ఉమ్మడిగా ‘ఉగ్ర’ పోరాటం
బిమ్స్టెక్ సదస్సులో తీర్మానం
అందరికీ ఒకేరకం సవాళ్లు: మన్మోహన్
నేప్యీదే: ఉగ్రవాదం, సీమాంతర నేరాలు, మాదకద్రవ్యాల రవాణాపై సమష్టిగా పోరాడాలని బిమ్స్టెక్ దేశాలు తీర్మానించాయి. వాణిజ్యం, ఎనర్జీ, వాతావరణ విషయాల్లో అనుసంధానానికి, సహకారానికి అంగీకరించాయి. మంగళవారం మయన్మార్ రాజధాని నేప్యీదేలో ముగిసిన 3వ బిమ్స్టెక్ (బహుళ రంగాల్లో సాంకేతిక, ఆర్థిక సహకారానికి బంగాళాఖాత తీర దేశాల ప్రయత్నం) సదస్సులో ఈ మేరకు ఏడుగురు దేశాధినేతలు ప్రకటన చేశారు. మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. దానిలో ఒకటి ఢాకాలో బిమ్స్టెక్కు స్థిరమైన సచివాలయ నిర్మాణం, రెండోది వాతావరణానికి సంబంధించి ఒక కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయడం, మూడోది ఈ దేశాల కల్చరల్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏర్పాటు. శ్రీలంకకు చెందిన సుమిత్ నకందల బిమ్స్టెక్ తొలి సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు.
అంతకుముందు సదస్సులో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. బంగాళాఖాత తీర దేశాల్లో టైజం విజృంభించే అవకాశం ఉందని, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేశాల మధ్య సహకారం అవసరమన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి టైజం వరకూ ఈ దేశాలు ఏక రీతిలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యం, భద్రత, అభివృద్ధి సాధించాలంటే అంతా కలసి పనిచేయాలని ఉద్బోధించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో సమావేశమైన మన్మోహన్.. భారత జాలర్లలను మానవతా దృక్పథంతో చూడాలని కోరారు. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రజాస్వామ్య పోరాటానికి ప్రతీక అంగ్‌సాన్ సూచీని మన్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మయన్మార్ పర్యటన ముగించుకుని మన్మోహన్ మంగళవారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు.