రిమ్స్, కేఎంసీల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలు
* రూ.150 కోట్ల చొప్పున వాటి అనుబంధ ఆస్పత్రులకు నిధులు
* ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం
* ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణాలకు అంగీకారం
* కేన్సర్, నెఫ్రాలజీ సహా ఎనిమిది కీలక వైద్య సేవలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) కింద వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ), ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్) ల్లోని అనుబంధ ఆస్పత్రులకు సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పిస్తూ, అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల ను ఆమోదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒక్కో వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రికి పీఎం ఎస్ఎస్వై కింద రూ.150 కోట్లు కేటాయించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రూ.120 కోట్లు కేంద్ర వాటా, రూ.30 కోట్లు రాష్ట్ర వాటా ఉంటుంది.
ఆయా ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను విస్తరించడం, ఆధునిక వైద్య సేవ లు, నిర్ధారణ పరికరాలను అందుబాటులోకి తేవడం ఈ పథకం ప్రధానోద్దేశం. తద్వారా ఆధునిక వైద్యాన్ని జిల్లాలకు అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యం. ఈ పథకంపై ఇటీవల పాట్నాలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, వైద్య విద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ రెండు అనుబంధ ఆస్పత్రుల్లో చేపట్టాల్సిన పనులు, సేవల ను ఆ సమావేశంలో అధికారులు ప్రతిపాదించా రు. వాటిని ఆమోదిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఒక్కో ఆస్పత్రిలో ఎనిమిది సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
కేంద్రం ఆమోదించిన ప్రతిపాదనల ప్రకారం... కేఎంసీ, రిమ్స్‌లకు చెందిన అనుబంధ ఆసుపత్రులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారు. ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ భవనాలను నిర్మిస్తారు. ఒక్కో దానిలో 8 వైద్య సేవలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పిస్తారు. వరంగల్‌లోని కేఎంసీలో న్యూరో సర్జరీ, న్యూరాలజీ, కార్డియాలజీ, కార్డియో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, కేన్సర్ సంబంధిత జబ్బులకు అధునాతన వైద్య చికిత్సలు అందిస్తారు. రిమ్స్‌లో కూడా దాదాపు ఇటువంటి వైద్య సేవలనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఈ సదుపాయాలతో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు, ఆ చుట్టుపక్క జిల్లాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం రాజధానికి పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. అంతేగాక, ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సుకే పరిమితమైన ఆయా క ళాశాలలకు పీజీ సీట్లు కూడా రానున్నాయి. దీంతో మారుమూల గ్రామాల్లోని సామాన్యులకు సమీపంలోనే ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంటున్నారు.