కొత్త పథకాలకు ‘సన్‌సెట్ డేట్’!
న్యూఢిల్లీ: కొత్త పథకాలపై కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఒరవడిని తేనుంది. ఇక నుంచి కొత్తగా ప్రవేశపెట్టే పథకాలకు ముగింపు తేదీ (సన్‌సెట్ డేట్)ని కూడా ప్రకటించనున్నారు. దీనివల్ల ఆయా పథకాలు నిర్దేశించిన సమయం తర్వాత రద్దవుతాయి. ప్రభుత్వ వ్యయాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు, ప్రభుత్వం తెచ్చే ప్రతీ కొత్త పథకానికి ముగింపు తేదీ కూడా ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనివల్ల ఆయా పథకాల ప్రయోజనాలను సమీక్షించవచ్చని, అర్హులైన లబ్ధిదారులకు సహాయం అందించడానికి సులువవుతుందన్నారు.
ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తదుపరి వచ్చే ప్రభుత్వాలు రద్దు చేస్తుండటంతో ఇది రాజకీయ దుమారానికి తావిస్తోంది. ఇప్పుడు చట్టాల్లో, పథకాల్లో ప్రారంభ సమయంలోనే ముగింపు తేదీని ప్రకటించడంపై విస్తృతంగా చర్చకు తెరతీసినట్లయింది. సన్‌సెట్ క్లాజ్‌ను పొందుపరిస్తే నిర్ధిష్ట చట్టాలు, పథకాల ప్రయోజనాలు చేకూరిన తర్వాత అవి ఆటోమేటిగ్గా రద్దవుతాయని న్యాయ కమిషన్ ఇటీవల కేంద్రానికి ప్రతిపాదన చేసింది. ఏళ్ల క్రితం తెచ్చిన, భారీగా ఉన్న పథకాలు వాస్తవంలో లేవని, ఇవి చట్టాల పుస్తకాల్లోనే కొనసాగుతున్నాయని కమిషన్ స్పష్టంచేసింది.