జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఇక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) స్థాయిలో అభివృద్ధి చెందనుంది.
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఇక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) స్థాయిలో అభివృద్ధి చెందనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్‌ఎస్‌వై) పథకం కింద రిమ్స్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఇక రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలతో సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవులు అందనున్నాయి. గత ఫిబ్రవరిలోనే అప్పటి యూపీఏ సర్కారు ఈ పథకం కింద రిమ్స్‌ను ప్రకటించింది. సరైన మార్గదర్శకాలు చేసిన అనంతరం నిధులు విడుదల చేయాలని భావించింది.
దేశంలో 39 వైద్య కళాశాలలు ఎంపిక చేయగా, మన రాష్ట్రంలో వరంగల్ కాకతీయ, రిమ్స్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వైద్య కళాశాలలు బలోపేతం చేయడం, రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
రూ.150 కోట్ల నిధులతో..
పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద కేటాయించిన రూ.150 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు సమకూర్చనున్నాయి. ఈ నిధుల్లో రూ.90 కోట్లు ఆస్పత్రి భవనాల కోసం.. రూ.60 కోట్లు వైద్య పరికరాల కోసం వెచ్చించనున్నట్లు సమాచారం. నాలుగేళ్లలో ఎయిమ్స్ తరహాలో రిమ్స్ వైద్య కళాశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందడుగేసింది.
రిమ్స్‌లో ప్రస్తుతం ఉన్న 21 వైద్య విభాగాలతోపాటు మరో 25 వైద్య విభాగాల్లో సూపర్‌స్పెషాలిటీ వైద్య నిపుణులు చికిత్సలు అందిస్తారు. ఎంఆర్‌ఐ యూనిట్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థ్రోపెడిక్, అనస్తీయాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రోలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 500 పడకలు కలుపుకుని మరో 500 పడకల సామర్థ్యంతో సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటితోపాటు అదనంగా 200 మంది వైద్యులు, ఇతర సిబ్బంది నియామకమవుతారు.
ప్రత్యేక బృందం పరిశీలన తర్వాతే..
రిమ్స్ ఆస్పత్రికి సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందించేందుకు కావాల్సిన సౌకర్యాలు, ఆస్పత్రి భవనాల నిర్మాణానికి సంబంధించి స్థలం, తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి ఓ ప్రత్యేక బృందం పరిశీలనకు వస్తుంది. పరిశీలన అనంతరం బృందం సభ్యులు నివేదికను ప్రభుత్వానికి అందిస్తారు. అంనతరం కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. ప్రస్తుతం మనకు రిమ్స్ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారి పక్కన కావాల్సిన స్థలం అందుబాటులో ఉంది.
ప్రభుత్వ బృందం రిమ్స్ పరిశీలనకు వచ్చినప్పుడు ఈ స్థలాన్ని ఆస్పత్రి భవనాలు నిర్మించేందుకు రిమ్స్ అధికారులు చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆ పథకం కింద రూ.150 కోట్లను రిమ్స్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను అడుగగా.. ఈ నిధులతో రిమ్స్ మెరుగుపడుతుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే దీనికి సంబంధించి అన్ని అంశాలతో నివేదిక తయారు చేస్తాం అన్నారు.