'చంద్రబాబు చూపు రాక్షసచూపు'
పోలాకి: ప్రశాంతంగా వున్న శ్రీకాకుళం జిల్లాలో ఊళ్లులేపేసి ఉద్యోగాలు ఇస్తారా..? అంటూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలాకి మండలంలో జపాన్ కంపెనీ సుమితోమో సౌజన్యంతో రాష్ట్రప్రభుత్వం నిర్మించ తలపెట్టిన థర్మల్పవర్ప్లాంట్ ప్రతిపాదిత ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు.
చంద్రబాబు చూపు రాక్షసచూపనీ, శ్రీకాకుళం జిల్లాపై అది పడిందని విరుచుకుపడ్డారు. తోటాడ, సన్యాసిరాజుపేట, ఓదిపాడు, గవరంపేట తదితర గ్రామాల్లో పర్యటించి అక్కడిప్రజలతో మాట్లాడారు. గతంలో జరిగిన సోం పేట, కాకరాపల్లి వంటి ఘటనలు పునరావృతం కాకముందే ప్రభుత్వం ఇక్కడి థర్మల్ ప్రతిపాదన విరమించుకోవాలని సూచించారు. అనంతరం అక్కడ గొర్రెలకాపరితో కాసేపు మాట్లాడి సరదాగా గొర్రెలు కాపుకాశారు. ఆయన వెంట సీపీఐ నాయకులు చాపర సుందరలాల్, ఒడిశాకు చెందిన మాజీఎమ్మెల్యే నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆ జీవో ఎందుకు రద్దుచేయరు?
సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్ పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేస్తూ జీవో విడుదల చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు తాత్సారం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ ప్రశ్నించారు. సోంపేట బీల ప్రాంతంలో థర్మల్ పవర్ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసు తూటాలకు బలైపోయిన ముగ్గురు అమరవీరులకు నివాళులర్పిస్తూ మంగళవారం సోంపేట పట్టణంలో భారీ సభ నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలసి పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నా అనుమతులు రద్దు చేస్తూ జీవో జారీచేయకపోవడాన్ని తప్పుపట్టారు. ఉద్యమం ఎప్పటికైనా బలహీన పడదా, మరలా ఆ ప్రాంతంలో కర్మాగారాలు స్థాపించడానికి అవకాశం దొరకదా అనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.
సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం 1107 జీవో రద్దు చేయకుండా మరలా ఆనాటి కాల్పుల సంఘటనకు సంబంధించి 720 మంది పై కేసులు పెట్టడానికి సిద్ధం కావడం చూస్తుంటే పరిస్థితి ఎలాఉందో అర్థం అవుతోందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యద ర్శి పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ 1107 జీవో రద్దు అయ్యేంతవరకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బి.అశోక్ బాబు, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, కిసాన్ మోర్చారాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ కృష్ణమూర్తి, మడ్డు రాజారావు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.