసుకుని అప్పటికప్పుడు రిలాక్స్ అవుతారు. ఇలా తరచూ వచ్చే తలనొప్పి వెనుక ట్యూమర్లు ఉండే ప్రమాదం లేకపోలేదని అంటారు కిమ్స్‌లో సీనియర్ న్యూరో సర్జన్ డా॥కుమార్. తరచూ తలనొప్పి, ఫిట్స్ రావడటం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలు తలెత్తితే.. న్యూరో సర్జన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. లేదంటే కేన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా శరీరం బయట కనిపించేవే ట్యూమర్లు కావు. ఇవి మెదడులోనూ ఏర్పడవచ్చని తగిన జాగ్రత్తలు తప్పనిసరని ఆయన సూచిస్తున్నారు.
లక్షణాలు..
తరచూ విపరీతమైన తలనొప్పి రావొచ్చు.
ఎక్కువగా ఫిట్స్ వస్తున్న వారిలోనూ ట్యూమర్స్ రావొచ్చు
అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోవడాన్ని ప్రమాదంగా పరిగణించాలి
నోరు వంకర పోవడానికి ఒక్కోసారి ట్యూమర్లు కారణం కావచ్చు.
ఏదైనా ఆహారం మింగడానికి ఇబ్బందిగా ఉండటం లక్షణంగా భావించవచ్చు
ఉన్నట్టుండి చూపులో తేడా రావడమూ ఒక లక్షణమే
నిర్లక్ష్యం వద్దు..
ఎలాంటి ట్యూమర్లనైనా ప్రాథమిక దశలోనే కనిపెట్టే అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
ట్యూమర్లలో అనప్లాసియాకు చెందినవైతే వేగంగా పెరుగుతూంటాయి. అదే బినైన్ ట్యూమర్లతో అంత పెద్ద సమస్య రాదు.
సీటీస్కాన్, ఎంఆర్ఐ, న్యూరో నేవిగేషన్ వంటి పరీక్షలతో ట్యూమర్లను కనిపెట్టవచ్చు.
ఎలాంటి ట్యూమర్నైనా ప్రాథమిక దశలోనే కనిపెడితే.. కేన్సర్‌ను నియంత్రించవచ్చు.
ట్యూమర్లు రావడానికి వయసుతో పెద్దగా పనిలేదు. ఏ వయసులోని వారికైనా రావొచ్చు.
డా॥సుజిత్‌కుమార్
విడియాల
సీనియర్ న్యూరోసర్జన్
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
ప్రెజెంటర్: జి.రామచంద్రారెడ్డి