ఒడిశాలో కేర్ ఆసుపత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కేర్ హాస్పిటల్స్, ఒడిశా ప్రభుత్వం చేతులు కలి పాయి. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని జార్సుగూడలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆసుపత్రిని 15 ఏళ్లపాటు కేర్ నిర్వహించనుంది. 100 పడకల సామర్థ్యంతో రానున్న ఈ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ కేర్ హాస్పిటల్కు ప్రభుత్వం రూ.75 కోట్ల వ్యయం చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటవుతున్న ఈ హాస్పిటల్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి అవుతుంది.
పశ్చిమ ఒడిశాలో ఇటువంటి ఆసుపత్రి ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. హాస్పిటల్ సామర్థ్యంలో 50 శాతం పేదలకు కేటాయిస్తారు. వీరికి ఉచితంగా సేవలు అందిస్తారు. ఒడిశా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో మంగళవారం ఒప్పందం జరిగింది. కార్యక్రమానికి కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ బి.సోమరాజు, సీవోవో కసి రాజు పాల్గొన్నారు. కేర్ ఖాతాలో ప్రస్తుతం 14 ఆసుపత్రులు ఉన్నాయి.