ఇప్పటికి వంద మందితో డేటింగ్
అతనో చిత్రమైన వ్యక్తి. దేశీ పరదేశీ, జాతి మతాలు, కులమత భేదాలు, పిన్నా పెద్ద, యువతీ ముసలి తేడాల్లేకుండా.. హైక్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ తారతమ్యాలు పట్టించుకోకుండా.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వందమందితో డేటింగ్ చేశాడు. డేటింగ్ చేసిన వారిలో 21 ఏళ్ల యువతి మొదలుకొని, 105 ఏళ్ల బామ్మ వరకు ఉన్నారు. వారిలో అందగత్తెలు ఉన్నారు. కురూపులూ ఉన్నారు. అక్షరజ్ఞానం కలిగినవారు ఉన్నారు. నిరక్షర కుక్షులూ ఉన్నారు. డబ్బున్న వారే కాకుండా, రోడ్డుపై పూలమ్ముకునేవారు, పాలమ్ముకునేవారు, రోడ్లూడ్చే వారు కూడా ఉన్నారు.
జేబు లోంచి నయాపైసా ఖర్చు పెట్టకుండా ఏరోజుకు ఆ రోజు డేటింగ్ మహిళల డబ్బుతోనే కడుపు నింపుకుంటూ వచ్చాడు. ఒకరి ఖర్చులపై ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నాడు. మరొకరి ఖర్చుతో ఫుట్‌పాత్‌పై ఆవురావురుమంటూ విందారగించాడు. ఓ పేద యువతి డబ్బులతో పుచ్చకాయ మాత్రమే తిని ఆ రోజుకు అర్ధాకలితో పొద్దుపోనిచ్చాడు. అతను డేటింగ్ చేసినవారిలో గాయకురాలు, గేయ రచయిత్రి, నటి ఆండ్రియా జెర్మియా ఉన్నారు. 105 ఏళ్ల బామ్మ అలివేలు ఉన్నారు. ఇలా ఇతరుల డబ్బుతో కడుపు నింపుకున్న అతడు, ఏ రోజుకారోజు ఎంత డబ్బును తన కోసం ఖర్చు పెట్టించాడో అంతకు మరింత కలిపి అనాథ పిల్లలకు అన్నం పెడుతూ వచ్చాడు.
ఆ విచిత్ర వ్యక్తి పేరు సుందర్ రామ్. సినీ నటుడు, స్టేజ్ నటుడు, ఫొటోగ్రాఫర్, ఫ్యాషన్ డిజైనర్. చెన్నై నగరంలో ఉన్నాడు. అతని డేటింగ్ను చూసిన అతని స్నేహితులు అతన్ని 'ఇండియన్ ప్లేబాయ్' అని పిలుస్తారు. తాను మాత్రం అలాంటి వాడిని కాదని, శృంగారంతో తనకు సంబంధం లేదని, వివిధ రంగాల్లోని మహిళల్లో సాధికారిత తీసుక రావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.
13 ఏళ్లుగా ఇల్లుకదలని ఓ బామ్మను డేటింగ్ పేరిట ఆమె సొంత ఊరుకు తీసుకెళ్లానని, ఆమె జీవితానుభవాలను పంచుకొని ఓ అనందమైన అనుభూతిని పొందానని చెప్పాడు. తాను డేటింగ్ చేసిన వంద మందిలో వంద మందిని ఆ రోజుకు నిజంగా ప్రేమించానని తెలిపాడు. కొంతమందిలో అందం చూసి, మరికొంత మందిలో అందమైన మనసు చూసి నిజంగా వారి పట్ల ఆకర్షితుడినైన సందర్భాలు కూడా లేకపోలేదని చెప్పాడు.
సుందర్ రామ్ తాను డేటింగ్ చేసిన ప్రతి మహిళ గురించి తన ఫేస్బుక్ పేజీలో వివరించాడు. కొందరితో డేటింగ్‌కు తానే ప్రతిపాదించానని, కొంతమంది మహిళలు సామాజిక వెబ్సైట్ల ద్వారా వారే ప్రతిపాదించారని తెలిపాడు. మహిళల్లో సాధికారత తీసుకురావడం కోసం తనలాగే ఇతర మగవాళ్లు డేటింగ్ చేయాలని కోరుకుంటున్నానని, అయితే అందరు మగవాళ్లు ఒకలా ఉండరు కనుక మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో చెప్పలేనని అన్నాడు.