breaking news
Super-specialty medical services
-
ఎయిమ్స్ తరహాలో రిమ్స్
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఇక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) స్థాయిలో అభివృద్ధి చెందనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్ఎస్వై) పథకం కింద రిమ్స్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఇక రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలతో సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవులు అందనున్నాయి. గత ఫిబ్రవరిలోనే అప్పటి యూపీఏ సర్కారు ఈ పథకం కింద రిమ్స్‌ను ప్రకటించింది. సరైన మార్గదర్శకాలు చేసిన అనంతరం నిధులు విడుదల చేయాలని భావించింది. దేశంలో 39 వైద్య కళాశాలలు ఎంపిక చేయగా, మన రాష్ట్రంలో వరంగల్ కాకతీయ, రిమ్స్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వైద్య కళాశాలలు బలోపేతం చేయడం, రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రూ.150 కోట్ల నిధులతో.. పీఎంఎస్ఎస్వై పథకం కింద కేటాయించిన రూ.150 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు సమకూర్చనున్నాయి. ఈ నిధుల్లో రూ.90 కోట్లు ఆస్పత్రి భవనాల కోసం.. రూ.60 కోట్లు వైద్య పరికరాల కోసం వెచ్చించనున్నట్లు సమాచారం. నాలుగేళ్లలో ఎయిమ్స్ తరహాలో రిమ్స్ వైద్య కళాశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందడుగేసింది. రిమ్స్‌లో ప్రస్తుతం ఉన్న 21 వైద్య విభాగాలతోపాటు మరో 25 వైద్య విభాగాల్లో సూపర్‌స్పెషాలిటీ వైద్య నిపుణులు చికిత్సలు అందిస్తారు. ఎంఆర్ఐ యూనిట్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థ్రోపెడిక్, అనస్తీయాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రోలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 500 పడకలు కలుపుకుని మరో 500 పడకల సామర్థ్యంతో సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటితోపాటు అదనంగా 200 మంది వైద్యులు, ఇతర సిబ్బంది నియామకమవుతారు. ప్రత్యేక బృందం పరిశీలన తర్వాతే.. రిమ్స్ ఆస్పత్రికి సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందించేందుకు కావాల్సిన సౌకర్యాలు, ఆస్పత్రి భవనాల నిర్మాణానికి సంబంధించి స్థలం, తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి ఓ ప్రత్యేక బృందం పరిశీలనకు వస్తుంది. పరిశీలన అనంతరం బృందం సభ్యులు నివేదికను ప్రభుత్వానికి అందిస్తారు. అంనతరం కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. ప్రస్తుతం మనకు రిమ్స్ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారి పక్కన కావాల్సిన స్థలం అందుబాటులో ఉంది. ప్రభుత్వ బృందం రిమ్స్ పరిశీలనకు వచ్చినప్పుడు ఈ స్థలాన్ని ఆస్పత్రి భవనాలు నిర్మించేందుకు రిమ్స్ అధికారులు చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆ పథకం కింద రూ.150 కోట్లను రిమ్స్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను అడుగగా.. ఈ నిధులతో రిమ్స్ మెరుగుపడుతుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే దీనికి సంబంధించి అన్ని అంశాలతో నివేదిక తయారు చేస్తాం అన్నారు. -
ఈఎస్ఐ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు
మార్కాపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ డిస్పెన్సరీ) ఆస్పత్రుల పరిధిలో ఉండే కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు వివిధ ప్రైవేటు వైద్యశాలలతో అనుసంధానం చేసినట్లు ఆ సంస్థ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ జి.రవికుమార్ తెలిపారు. మంగళవారం మార్కాపురంలోని ఈఎస్ఐ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ రీజనల్ పరిధిలో 49 ఈఎస్ఐ ఆస్పత్రులు, 24 ప్యానల్ క్లినిక్‌లు (ఈఎస్ఐ కార్డుదారులకు సేవలందించే ప్రైవేటు ఆస్పత్రులు) ఉన్నాయని చెప్పారు. కంపెనీల యజమానులు తమ వాటాగా ఒక్కో కార్మికుడు, ఉద్యోగికి 4.75 శాతం, ఉద్యోగి 1.75 శాతం చెల్లిస్తే ఈఎస్ఐ వైద్యశాలల్లో సేవలు పొందవచ్చని చెప్పారు. అవసరమైనచోట రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి కార్పొరేట్ వైద్యశాలలకు పంపుతామని తెలిపారు. ఈఎస్ఐ కార్డు కలిగిన కార్మికులు, ఉద్యోగులు ఒంగోలులో 5 వేల మంది వరకు ఉన్నారన్నారు. అక్కడ తమ డిస్పెన్సరీ లేకపోవడంతో ప్యానల్ క్లినిక్ ద్వారా సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. మార్కాపురంలో పలకల పరిశ్రమ ఉండటంతో ఈఎస్ఐ డిస్పెన్సరీని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈఎస్ఐ వైద్యశాలల్లో మందుల కొరత లేదని, అవసరమైతే ఎటువంటి మందులనైనా అందిస్తామని తెలిపారు. రూ.15 వేలలోపు జీతం పొందుతున్న ఉద్యోగి, కార్మికుడు ఈఎస్ఐ పరిధిలోకి వస్తారని చెప్పారు. అనంతరం జాయింట్ డెరైక్టర్ స్థానిక ఆస్పత్రిలోని రికార్డులను తనిఖీ చేశారు. రోగులను విచారణ చేసి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డిస్పెన్సరీ వైద్యాధికారి బి.శరత్ ఉన్నారు. ఒంగోలులో.. ఒంగోలు సెంట్రల్ : సింగరాయకొండలో త్వరలో ఈఎస్ఐ ప్యానల్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తామని జేడీ రవికుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని వివిధ ఈఎస్ఐ వైద్యశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలులో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. జిల్లాలో అమృతా హార్ట్ హాస్పిటల్, సంఘమిత్ర సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఈఎస్ఐ రిఫరల్ వైద్యశాలలుగా ఉన్నాయన్నారు. ఒంగోలులోని సుందరయ్య భవన్ రోడ్డులో ఉన్న శాంతి నర్సింగ్ హోంలో ప్యానల్ క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్టూరులో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ వైద్యశాలకు ఎన్నికల తర్వాత సిబ్బందిని నియమిస్తామని వివరించారు. ప్రస్తుతానికి గుంటూరు నుంచి వైద్య సిబ్బంది వచ్చి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. చీమకుర్తి ఈఎస్ఐ ప్యానల్ క్లినిక్‌లో రికార్డుల నిర్వహణ సరిగాలేదని గుర్తించినట్లు చెప్పారు.