సుందర్ పిచాయ్ కి గూగుల్ బహుమతి
♦ 199 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు జారీ
♦ పిచాయ్ మొత్తం వాటా విలువ రూ.4,500 కోట్లపైనే
న్యూయార్క్: గూగుల్ సెర్చింజన్ సహా పలు కీలక విభాగాలకు సీఈఓగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్‌కి కంపెనీ 199 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కేటాయించింది. అమెరికా చరిత్రలో ఒక లిస్టెడ్ కంపెనీ తన ఉద్యోగికి ఈ స్థాయిలో షేర్లు కేటాయించటం ఇదే తొలిసారి. గతేడాది గూగుల్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కంపెనీని వివిధ విభాగాలుగా విడదీసి ‘ఆల్ఫాబెట్’ పేరిట మాతృ సంస్థను ఏర్పాటు చేశారు. సెర్చింజన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, యూట్యూబ్ వంటి కీలక విభాగాలకు మాత్రం సుందర్‌ను సీఈఓగా నియమించారు. తాజాగా ఆయనకు 2,73,328 క్లాస్ ‘సి’ షేర్లను కేటాయించినట్లు మంగళవారంనాడు కంపెనీ అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్‌కు తెలియజేసింది. గతంలోనూ పిచాయ్‌కి కంపెనీ షేర్లు కేటాయించగా ప్రస్తుతం వాటి విలువ 250 మిలియన్ డాలర్లకు చేరింది. దానికిముందు పిచాయ్‌కి ఉన్న షేర్లు... తాజాగా కేటాయించినవి కలిపితే వాటి మొత్తం విలువ 650 మిలియన్ డాలర్లు... మన కరెన్సీలో దాదాపు 4,500 కోట్ల రూపాయలవుతుంది.
వ్యవస్థాపకుడు కాకున్నా...
నిజానికి కంపెనీ షేరు పెరిగితే దాని వ్యవస్థాపకుల సంపదే అత్యధికంగా పెరుగుతుంది. తాజా కేటాయింపులతో వ్యవస్థాపకుడు కాకున్నా అత్యంత ధనవంతులైన వారి జాబితాలో పిచాయ్ స్థానం సంపాదించుకున్నారు. అమెరికాలో 2015లో అత్యధిక వేతనం అందుకున్న రికార్డు కూడా ఆయనదే. అయితే 2019 వరకూ గూగుల్‌లో పనిచేస్తేనే పిచాయ్ తన తాజా షేర్లను విక్రయించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు దీర్ఘకాలం తమ వద్ద పనిచేయటంతో పాటు వారి ప్రణాళికలు కూడా దీర్ఘకాలికంగా ఉండేందుకే తాము ఈ పద్ధతిని పాటిస్తున్నట్లు గూగుల్ తెలియజేసింది. గత వారం తొలిసారిగా ఆల్ఫాబెట్ (గూగుల్) మార్కెట్ విలువ 554 బిలియన్ డాలర్లను దాటింది. అప్పటికి యాపిల్ మార్కెట్ విలువ 534 బిలియన్ డాలర్లే కావటంతో... ప్రపంచంలో అత్యధిక మారె ్కట్ క్యాప్ కలిగిన కంపెనీగా గూగుల్ ప్రథమ స్థానం దక్కించుకుంది.