పెళ్లి కాని తల్లిదండ్రులకు.. పిల్లలు పెళ్లి
టీకంఘడ్: ప్రేమ గొప్పది. ఎంతంటే చెప్పలేనంత. అవును. ప్రేమ మొగ్గతొడిగిన నాటి నుంచి కాపాడుకుంటూ పోతే అది మాను అవుతుంది. అప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు. అడ్డుకోలేరు కూడా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్‌లో జరిగిన ఓ ప్రేమ జంట కథ పైన ఉన్న పదాలకు కచ్చితంగా సరిపోతుంది. 40 ఏళ్ల క్రితం అంటే 1970వ దశకంలో.. సుఖే కుష్వాహా తన పక్క గ్రామానికి చెందిన హరియాభాయ్ని ప్రేమించాడు.
ఈ విషయాన్ని హరియాతో చెప్పగా ఆమె కూడా సుఖేను ఇష్టపడుతున్నట్లు చెప్పింది. అలా మొదలైన ఇరువురి ప్రేమ కథ కొన్నాళ్లు సజావుగానే సాగింది. ఆ కాలంలో కట్టుబాట్ల గురించి మనందరికీ తెలిసిందే. ఒకరోజు సుఖే, హరియాతో సాన్నిహిత్యంగా మెలగడం చూసిన సుఖే బంధువులు ఇద్దరి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో సుఖే, హరియాతో పాటు ఆమె స్వగ్రామం సేతపూర్కు వెళ్లిపోయాడు.
అక్కడ కూడా ఇరువురి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో సహజీవనం చేస్తూ ఒకే ఇంట్లో నివసించడం ప్రారంభించారు. అలా కొద్ది కాలానికి హరియా, సుఖేలకు కొడుకు, కూతురు జన్మించారు. ప్రస్తుతం వారి పిల్లలకు కూడా పిల్లలు పుట్టారు. అంటే సుఖే(81), హరియా(76)లు పెళ్లి చేసుకోకుండానే తాతయ్య, నానమ్మలు అయ్యారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంటకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది.
అదే విషయాన్ని బిడ్డలతో పంచుకోగా.. వారు ఇరువురికి హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం జరిపించారు. 'జీవితంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశాం. బిడ్డలను ప్రాణంగా పెంచుకున్నాం. అయితే, ఇరువురం పెళ్లి చేసుకోలేదనే చిన్న బాధ మాత్రం ఉండేది. అది ఇవాళ ఇలా తీరింది. బిడ్డల చేతులపై పెళ్లి చేయించుకునే అదృష్టం ఎంత మందికి దక్కుతుంది' అని సుఖే అన్నారు.