జల గండం..!
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగరంలో తిరిగి నీటికోతలు మొదలయ్యాయి. వేసవి కాలంలో నగరంలో రోజువిడిచి రోజు నీటి సరఫరా ఉండేది. కాగా, ఇటీవల భారీగా వర్షాలు పడటంతో జలాశయాలకు నీరు చేరడంతో కార్పొరేషన్‌కు నీటికోతలు ఎత్తివేశారు. అయితే రెండు రోజులుగా వర్షం ముఖం చాటేయడంతో ముందుజాగ్రత్త చర్యలు తిరిగి నీటి కోతలు మొదలుపెట్టారు. దీంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఖడక్ వాస్లా జలాశయంలో ప్రస్తుతం కేవలం 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కొన్ని రోజులుగా భారీవర్షాలు నమోదు కావడంతో నగరవాసులకు తాత్కాలికంగా నీటికోతలు ఎత్తివేసి ప్రతిరోజూ నీటిని సరఫరా చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. కాగా, వానలు తిరిగి తగ్గుముఖం పట్టడంతో జలాశయంలో నీటినిల్వలో పెరుగుదల పడిపోయింది. గోరుచుట్టుపై రోకలి పోటు అన్నట్లు.. ఇప్పుడు ఖడక్ వాస్లా జలాశయంలో అందుబాటులో ఉన్న నీటిని కార్పొరేషన్‌తోపాటు దౌండ్, ఇందాపూర్ మున్సిపాలిటీలతో పాటు మరో 13 గ్రామాలకు కూడా సరఫరా చేయాలని సీఎం ృపథ్వీరాజ్ చవాన్ ఆజ్ఞాపించిన సంగతి తెలిసిందే.
దీంతో కార్పొరేషన్ అధికారులు తలపట్టుకున్నారు. దీంతో నగరానికి మళ్లీ రోజు తప్పించి రోజు నీటిని సరఫరా చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులకు ప్రతిరోజూ 1150 ఎల్‌ఎండీల నీరు అవసరమవుతోంది. అంటే ప్రతి నెలా 1.2 టీఎంసీలు నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు జలాశయంలో ఉన్న నీటి నిల్వలు నగరానికి మాత్రమే సరఫరా చేస్తే 7 నెలల వరకు ఇబ్బంది ఉండదు. అయితే ఇదే జలాశయం నుంచి 1.5 టీఎంసీల నీటిని మరో రెండు మున్సిపాలిటీలకు, 13 గ్రామాలకు కూడా సరఫరా చేయాల్సి రావడంతో నిల్వలు కేవలం ఐదున్నర నెలలు మాత్రమే సరిపోతాయని అధికారులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో మున్ముందు ఎదురవ్వబోయే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మళ్లీ రోజు విడిచి రోజు నీటిని విడుదల చేసేందుకు యోచిస్తున్నారు. అయితే అధికారుల తీరుపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నగరం నీటిసమస్యతో ఇబ్బందిపడుతుంటే జలాశయం నుంచి వేరే మున్సిపాలిటీలకు, గ్రామాలకు నీటిని సరఫరా చేయమని సీఎం చెప్పడం రాజకీయలబ్ధి కోసమేనని వారు ఆరోపిస్తున్నారు.