'యువరాజ్ ను ఆడించండి'
సిడ్నీ: టీమిండియా కష్ట సమయాల్లో మ్యాచ్ విన్నర్ పాత్ర పోషించే స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సేవలను ట్వంటీ20 వరల్డ్ కప్‌లో వినియోగించుకోవాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంలో యువరాజ్ పాత్ర అభినందనీయమని గవాస్కర్ పేర్కొన్నాడు. చివరి టీ 20లో ఆఖరి ఓవర్ లో భారత్ విజయానికి 17 పరుగులు అవసరమైన సమయంలో యువరాజ్ తొలి రెండు బంతులను ఫోర్, సిక్సర్ గా మలచిన తీరు నిజంగా అద్భుతమన్నాడు. ఈ రెండు షాట్లను కొట్టి సురేష్ రైనాపై ఒత్తిడి తగ్గించడంతోనే టీమిండియా విజయం సాధ్యమైందన్నాడు.
యువరాజ్ లో ఇంకా అమోఘమైన శక్తి ఉందనడానికి అతను మూడు విభాగాల్లోనూ(బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్) ఆకట్టుకోవడమే నిదర్శనమన్నాడు. యువరాజ్ ఆట తీరుకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సహనం పాటిస్తేనే మంచిదని గవాస్కర్ సలహా ఇచ్చాడు. త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్‌లో యువీని జట్టులో సభ్యుడిగా కొనసాగించాలన్నాడు.