రాష్ట్రంలోని ఈఎస్‌ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ డిస్పెన్సరీ) ఆస్పత్రుల పరిధిలో ఉండే కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు వివిధ ప్రైవేటు వైద్యశాలలతో అనుసంధానం చేసినట్లు ఆ సంస్థ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ జి.రవికుమార్ తెలిపారు.
మార్కాపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని ఈఎస్‌ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ డిస్పెన్సరీ) ఆస్పత్రుల పరిధిలో ఉండే కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు వివిధ ప్రైవేటు వైద్యశాలలతో అనుసంధానం చేసినట్లు ఆ సంస్థ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ జి.రవికుమార్ తెలిపారు. మంగళవారం మార్కాపురంలోని ఈఎస్‌ఐ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ రీజనల్ పరిధిలో 49 ఈఎస్‌ఐ ఆస్పత్రులు, 24 ప్యానల్ క్లినిక్‌లు (ఈఎస్‌ఐ కార్డుదారులకు సేవలందించే ప్రైవేటు ఆస్పత్రులు) ఉన్నాయని చెప్పారు.
కంపెనీల యజమానులు తమ వాటాగా ఒక్కో కార్మికుడు, ఉద్యోగికి 4.75 శాతం, ఉద్యోగి 1.75 శాతం చెల్లిస్తే ఈఎస్‌ఐ వైద్యశాలల్లో సేవలు పొందవచ్చని చెప్పారు. అవసరమైనచోట రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి కార్పొరేట్ వైద్యశాలలకు పంపుతామని తెలిపారు. ఈఎస్‌ఐ కార్డు కలిగిన కార్మికులు, ఉద్యోగులు ఒంగోలులో 5 వేల మంది వరకు ఉన్నారన్నారు. అక్కడ తమ డిస్పెన్సరీ లేకపోవడంతో ప్యానల్ క్లినిక్ ద్వారా సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు.
మార్కాపురంలో పలకల పరిశ్రమ ఉండటంతో ఈఎస్‌ఐ డిస్పెన్సరీని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈఎస్‌ఐ వైద్యశాలల్లో మందుల కొరత లేదని, అవసరమైతే ఎటువంటి మందులనైనా అందిస్తామని తెలిపారు. రూ.15 వేలలోపు జీతం పొందుతున్న ఉద్యోగి, కార్మికుడు ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తారని చెప్పారు. అనంతరం జాయింట్ డెరైక్టర్ స్థానిక ఆస్పత్రిలోని రికార్డులను తనిఖీ చేశారు. రోగులను విచారణ చేసి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డిస్పెన్సరీ వైద్యాధికారి బి.శరత్ ఉన్నారు.
ఒంగోలులో..
ఒంగోలు సెంట్రల్ : సింగరాయకొండలో త్వరలో ఈఎస్‌ఐ ప్యానల్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తామని జేడీ రవికుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని వివిధ ఈఎస్‌ఐ వైద్యశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలులో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. జిల్లాలో అమృతా హార్ట్ హాస్పిటల్, సంఘమిత్ర సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఈఎస్‌ఐ రిఫరల్ వైద్యశాలలుగా ఉన్నాయన్నారు. ఒంగోలులోని సుందరయ్య భవన్ రోడ్డులో ఉన్న శాంతి నర్సింగ్ హోంలో ప్యానల్ క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్టూరులో ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ వైద్యశాలకు ఎన్నికల తర్వాత సిబ్బందిని నియమిస్తామని వివరించారు. ప్రస్తుతానికి గుంటూరు నుంచి వైద్య సిబ్బంది వచ్చి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. చీమకుర్తి ఈఎస్‌ఐ ప్యానల్ క్లినిక్‌లో రికార్డుల నిర్వహణ సరిగాలేదని గుర్తించినట్లు చెప్పారు.