నరైన్ ఆల్‌రౌండ్ షో
►కోల్‌కతా ఘనవిజయం
►లిన్ మెరుపులు
►రాతమారని బెంగళూరు
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం నిజంగానే చిన్నబోయింది. కోల్‌కతా ఓపెనర్ల ధాటికి బౌండరీ లైన్ చెదిరిపోయింది. తమ సొంతగడ్డపైనే బెంగళూరు బౌలర్లు కకావికలమయ్యారు. ఈ సీజన్లో అనూహ్యంగా ఓపెనర్‌గా వచ్చి మెరుపులు మెరిపిస్తున్న సునీల్ నరైన్ (17 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో అచ్చమైన ఓపెనర్‌గా ఒదిగిపోయాడు. మరో ఓపెనర్ క్రిస్ లిన్ (22 బంతుల్లో 50; 5 ఫోర్టు, 4 సిక్సర్లు) కూడా రెచ్చిపోవడంతో బెంగళూరు పరాజయాల వరుస మారలేదు.
ఆదివారం జరిగిన పోరులో గంభీర్ సేన 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. తర్వాత కోల్‌కతా 15.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 చేసి గెలిచింది. నరైన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆరే ఓవర్లలో 106/0
లక్ష్యఛేదనలో కోల్‌కతా ‘పవర్’ చాటింది. లిన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన నరైన్ చెలరేగాడు. లిన్ తొలి ఓవర్లో 4, 4, 6తో 14 పరుగులు బాదేశాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 34/0. ఇందులో నరైన్వి ఐదే పరుగులు ( లిన్ 29). నాలుగో ఓవర్ మొదలైంది... నరైన్ జోరు షురువైంది. బద్రీ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 4, 2, 1. అంతే... అంతే నరైన్ (30) లిన్‌ను అధిగమించేశాడు. అరవింద్ వేసిన ఐదో ఓవర్లో 2, 4, 4, 4, 6తో నరైన్ 15 బంతుల్లో అర్ధసెంచరీ (5 ఫోర్లు, 4 సిక్సర్లు) పూర్తయింది. కానీ మరో బంతి మిగిలింది. అదీ కూడా ఫోర్! ఇలా ఒకర్ని మించి ఒకరు బంతిని శిక్షించడంతో పవర్ ప్లే స్కోరు 106/0. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్కోరిది. తర్వాత మిగతా లాంఛనం ఆలస్యమైనా...15.1 ఓవర్లలో పూర్తయింది. గ్రాండ్‌హోమ్ 31, గంభీర్ 14 పరుగులు చేశారు.
గేల్ ‘ఫెయిల్’
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు తొలిబంతికే గేల్‌ను, 20 పరుగులకే కోహ్లి (5)ని కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ వీళ్లిద్దరిని పెవిలియన్ చేర్చాడు. డివిలియర్స్ (10)ను నరైన్ ఔట్ చేశాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బెంగళూరును మన్దీప్ సింగ్ (43 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (47 బంతుల్లో 75 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకున్నారు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. మన్దీప్ కూడా నరైన్ స్పిన్ ఉచ్చులోనే చిక్కుకోగా తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ (8), పవన్ నేగి (5) విఫలమయ్యారు. చివర్లో హెడ్ సిక్సర్లతో విరుచుకుపడటంతో పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచగలిగింది.
► 1 ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పవర్ ప్లే స్కోరు 106/0. గతంలో చెన్నై రికార్డు (100/2) బద్దలైంది.
► 2 ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేసిన నరైన్. యూసుఫ్ పఠాన్ కూడా 15 బంతుల్లోనే బాదేశాడు. వీళ్లిద్దరూ కోల్‌కతా ఆటగాళ్లే!